Monday, February 22, 2010
‘నవ్వుల రేడు’ పద్మనాభంకు సింహపురితో అనుబంధం
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్:వివిధ హాస్య పాత్రలతో ఆంధ్ర సినీ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన నవ్వుల రేడు పద్మనాభంకు సింహపురితో విడదీయలేని అనుబంధం ఉంది. వారి అకాల మరణం పట్ల సింహపురి ప్రజలు, కళాకారులు, కళా సంస్థలు, ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తాను ధరించే పాత్రలలో ఎప్పటికప్పుడు నిత్య నూతనాన్ని ప్రదర్శిస్తూ కొత్త కొత్త మేనరిజాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం పద్మనాభానికి వెన్నతో పెట్టిన విద్య. అటు సినిమా రంగంలో ఎందరో దిగ్గజాల వంటి నటీనటుల మధ్య ధీటుగా నటించి రాణిస్తూ మరో పక్క ఆంధ్ర రాష్ట్రంలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో భాగంగా నెల్లూరు టౌన్‌హాల్‌లో తన బృందంతో కలసి ప్రదర్శించిన ‘శ్రీకాళహస్తి మహాత్మ్యం’ నాటక ప్రదర్శనను సింహపురి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినీ నేపథ్య గాయకులు పద్మశ్రీ డాక్టర్ ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యంను తాను నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం ద్వారా సినీ రంగానికి గాయకుడిగా పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి పద్మనాభం. నెల్లూరులో దక్కన్ క్రానికల్ దినపత్రికకు కరస్పాండెంట్‌గా వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న రాజశేఖర్ ఆయనకు అల్లుడు కావడం విశేషం. రాష్టస్థ్రాయి మిమిక్రీ కళాకారుడైన మైపాడు రాజా పద్మనాభం నిర్మించిన సినిమాల బ్యానర్ ‘రేఖా అండ్ మురళీ ఆర్ట్‌స’ పేరుతో సింహపురిలో సాంస్కృతిక సంస్థను ప్రారంభించి అనేక ప్రదర్శనలను నిర్వహించడం పాఠకులకు విదితమే. రాష్ట్ర స్థాయి నాటక పోటీలను నిర్వహించిన నెఫా కళాపరిషత్ బహుమతి ప్రదానోత్సవ సభకు బహుమతి ప్రదాన కర్తగా పద్మనాభం రావడం మరో విశేషం. అలాగే డ్యాన్స్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ - నెల్లూరు వారు నిర్వహించిన సినీ నటీనట హాస్యవల్లరి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పద్మనాభంను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇటీవల కళాజ్యోతి మిమిక్రీ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కె.బాలరాజు తమ సంస్థ వార్షికోత్సవ సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాను నిర్మించిన ‘దేవత’ చిత్రంలో ఆలయాన వెలసిన, బొమ్మను చేసి ప్రాణం పోసి వంటి పాటలను స్వయంగా ప్రేక్షకులకు పద్మనాభం పాడి వినిపించి హర్షధ్వానాలు అందుకున్నారు. ఇంకా వారి గానం సింహపురి ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, గాయకుడుగా చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి, ఆంధ్ర సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్మనాభం తెలుగు సినిమా రంగం బతికి ఉన్నంతవరకు చిరంజీవిగానే ఉంటారని పలువురు వారిపై అభిమానాన్ని ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment