Thursday, February 25, 2010
ధైర్యముంటే నన్ను ఎదుర్కోండి
నెల్లూరు, మేజర్‌న్యూస్:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని ఎదుర్కొనే దమ్ములేని కొందరు రాజకీయ బ్రోకర్లు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారనీ, అయితే వారెన్ని ఇబ్బందులు సృష్టించినా తాను ఏమాత్రం భయపడేది లేదని నగర మేయర్ నందిమండలం భానుశ్రీ తన ప్రత్యర్థులకు సూటిగా సమాధానమిచ్చారు. బుధవారం సాయంత్రం ఆమె తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం ఒక దినపత్రికలో భానుశ్రీ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన వార్తకు ఆమె సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. రాజకీయ బ్రోకర్లు చేస్తున్న పుకార్లలో నిజమెంతో ప్రజలు గమనించాలని కోరారు. పేర్లు ప్రస్తావించకుండా ఆమె రాజీవ్‌భవన్ నేతలపై నిప్పులు చెరిగారు. తాను రాజకీయాల్లోకి రాకమునుపే కొనుగోలు చేసిన ఉమ్మడి ఆస్తిని బినామీ పేర్లతో పెట్టాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా 1989లో కొనుగోలు చేసిన ఆ ఆస్తిని 1995లో అమ్ముకున్నామనీ, ప్రస్తుతం ఆ ఆస్తితో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తామున్న ఇల్లు తన అత్తగారిదనీ, వారు కొనుగోలు చేసినప్పటికీ తానసలు పుట్టనేలేదని ఆమె వివరించారు. కాంగ్రెస్ పార్టీని, ఆనం వర్గాన్ని దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యమనీ, గత నెల రోజులుగా వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారనీ, అయినా తాను అలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేదానిని కాదన్నారు. ఇలాంటి ఆరోపణలు ప్రస్తుతం ఆరంభమేననీ, అవి రాబోవు కార్పొరేషన్ ఎన్నికల వరకు కొనసాగుతాయని ఆమె జోస్యం చెప్పారు. గత ఐదేళ్లుగా ఒక పెద్ద మనిషి రాజకీయ కక్ష తీర్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి చతికిలపడ్డారనీ, ప్రస్తుతం కొందరు గజనీ మహ్మద్‌లా పోరాటం చేస్తున్నారని చెప్పారు. రాజకీయంగా ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని ఎదుర్కొనే ధైర్యం వారికి లేదనీ, శిఖండి పాత్రను పక్కనబెట్టి ధైర్యముంటే ఆయనతోనే మోటుకోవాలని భానుశ్రీ సవాల్ విసిరారు. విష ప్రచారాలు చేస్తున్న వారి స్థాయి ఏమిటో నగర ప్రజలందరికీ తెలుసన్నారు. వారు బహిరంగ విచారణకు పిలిచిన విషయాన్ని ప్రస్తావించగా, అటువంటిదేమీ అవసరం లేదని ఆమె కొట్టిపారేశారు. అవసరమైతే కోర్టు ద్వారా తనను ఎదుర్కోమంటూ వారికి ఉచిత సలహాను అందజేశారు. మహిళల హక్కుల కోసం నిత్యం పోరాడుతామని చెప్పుకునే జాతీయపార్టీకి చెందిన నగర డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఏ స్థాయికి దిగజారారో ఇట్టే అర్థమవుతుందన్నారు. పనికిమాలిన ఆరోపణలను ప్రజల్లోకి పంపాలని చూస్తూ అనేక రకాలుగా తనను ఇబ్బంది పెట్టినా, అభివృద్ధి అనే అజెండాతో మేయర్ సీట్లో కూర్చున్న తాను తన లక్ష్యం నెరవేరేవరకు ఏమాత్రం వాటిని ఖాతరు చేయనన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment