Wednesday, February 24, 2010
కొండపై నిండు కుటుంబం ఆత్మహత్య
తిరుమల, మేజర్‌న్యూస్ : జీవనం కోసం చేసిన అప్పులు తీర్చలేక... ఆర్థిక బాధలు తట్టుకోలేక... బతుకు పోరాటంలో వెనుకబడి... దిక్కుతోచని స్థితిలో... జీవనం గడవటం కష్టంగా మారిన తరుణంలో... నెల్లూరుకు చెందిన ఒక కుటుంబం తిరుమలలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు.తిరుమల డిఎస్పీ కథనం మేరకు... నెల్లూరు గ్రంథాలయం పక్కనవున్న శ్రీరంగరాజపురం నివాసి నారాయణమూర్తి కుటుంబ సమేతంగా సోమవారం తిరుమలకు విచ్చేశారు. కొండపై హిల్‌వ్యూ 646ఎస్ గదిని ప్రసాద్, ఒంగోలు చిరునామాతో అద్దెకు తీసుకున్నారు. తిరుమలలో అన్ని ప్రాంతాలను సందర్శించి, పిల్లలకు భోజనం పెట్టి నిద్రపుచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న నాని అలియాస్ నారాయణమూర్తి (46), భార్య హేమలత (37), తల్లి శ్యామలమ్మ (70), తమ్ముడు సోములు (32) తమవెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును సీతల పానీయంలో కలిపి తాగి సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గది నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో విధి నిర్వహణలో ఉన్న దబేదార్ నాగప్ప గది వద్ద పరిశీలించి ఎవరో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఇఓ ఉమాపతి, టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గది తలుపులు తెరవగా పిల్లలు ఏడుస్తూ బయటకు వచ్చారు. అప్పటికే వారి తల్లిదండ్రులు మృతి చెందారు. గదిలోవున్న పిల్లలు మందు ఘాటుకు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం పిల్లలను అశ్విని వైద్యశాలకు తరలించారు. చిన్నారి కుశలనందిని, వెంకటరామచంద్రలకు టిటిడి మెరుగైన వైద్యం అందించింది. టిటిడి ఇఒ కృష్ణారావు, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, ముఖ్య భద్రతాధికారి ఎం.కె.సింగ్, రిసెప్షన్ డిప్యూటీ ఇఓలు రాజేంద్రుడు, ఉమాపతి, ఓఎస్‌డి చిన్నంగారి రమణ తదితరులు మృతదేహాలను పరిశీలించారు. గదిలో లభ్యమైన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి బంధువులకు సమాచారం అందించారు.గదిలో మృతుడు నారాయణమూర్తి రాసిన సూసైట్ నోట్, బంధువుల సమాచారం మేరకు వారు వైశ్య కులస్తులని, గతంలో చింతపండు వ్యాపారం చేసేవారని, ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో రూ. 28 లక్షల నష్టాలు రావటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, మా అంత్యక్రియలకు అప్పుచేసి ఖర్చు చేయరాదని ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. డిఎస్పీ ఆదినారాయణ ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌నాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా వైద్యశాలకు తరలించారు. అశ్వినిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఇ.ఓ పరామర్శించారు. అశ్విని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నాగభూషణం పిల్లలకు ప్రాణాపాయం లేదని తెలిపారు. అవసరమైతే పిల్లలకు స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించాలని ఇఓ ఆదేశాలు జారీ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment