online marketing

Monday, February 22, 2010

ఇక నగరంలోకార్పొరేట్‌ విద్యాసంస్థల జోరు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాలకు మాత్రమే పరిమితమై ఉన్న కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు నెల్లూరు నగరంలో హైస్కూలు స్థాయిలో తమ బ్రాంచ్‌లను ఏర్పాటుచేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గత విద్యాసంవత్సరంలో ఒక విద్యసంస్థ అడుగుపెట్టగా ఈసారి మరో సంస్థ అట్టహాసంగా సన్నాహాలు చేస్తోంది. వీటిని అనుసరించి మరికొన్ని ముందుకు రావడానికి ఉత్సాహం చూపుతున్నాయి. దీనితో ఇప్పటివరకూ జిల్లాలో అగ్రగామిగా ఉన్న కొన్ని విద్యాసంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కార్పొరేట్‌ స్థాయిలో ఆయా విద్యాసంస్థలు చేస్తున్న హడావుడికి తల్లిదండ్రులు అటు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఇంటర్మీడియట్‌, ఆపై తరగతులకు మాత్రమే కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అయితే హైస్కూలు రంగంలో కూడా ప్రాధాన్యతను పొందాలన్న దిశగా ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నాయి. హైస్కూలు విద్య వరకూ తమకు ఎదురులేదంటూ కొనసాగుతున్న జిల్లాలోని కొన్ని విద్యాసంస్థలకు ఈ కార్పొరే ట్‌ విద్యాసంస్థల రాక సమస్యలను కలిగిస్తోంది. కార్పొరేట్‌ స్థాయిలో ఫీజులను జిల్లాలో ఆరేడు విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు మెరుగైన విద్యాభ్యాసాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో పలువురు అడ్మిషన్ల కోసం ఈ విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. భారీ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కొన్ని విద్యాసంస్థలు ఆశించిన మేరకు విద్యాబోధన అందించలేకపోతున్నాయన్న మనోవేదన తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. అయితే పిల్లలను తిరుపతి, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు పంపించడం ఇష్టంలేక నగరంలో ఉన్న పాఠశాలల్లోనే మెరుగైన వాటిని ఎంపిక చేసుకుని వారు కోరిన మేరకు ఫీజులు చెల్లిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు 8, 9, 10 తరగతులకు 30 నుంచి 50 వేల రూపాయల వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. అయినా ఈ పాఠశాలల్లో అడ్మిషన్లు లభించడం సమస్యగానే ఉంటోంది. ఈ తరుణంలో గత విద్యాసంవత్సరంలో ఒక కార్పొరేట్‌ సంస్థ హైస్కూలును స్థాపించింది. భారీ ఎత్తున ప్రకటనలు, ప్రచారంతో తల్లిదండ్రులను ఆకర్శించడంతో అడ్మిషన్ల కోసం క్యూలు కట్టారు.దీనితో జిల్లాలో ప్రధానమైన విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ విద్యాసంవత్సరంలో నష్టాన్ని పూడ్చుకుందామని ప్రయత్నిస్తున్న తరుణంలో మరో కార్పొరేట్‌ సంస్థ హైస్కూలు స్థాయి విద్యాసంస్థను నెలకొల్పుతోంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో ప్రతిభ కల విద్యార్థులను ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో పిఆర్‌వోలు రంగంలో దిగారు. ఆయా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రస్తుతం తమ వద్ద పేరు రిజిష్టర్‌ చేయించుకుంటే అడ్మిషన్‌ సమయంలో కొంత డిస్కౌంట్‌ ఉంటుందని పేర్కొంటున్నారు. ఆలస్యం చేస్తే పోటీ పెరిగి ఎంత డబ్బు ఖర్చు చేసినా అడ్మిషన్‌ దొరకదని తొందరపెడుతున్నారు. ఇప్పటికే చాపకిందనీరులా పెద్ద సంఖ్యలో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చే కార్పొరేట్‌ సంస్థ వల్ల ఈ విద్యాసంవత్సరంలో కూడా తమకు ఇబ్బందులు తప్పేలా లేవని దాదాపుగా కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలపించే స్థానిక విద్యాసంస్థల నిర్వాహకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh