వెంకటగిరి : వెంకటగిరి మండలంలోని పూలరంగడపల్లి, బసవాయిగుంట ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆమ్రణలు చేస్తోన్నా రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మంగళవారం సర్వే నెంబర్ 31/7లో కొంతమంది రాజకీయ చోటా నాయకులు రెవెన్యూ విఆర్‌ఓ అండదండలతో జెసిబిని పెట్టి రాత్రి నుంచి తెల్లవారేంత వరకు చెట్లు తొలగించి ఆక్రమణలకు పూనుకున్నారు. గతంలో భూఆక్రమణలకు సంబంధించి పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడంతో 31/7లో 270ఎకరాలు, 31/2లో 690, 74లో 145ఎకరాలకు 145సెక్షన్‌ను తహశీల్దార్ అమలు చేశారు. ఈపొలంలో ఎవరు ప్రవేశించిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈఆదేశాల అనుసారం భూముల ఆక్రమణకు ప్రయత్నించిన సిపిఐ కార్యకర్తలు, నాయకులపై 100మందికి పైగా కేసులు బనాయించారు. ఇదే భూముల్లో భూస్వాములు, బడాబాబులు రెవెన్యూ అధికారుల అంగబలం, అర్ధంబలంలో లోబరుచుకొని యథేచ్ఛగా జెసిబిలు పెట్టి కోట్లరూపాయల విలువగల భూములను కబ్జాచేస్తున్నా అధికారులు ప్రేక్షపాత్ర పోషిస్తున్నారని ఆరోపణలున్నాయి. మంగళవారం విఆర్‌ఓ రామ్మూర్తికి సమాచారం తెలిసిన వెంటనే తలారి యుంగధర్‌ను పంపి జెసిబిని పోలీసులకు అప్పజెప్పామని ప్రజాశక్తికి తెలిపారు. సిఐ అబ్ధుల్ కరీంకు ఈసమాచారం తెలిసిన వెంటనే ఎఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది ద్వారా జెసిబిను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఆదేశాల ప్రకారమే 145సెక్షన్‌లోని భూముల్లో ప్రవేశిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అన్వర్‌బాషా తెలిపారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెంకటగిరి చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు కబ్జాదారుల వశమవుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇకనైన సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఈఆక్రమణలకు ప్రొత్సహించి అండగా ఉండి లబ్ధిపొందుతున్న అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment