నెల్లూరు: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకపోతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన బడా కంపెనీల పేర్లు సిబిఐ ఛార్జీషీటులో లేవని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేయకుంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు.
జగన్‌కు జనంలో తిరిగే నైతిక అర్హత లేదన్నారు. ఆయన చెప్పినట్లుగా ఏమైనా నైతిక విలువలు ఉంటే వెంటనే కోర్టులో సరెండర్ కావాలని సూచించారు. జగన్‌ను అరెస్టు చేయక పోవడానికి ఆయన ఏమైనా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెసు జగన్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సిబిఐ పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను తన ఛార్జీషీటులో పేర్కొందని విమర్శించారు. ఎఫ్ఐఆర్, ఛార్జీషీటులో మొదటి ముద్దాయి జగన్‌ను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలేమిటన్నారు. సురేష్ కల్మాడీ, కనిమొళి, అమర్ సింగ్‌లను అరెస్టు చేసినప్పుడు జగన్‌ను అరెస్టు చేయక పోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.
జగన్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని వైయస్సార్ కాంగ్రెసు నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించడంపై ఆయన మండిపడ్డారు. సంఘ విద్రోహ శక్తులను ప్రజల్లో తిరగనీయడం సరికాదని, వెంటనే జగన్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగ్ రిపోర్టులో, సిబిఐ విచారణలో జగన్ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు ఉన్నందున ఆయనే స్వచ్చంధంగా లొంగిపోవాలని సూచించారు. కాగా శనివారం సిబిఐ జగన్ ఆస్తుల కేసులో కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment