నెల్లూరు, మేజర్‌న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో హాస్యాస్పదంగానూ, అనుమానాస్పదంగానూ కనిపిస్తోంది. గత ఏడాది లక్షా మూడు వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 15వేల ద్రవ్యలోటు చూపిస్తూనే, ప్రస్తుతం లక్షా 16వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచడం చూస్తే, ఈ బడ్జెట్ ఎంత మేరకు అమలుకు నోచుకుంటుందో నమ్మశక్యంగా లేదు. ఈ ఏడాది వర్షపాతం సరిగా లేక పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఆర్థిక మాంద్యం దెబ్బకు వ్యాపారాలు సైతం దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ఇంత భారీ బడ్జెట్‌కు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో స్పష్టం చేయలేదు. ప్రజల మీద పన్నులు భారీగా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే బడ్జెట్‌ను పెంచి చూపించాలనే ఆతృత తప్ప మరొకటి కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం కోటి రూపాయల వంతున కేటాయించడం ఒక్కటే ఆహ్వానించదగ్గ పరిణామం.
మానవాభివృద్ధి పట్ల ఆసక్తి చూపని బడ్జెట్: ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం,రామిరెడ్డిఅనేక రంగాల్లో ముందున్న రాష్ట్రం విద్యారంగంలో తీవ్రంగా వెనుకబడి ఉంది. దీన్ని అభివృద్ధి పరిచే విషయంలో బడ్జెట్ ఏమాత్రం పట్టించుకోలేదు. మానాభివృద్ధి విషయంలో జాతీయ స్థాయి 0.472 కాగా, రాష్ట్రంలో 0.416 మాత్రమే. గత ఏడాది బడ్జెట్‌లో విద్యకు 10.77 శాతం నిధులు కేటాయించగా ఈ సారి 11.13 శాతం కేటాయించారు. పాఠశాలకు అదనంగా ఇచ్చిన 1411 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యకు అదనంగా ఇచ్చిన రూ.93 కోట్లు జీతాలకే సరిపోతాయి. మధ్యాహ్న భోజనానికి కేటాయింపులు పెంచలేదు. కొత్తగా పెట్టిన 19 యూనివర్శిటీలకు నిధులెక్కడ నుంచి వస్తాయో తెలియజేయలేదు. ఈ బడ్జెట్ కేవలం విద్యావ్యవస్థను అరకొర నిధులతో నడపడానికి తప్ప ఒక దార్శనికతతో నడపడానికి ఉద్దేశించింది కాదు. రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం వాటా కూడా విద్యారంగానికి కేటాయించకపోవడం అన్యాయం.
రైతులకు ఆశనిపాతం: చిరసారి కోటిరెడ్డి, జిల్లా రైతు సంఘ కార్యదర్శివర్షాలు తగ్గుముఖం పట్టడం ఒకవైపు, చీడపీడల బాధ మరో వైపు వెరసి ఈ ఏడాది అన్నదాతకు తీరని నష్టం కలిగించాయి. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించింది. వ్యవసాయ రంగాభివృద్ధికి గతంలో కంటే తక్కువగా నిధులను కేటాయించడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన విషయం స్పష్టమౌతోంది. బడ్జెట్ రూపకల్పనలో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య ఈ దఫా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మాత్రం తీరని లోటే చూపించారు.
అభివృద్ధి తిరోగమన బడ్జెట్: మిడతల రమేష్, బిజెపి నాయకులురాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే సంక్షేమ కార్యక్రమాల పురోగమనం కోసం కాకుండా తిరోగమనం కోసం రూపొందించినట్లు అర్థమవుతోంది. గత బడ్జెట్‌లో స్వయం సహాయక సంఘాల వడ్డీలకు రూ.300 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కేవలం రూ.200 కోట్లు మాత్రమే విదిల్చారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలేని బడ్జెట్ ఇది. పక్కా గృహాలకు రూ.700 కోట్లు బకాయిల రూపంలో లబ్దిదారులకు చెల్లించాల్సి ఉండగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.1800 కోట్లు ఈ రంగానికి కేటాయించారు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 80 లక్షల ఇళ్ల నిర్మాణం కలే. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల రూపకల్పనకు, కొత్త వంగడాల పరిశోధనకు నిధులు కేటాయించక పోవడం దారుణం.
No comments:
Post a Comment