Friday, February 26, 2010
వెయ్యి నోట్లతో...జిల్లా వాసులూ... తస్మాత్ జాగ్రత్త!
నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్: నగరంలో విచ్చలవిడిగా వెయ్యి రూపాయల దొంగ నోట్లను చెలామణి చేస్తున్న వ్యక్తిని 1వ నగర పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుంచి దాదాపు ఏడు వెయ్యి రూపాయల దొంగ నోట్లు, ఆరు వేల రెండొందల రూపాయలు ఒరిజినల్ నోట్లను 1వ నగర ఎస్‌ఐ యు.సత్యనారాయణ స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తమ్ దీనాజ్‌పూర్ జిల్లాకు చెందిన శకుంతల గ్రామంలోని మహ్మద్ సాబీర్‌హుస్సేన్ (17) అనే ఇంటర్మీడి యట్ చదువుకునే విద్యార్థి నగరంలోని సత్యాస్ కస్టమ్స్ వద్ద వెయ్యి రూపాయల దొంగనోటును మార్చే సమయంలో షాపు యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా వారు పట్టుకున్నారు. ఇతని ద్వారా పోలీసులు సమాచారాన్ని ఆరా తీయగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మురుసలీమ్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్ల ముఠాకు అసలు బాస్ అని, అతని నుండి మహ్మద్ సిర్ఫ్‌ఉద్దీన్ అనే వ్యక్తి చదువుకుంటున్న పిల్లలను దగ్గరకు తీసి వారి ద్వారా ఈ వ్యాపారాన్ని సాగించేవారని తెలిసింది.అందులో భాగమే మహ్మద్ సిర్ఫ్‌ఉద్దీన్ ఇంటర్మీడియట్ చదువుతున్న మహ్మద్ సాబీర్, అతని స్నేహితులకు మాయమాటలు చెప్పి లక్షకు రూ.40 వేలు ఇస్తానని చెప్పి జట్టుకు ఇద్దరు చొప్పున ఆరు మందిని మొదటగా ఒంగోలులో దొంగ నోట్లు చలామణి చేయడానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తర్వాత 23వ తేదీ నెల్లూరుకు వచ్చి ఎస్‌విఎస్.లాడ్జిలో బస చేశారు. 23, 24, 25 తేదీలలో అదే లాడ్జీలో ఉండి 25వ తేదీ ఉదయం 9.15కి లాడ్జీని ఖాళీ చేశారు. తర్వాత స్వాగత్ లాడ్జీలో బస చేసి రోజూ టౌన్‌లో తిరుగుతూ రూపాయ వస్తువుని రూ.10లకు కొనడానికి కూడా వెనకంజవేయకుండా వంద రూపాయలివ్వాల్సిన చోట రూ.1000ల కాగితాన్ని ఇవ్వసాగారు. షాపు యజమానులు ఎక్కువ ఆదాయానికి అమ్ముతున్నాములే అని ఆశపడి వారి వలలో పడిపోయారు. ఇప్పటికి నెల్లూరు నగరమంతా రూ.71 వేల పైచిలుకు ఒక్కొక్క జట్టు చొప్పున మూడు జట్లు కలిపి లక్షల్లో వెయ్యి రూపాయల దొంగ నోట్లను చెలామణి చేశారు. ఈ తతంగమంతా తెలుసుకున్న పోలీసులు మహ్మద్ సబీర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టే సమయానికి మిగిలిన నిందితులు పరారయ్యారు. వీరు బస చేసిన లాడ్జీలో వీరు కొనుగోలు చేసిన సామాన్లు తప్ప మరేమీ దొరకలేదు. 23,24,25 తేదీలలో పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతమైన బంగ్లాదేశ్ నుంచి దొంగనోట్లను సరఫరా చేసే దొంగనోట్ల ముఠా రాకెట్ నగరంలోని అనేక షాపుల్లో అధిక ధరలకు స్పూన్ నుండి ఫారిన్ సరుకు వరకు రూ.1000లు నోట్లు ఇచ్చినందువలన అధిక లాభం సంపాదించామని తెగ సంతోషపడుతున్నారు. అవి దొంగ నోట్లు. వీటి కోసం పోలీసులు ఈ నిందితులు ఎక్కడెక్కడ కొన్నారో రశీదులు ఆధారంగా షాపులకు రావచ్చని సమాచారం. ఈ వెయ్యి నోట్ల సమాచారంతో నగరంలోని పలు షాపు యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ముఠా గుట్టు రట్టు చేయడానికి పోలీసులు విపరీతంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంలో ఎటిఎంలలో ఎక్కువగా దొంగనోట్లు రావడంతో బెంబేలెత్తిన జిల్లా ప్రజలు ఈ సంఘటనతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. రూ.500లు, రూ.1000ల నోట్లంటనే భయపడే ప్రతి ఒక్కరికీ ఈ కాగితాలపై ఒకింత జాగ్రత్త అవసరం సుమా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment