Monday, February 22, 2010
వెలుగును కోల్పోతున్న తెలుగు
దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది మహారాజులు, మహామహులు వెలిబుచ్చిన అభిప్రాయం. పరభాషా కవులు సైతం వర్ణించిన వివరం. ఎంతటి చక్రవర్తులైనా తన సింహాసనం నుండి దిగివచ్చి, తెలుగు కవి పాదాల చెంత తలవంచి, కవి కాలికి గండపెండేరం తొడిగిన వైభవం తెలుగుభాషది. అమ్మ అనురాగాన్ని, నాన్న మమకారాన్ని పెంచే అచ్చమైన భాష మన తెలుగు భాష. పద్యం- తాత్పర్యం తెలుగువారి సొంతం. ప్రపంచంలో మరెక్కడా లేని ఇంటి పేరు వంశపారంపర్యంగా తెలుగువాళ్లకు వారసత్వపు ఆస్తి. ఓంకార శబ్దమైనా, వందేమాతరం గీతమైనా తెలుగులో పలికితేనే తెలుస్తుంది దాని బలం. తేనెకన్నా తీపి కదా తెలుగు భాషాగుణం. ‘తెలుగుజాతి మనది-నిండుగా వెలుగుజాతి మనది’ అన్నారు పెద్దలు. ఇలా తెలుగు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటాలన్నా, తెలుగు విలువను, దాని వెలుగును వర్ఱించాలన్నా ‘తెలుగుకు తెలుగే సాటి-లేదిక దానికి పోటీ’. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తల్లిభాషైన తెలుగుపై ప్రత్యేక కథనం.తోటపల్లిగూడూరు, మేజర్‌న్యూస్: ఎవరైనా తన కన్నతల్లిని ఏవిధంగా ప్రేమిస్తారో ఆమె పంచిన భాషను కూడా ఆమెతో సమానంగా గౌరవించాలి. ఎందుకంటే మనిషి పుట్టింది మొదలు గిట్టేదాకా వీలైనంత వరకు అదనంగా మాతృభాషలోనే తన కార్యకలాపాలు జరుపుతాడు కాబట్టి. దురదృష్టవశాత్తు బ్రిటిషువారి పాలనలో మనదేశంలోని మాతృభాషలు క్షీణించి ఆంగ్లభాషాభివృద్ధి జరిగింది. ఆనాటి నుండి ప్రజలు ఆంగ్లభాషపై ప్రజలు వ్యామోహం పెంచుకున్నారు. విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇంగ్లీషుకు ప్రాధాన్యం కల్పించారు. తద్వారా తల్లిభాషను క్రమేణా మరిచారు. సృష్టి కారకుడైన ఆ భగవంతుని కూడా అమ్మ మాతృభాష ద్వారానే పరిచయం చేసిందనే నిజాన్ని మరచి పరభాషల ద్వారా ఆయనను కోరికలు కోరుతూ తల్లిభాషను చిన్నబుచ్చుతున్నారు. ప్రస్తుతం తెలుగు భాషనైతే మాట్లాడడం, రాయడం చేస్తున్నారు గానీ, పూర్తిగా భాషపై పటుత్వం, పాండిత్యాలను చాలామంది కొనసాగించలేకున్నారు.దీని ప్రభావం వలన నేటి యువతీ యువకులు తెలుగుయొక్క తీయదనాన్ని, దాని మాధుర్యాన్ని గ్రహించలేకున్నారు. పూర్తిస్థాయి విఙ్ఞానవంతులు పరభాషా వ్యామోహంతో తెలుగు గ్రంధాలను చదవడంలేదు. ఇక అఙ్ఞానులకు, నిరక్షరాస్యులకు ఆ గ్రంధాలతో పనిలేకపోవడంతో ఎంతో విలువ లిగిన మాతృభాషా గ్రంధాలు చెదలుపట్టి కొంత, ఎలుకల పంటిగాట్లకు గురై మరికొంత నాశనమై పోతున్నాయి. మన పూర్వీకులు సాంఘీక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య విఙ్ఞానాలేగాక ధ్యానం, యోగా, ఆయుర్వేదం లాంటి ఎన్నో విలువైన రంగాలను పరిశీలించి, ఆపై పరిశోధనలు జరిపి విశ్లేషణాత్మకంగా రచించిన ఎన్నో వెలకట్టలేని గ్రంధాలు గ్రంధాలయాల నాలుగు గోడల మధ్య బందీలైవున్నాయి. వాటిపైవున్న దుమ్ము దులపడానికి కూడా వీలు లేనంత దయనీయ స్థితిలోవున్నాయి. నేటి తల్లిదండ్రులు తమ డాబు కోసం డబ్బు వెచ్చించి పిల్లలను ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. సామర్ధ్యం లేని విద్యార్థులు అటు ఇంగ్లీషులో ఎదగక, ఇటు తెలుగులో నిలబడక రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతున్నారు.అభం శుభం తెలియని చిన్నారుల మెడకు ఆంగ్ల పుస్తకాలను గుదిబండలా కట్టి బలవంతపు విద్యను అంటకట్టాలని చూడడం ఆత్మాభిమానాన్ని అడ్డుకునేంత నేరంతో సమానం. వచ్చీరాని ముద్దు ముద్దు మాటలతో తెలుగు పలుకుతోన్న చిన్నారులను ఆంగ్ల విద్యాలయాల్లో శిక్షించడం బాధాకరం. వారి బిడ్డలు ఎలాగైనా ఇంగ్లీషు చదవాలనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ మద్దతునివ్వడం అత్యంత విచారకరం. ఏ భాషలోనైనా 30 శాతం మంది పిల్లలు ప్రాధమిక విద్యాభ్యాసం అభ్యసించకుంటే ఆ మాతృభాష మృతభాషగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో విద్యాసంఘాలవారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనేవుంది. ఆంగ్లంపై రోజు రోజుకీ ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతోన్న శ్రద్ధను గమనిస్తే భవిష్యత్తులో మాతృభాష ప్రమాదంలో పడే అవకాశముందని తెలుస్తోంది. ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు అహం, దర్పం ప్రదర్శించడానికి కొందరు వారి స్వార్థం కోసం ఆంగ్ల భాషను ఆశ్రయిస్తూ తెలుగు భాషను అధోగతి పాల్జేయాలని చూస్తున్నారు. దీనిని అరి ట్టాలంటే ప్రభుత్వం వెంటనే పాలనారంగంలో తెలుగును పూర్తిస్థాయిలో అమలు జరపడంతోపాటు స్థానిక ఉద్యోగావకాశాల్లో తెలుగు మాద్యమంలో పట్టభద్రులైన వారికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. తల్లిభాష రుణం తీర్చుకోడానికి ప్రతిఒక్కరూ తపించాలి. ప్రభుత్వ జీతం తీసుకునే ప్రతి ఉద్యోగి తమ పిల్లలను తెలుగు బడిలోనే చదివించి ఇతరులకు ఆదర్శంగా మారాలి. రాష్ట్ర అధికార భాషా సంఘాలను ప్రభుత్వం వెంటనే నియమించాలి. ఎన్నికైన భాషాసంఘాలు మాతృభాషాభివృద్ధికి గట్టిగా కృషి చేయాలి. నామమాత్రపు విధులను మాత్రమే నిర్వహిస్తూ, తాత్కాలిక కార్యకలాపాల ద్వారా కాలయాపన చేస్తే అది మన మాతృమూర్తినే మోసం చేసినంత పాపమని తెలుసుకోవాలి. సోదర రాష్టమ్రైన తమిళనాడులోని ప్రభుత్వం వారి అరవం భాషను అందలమెక్కించడానికి పడుతున్న ప్రయాసను గ మనించి, తెలుగు భాషాభివృద్ధికి కూడా తెలుగువారు ఎనలేని పాటుపడాలి. తరతరాల నుండి మన త ల్లిదండ్రులు, వారి తాతముత్తాతల అభివృద్ధిని కాంక్షించిన తెలుగుభాష మనుగడను రక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జన్మనిచ్చిన మాతృమూర్తి నిత్యం వర్థిల్లాలని మనం అనుకున్నట్లే ఆమె పరిచయం చేసిన తెలుగు భాష కూడా వర్థిల్లాలంటే, బహు భాషలను ఎన్ని నేర్చినా ఆంధ్ర దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగులో తగిన ప్రావీణ్యం సంపాదించాలి- తెలుగులోనే సంభాషించాలి. దుక్కి కొద్దీ పంట! బుద్ధి కొద్దీ సుఖం!! పోరాట ం కొద్దీ ఫలితముంటుంది కావున ఏడాదిలో ఏఒక్కరోజు మాత్రమే మాతృభాషపై పోరాడడం కాకుండా తెలుగుభాషకు తగిన గౌరవం దక్కేవరకు మేధావుల నుండి సామాన్యుడి వరకూ పోరాటం చేయాలి. తెలుగు రాజ్యంలో నేడు ఆంగ్ల విద్యాలయాల్లో కదలలేక కూర్చొని కన్నీరు కార్చుతూ, భావిచీకటిని తలుస్తూ భోరున రోదిస్తున్న తెలుగు భాషను పరిరక్షించి దానికి స్వేచ్ఛను కల్పించాలి. మల్లెల సువాసన కన్నా గొప్పదై, మమతలకోవెలకన్నా మంచిదై, తేనెలొలికే తీయ్యదనానికన్నా తీయనిదై, కొండ కోనల్లో, పంట చేలల్లో, పసి బోసి నవ్వుల్లో, ఎండ వానల్లో, ఎంకి పాటల్లో, ఎందు వెతికినా,ఎక్కడ విన్నా తెలుగు పాటలే పరవళ్లు తొక్కాలి. తెలుగుమాటలే చెవికింపు కలిగేలా మాతృభాష యొక్క ప్రాభవాన్ని,పూర్వ వైభవాన్ని ప్రపంచానికి చాటాలి. తెలుగుతల్లి మెడ నిండా ఎన్నటికీ వాడని మల్లెపూదండలు నిండుగానిండే విధంగా కంటికి రెప్పలా కాపలా కాయాలి. కావునఇకనైనా సమాజంలోని ప్రజలు, గద్దెలనేలే పెద్దలు నానాటికీవెలుగును కోల్పోతున్న మాతృభాష అయిన తెలుగును మళ్లీ వె లిగించి పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఎంతో వైభవం కలిగిన మన పూర్వీకుల సంస్కృతీ సాంప్రదాయాలను, నాగరిక చరిత్రను భావితరాలకు దూరం చేయడంతోపాటు, మాతృభాష అయిన తెలుగు భాషను అమృత భాషగాకాక మృతభాషగా చేజేతులా చేసుకుని పరాయి భాషలవారి పంచన తలదాచుకునే ప్రమాదం ఎంతైనా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment