సూళ్ళూరుపేట టౌన్: పీఎస్‌ఎల్‌వీ - సీ16 రాకెట్ ప్రయోగం విజయవంతం అందరి సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. బుధవారం రాకెట్ ప్రయోగానంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది చివరిలోగా మూడు పిఎస్‌ఎల్వీ ప్రయోగాలు ఉండగా, ఒక జిఎస్‌ఎల్వీ ప్రయోగం ఉంటుందన్నారు. విజయదరహాసంతో ఇస్రో చైర్మన్ ఉల్లాసంగా మాట్లాడం బట్టి చూస్తే భవిష్యత్ రాకెట్ విజయాలపై అంకుటిత దీక్ష, పట్టుదల ఉన్నట్లు కనిపిస్తోంది. పిఎస్‌ఎల్వీ సీ17, సీ18, సీ19 రాకెట్ ప్రయోగాలు చేపడుతున్నట్లు, ఇప్పటికే రెండవ లాంచ్ ప్యాడ్‌లో పిఎస్‌ఎల్వీ - సీ17కు చెందిన పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. జూన్ చివరవారంలో గాని జూలై మాసంలో ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. కిలోల బరువుగల జిశాట్ 12 పేరుతో పంపుతున్నామన్నారు. ఇందులో టెలి కమ్యూనికేషన్ వ్యవస్ధకు చెందిన 12 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయన్నారు. సీ18, సీ19 రాకెట ప్రయోగాలు ఈ ఏడాదిలోనే ఉంటాయని పేర్కొన్నారు.
జిఎస్‌ఎల్వీపై అధ్యయనం పూర్తి
గత ఏడాదిలో ప్రయోగించిన రెండు జిఎస్‌ఎల్వీ రాకెట్ ప్రయోగాలపై పూర్తి విశ్లేషణ పూర్తి అయిందని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలోగ రష్యన్ క్రయోజినిక్ ఇంజన్ సహాయంతో ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా 2012లో చేపట్టే జిఎస్‌ఎల్వీ, పిఎస్‌ఎల్వీ ప్రయోగాలతో ఎంతగానో ఖ్యాతిని ఆర్జించనున్నట్లు రాధాకృష్ణన్ వ్యక్త పరిచారు.
చంద్రయాన్ -2 ప్రయోగానికి నిధులు కేటాయింపు
చల్లని జాబిలి చంద్రుని వద్ద నిఘూడమై వున్న మట్టి, నీరు ఖణిజాలతోపాటు చంద్రుని వెనుకవైపు ఏమి దాగివుంది అనే విషయాలను తెలుసుకొనేందుకు చంద్రయాన్ -2 ప్రయోగానికి చెందిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఇస్రో చైర్మన్ తెలియచేశారు. ఇందుకోసం రూ. 462 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో లాండర్, రోవర్ రెండు ఉపకరణాలు ఉంటాయని, ఇందులో రోవర్‌ను రష్యా సాంకేతికాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు.
ఎల్‌వి మార్క్ 3 రాకెట్‌కు పరీక్షలు జరుగుతున్నాయి
భారీ బరువుగల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన జిఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి చెందిన ఏర్పాట్లు సాగుతన్నాయని రాధాకృష్ణన్ తెలిపారు. ఇప్పటికే గత ఏడాది కష్టమైన దశకు చెందిన పరీక్షల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. మరో రెండు నెలలో శ్రీహరికోటలో మరో దశకు చెందిన పరీక్షను నిర్వహించనున్నట్లు తెలియచేశారు.
2016లో మూన్ రైజ్
నాసా సహకారంతో 2016లో మూన్ రైజ్ రాకెట్ ప్రయోగానికి చెందిన విషయాలపై అధ్యయనం చేస్తున్నామని, ఇందుకోసం జెట్ ప్రోపల్షన్ లేబొరేటరీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
రిమోట్ సెన్సింగ్ వ్యవస్ధ ఎంతగానో మెరుగైంది
దూర పరిశీలన (రిమోట్ సెన్సింగ్) ఉపగ్రహాలు ఎంతగానో ఇస్రోకు సేవలు అందిస్తున్నాయని చైర్మన్ కితాబులిచ్చారు. ముఖ్యంగా దేశానికి చెందిన వనరుల అధ్యయనానికి రిమోట్ సెన్సింగ్ అందిస్తున్న సేవలతో రుణపడివున్నామన్నారు. వ్యవసాయం, నానాటికి పెరిగిపోతున్న పట్టణాల సముదాయం, సముద్రాల నీటి మట్టాలుకు చెందిన ఛాయాచిత్రాలను అతి దగ్గరగా సేకరించేందుకు వీలుగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయన్నారు.
జిశాట్ 8 ఉపగ్రహానికి ముహర్తం ఖరారు
అతి బరువైన ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి పంపే సామర్ధ్యం ఉన్న ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ నుండి మే 19న ఏరియన్ 5 రాకెట్ ద్వార జిశాట్ 8 ఉపగ్రహాన్ని అంతరిక్ష్యంలోకి పంపనున్నట్లు ఇస్రో చైర్మన్ సంతోషాలనడుమ తెలిపారు. టెలి కమ్యూనికేషన్ వ్యవస్ధకు చెందిన 24 ట్రాన్స్‌పాండర్లను ఉపగ్రహంలో పొందుపరిచినట్లు తెలిపారు.
పేరు పేరునా అభినందనలు
పిఎస్‌ఎల్వీ - సీ16 రాకెట్ విజయం వెనుక ఇస్రోకు చెందిన అన్ని రంగాల ఉద్యోగుల కృషి ఉందని రాధాకృష్ణన్ తెలిపారు. పీఎస్‌ఎల్వీ ప్రయోగంలో కృషి చేసిన సీనియర్ శాస్తవ్రేత్తలు పిఎస్ రాఘవన్ , డాక్టర్ టి.కె. అలెక్స్, ఎస్. రామకృష్ణన్, షార్ డైరెక్టర్ చంద్ర వదన్ దత్తన్, జి. రవీంద్రనాధ్, పి. కున్హ్ని కృష్ణన్, డాక్టర్ ఆర్ ఆర్ వావ్ లింగ్, జయవర్ధన్, ఎం వెంకటరావు, డివిఏ రాఘవమూర్తి, పలువురు శాస్తవ్రేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment