online marketing

Saturday, February 6, 2010

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : నాలుగైదు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 50 శాతం ఖర్చులు భరించేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య అంగీకరించారని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై రోశయ్య కేంద్ర రైల్వే మంత్రి మమతాబెనర్జీతో చర్చించిన మీదట రైల్వేలైను ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ పొందినట్లు ఎంపి ‘మేజర్‌న్యూస్‌’కు తెలిపారు. రాష్ట్రంలో రైల్వే శాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆరు పనులలో ఒకదానికి 2/3వ వంతు, మిగిలిన ఐదు పనులకు 50 శాతం చొప్పున ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకారాన్ని లిఖితపూర్వకంగా మమతాబెనర్జీకి తెలిపినట్లు ఎంపి వివరించారు. ఈ రైలు మార్గం నిర్మాణానికి 1310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆయన చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య సుమారు 309 కిలోమీటర్ల పొడవున అన్ని వెనుకబడిన ప్రాంతాల మీదుగా నాలుగుజిల్లాలను తాకుతూ నాగార్జున సాగర్‌ ఆయకట్టు ప్రాంతాల మీదుగా సాగుతూ గతంలోని రైల్వే మార్గం కంటే 169 కిలోమీటర్లు తగ్గి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ప్రయాణానికి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. ఈ మార్గం నిర్మాణం ద్వారా ఇందన పొదుపు, తద్వారా జాతీయ పొదుపునకు అవకాశం కలుగుతుందని చెప్పారు. అదేవిధంగా తుపాను, ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో హైదరాబాద్‌, చెనై్న, కర్నాటక, కేరళ రాష్ట్రాలమధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గం ఏర్పడినట్లు అవుతుందని ఆయన వివరించారు. ఈ రైలు మార్గం ఏర్పాటుకు 2005 జనవరి నెలలో ఒకసారి, 2007 సెప్టెంబర్‌ నెలలో మరోసారి సర్వే జరిగిందని ఆయన అన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గంతో పాటు హైదరాబాద్‌-సికింద్రాబాద్‌లలో ఎంఎంటిఎస్‌ రైల్వేలైను, భధ్రాచలం - కోవూరు రైల్వేలైను, మనుగూరు-రామగుండం రైల్వేలైన్లు మంజూరు అయ్యాయని ఎంపి మేకపాటి వివరించారు. అదేవిధంగా విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం-నిడదవోలు లైను డబ్లింగ్‌, విద్యుద్ధీకరణ పనులు, గుంటూరు-తెనాలి-రేపల్లె మార్గం డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులకు నిధులు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపిందని ఆయన అన్నారు. రాష్ర్టంలో ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను ఏర్పాటుకు ముందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు, కేంద్ర మంత్రి మమతాబెనర్జీకి ఎంపి మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు.

చిల్డ్రన్‌ (ఛీద్రం) పార్క్‌


నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌: ఇరుకు గదుల్లో స్కూళ్లు, గాలి దూరని అపార్ట్‌మెంట్‌లలో కాపురాలతో విసిగిపోయే నగర జీవులకు సాయంత్ర వేళల్లో పచ్చదనంతో, ఆహ్లాదకర వాతావరణంతో మనసుకు ఉల్లాసాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకునే బృందావనాలు పార్కులు. నగరంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్‌ పార్క్‌ పదేళ్లు గడవకముందే వృద్ధాప్య ఛాయలతో పిల్లలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా తయారైంది. పార్క్‌ నిర్వహణలో అవసరమైన చర్యలు ఏవీ లేకపోవడంతో సుందరంగా ఉండాల్సిన పార్క్‌ ఆహ్లాదకర వాతావరణం ఛీద్రంగా మారిపోయింది. పార్క్‌ అనగానే పిల్లలు ఆట పాటలకు పచ్చని గడ్డితో స్వాగతం పలికే తివాచీలు లాంటి మృదుత్వం కరువై ఉన్న గడ్డి కాస్తా ఎండిపోతుంది. సరైన ఆలన పాలన లేక పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తువులు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిర్వాహకులు మాత్రం ప్రవేశరుసుము రూ.5 లతో పాటు ఒక్కొక్క విభాగానికి ప్రత్యేక రేట్లను కేటాయించి డబ్బులు వసూలు చేయడంలో మాత్రం చురుగ్గా పనిచేస్తున్నారు. కనీసం ఆ పరికరాల పెయింట్‌ విషయం కూడా పట్టించుకునేవారు లేరు. పిచ్చి మొక్కలతో ముళ్ల కంపలతో నిండిన వాతావరణం రాత్రి వేళల్లో చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారిందనడానికి అక్కడవున్న ఖాళీ మందు బాటిళ్లు, తదితర చీకటి సామాగ్రి సాక్ష్యం. పార్క్‌ ప్రారంభంలో పిల్లలు అత్యంత ఉత్సాహంగా వీక్షించడానికి ఏర్పాటు చేసిన మ్యూజిక్‌ ఫౌంటైన్‌ పూర్తిగా పనికిరాని స్థితికి చేరుకుంది. పార్క్‌లోని ప్రతి పరికరం పనికిరాని స్థితికి చేరుకున్నప్పటికీ పట్టించుకునేవారు లేకపోగా పార్క్‌ రుసుములు వసూలు చేయడానికి మాత్రం సిబ్బంది అత్యుత్సాహం చూపడం విశేషం. పిల్లల కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన చిల్డ్రన్స్‌ పార్క్‌ పిల్లలకు కాక, కొంతమంది పెద్దలకు మాత్రమే ఉపయోగపడడం పట్ల మేజర్‌న్యూస్‌ పార్క్‌కు విచ్చేసినవారిని ప్రశ్నించగా కనీసం వివరణ ఇవ్వడానికి కూడా రోజూ వచ్చే వాకర్స్‌ వెనుకాడారు. దీన్నిబట్టి నిర్వాహకుల ఆధిపత్యం పార్క్‌ సందర్శకులపై ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సాధారణ అవసరాలైన తాగునీటి వసతి, సరైన విద్యుత్‌ దీపాల కాంతి లేని చిల్డ్రన్స్‌ పార్క్‌ స్థితిని గమనించినవారు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెల్లడించకపోయినా ఎవరికి వారు ఈ పార్క్‌ ‘ఛీ-ఛీద్రం’ అనుకోవడం ఖాయం.

వివాదాస్పద భూములను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌


చిల్లకూరు, (మేజర్‌న్యూస్‌) : చిల్లకూరు మండలంలోని కడివేడు రెవిన్యూ పరిధిలోని వివాదాలకు నెలవైన సర్వే నెంబరు 805ను జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సర్వే నెంబర్‌లో 870 ఎకరాలు ఉండగా అందులో కొంతభాగం పట్టాలు ఉన్నాయని గర్భకండ్రిగ పరిధిలో కొంత భూములుండగా ఎండోమెంటుకు సంబంధించి 100 ఎకరాలు కేటాయించి ఉన్నట్లు జె.సి. పరిశీలనలో తేలింది. ఈ భూములను 59 బ్లాకులుగా విభజించి రికార్డులు తయారు చేసినట్లుగా ఆయన తెలిపారు. అత్యధిక శాతం ప్రభుత్వ సీలింగ్‌ భూములు ఈ సర్వే నెంబర్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.గత సంవత్సరం నుండి ఈ భూములను రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వడం లేదని జె.సి.కి తహసిల్దార్‌ కె.ఎం.రోజ్‌మాండ్‌ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలోని ఈ భూములను రైత్వారి పట్టాలుగా ఇనాంగా, గత తహసిల్దార్‌లు ఇచ్చిఉన్నారని కూడా ఆమె ఈయన దృష్టికి తీసుకువచ్చింది. ఈ సర్వే నెంబర్‌లో ఎవ్వరికీ పాస్‌పుస్తకాలుగానీ, పట్టాలు గాని ఇవ్వడం లేదని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లు కూడా చేయకూడదని ఉత్తర్వులను రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపిఉన్నట్లుగా తెలిపింది. ఈ సర్వే నెంబరు జె.సి.పరిశీలిస్తున్న సమయంలో పలువురు పట్టాదారులు పట్టాలు కలిగి ఉన్నామని, కాని రెవిన్యూ రికార్డులో నమోదు చేయలేదని ఆయన దృష్టికి తీసుకురాగా దీనిపై స్పందించిన జె.సి. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రేషను కార్డులను రద్దు పరచంప్రైవేటు సెక్టార్‌ ద్వారా సర్వే చేయించడం వలన కమ్మవారిపాళెం, బూదనం తదితర ప్రాంతాల్లో మండల పరిధిలో కొన్ని పొరపాట్లు జరిగాయని గ్రామ సభల ద్వారా బహిరంగ ప్రకటన చేస్తూ అర్హులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు జె.సి. చెప్పారు. ఈ కార్యక్రమం ఈ నెల 4 నుండి 18వ తేది వరకు కొనసాగుతుందని కార్డులు రద్దయిన వారు తహసిల్దార్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తే దానిపై క్షుణ్ణంగా పరిశీలించి వారికి అసలైన అర్హులుకి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ, విఆర్వో వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.

Friday, February 5, 2010

మత్తులో చిత్తవుతున్న యువత---


నెల్లూరు(క్రైం)మేజర్‌న్యూస్‌:జిల్లాలో యువకులు, విద్యార్థులు, బిచ్చగాళ్లు , పిల్లలు సైతం గంజాయి, హెరాయిన్‌, పెంటజోసిన్‌ వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొంతమంది రిక్షా పుల్లర్లు రైల్వే స్టేషన్ల్‌ వద్ద గంజాయి వంటి మాదకద్రవ్యాలను సేవించి మత్తులో మునిగితేలుతూ తమ జీవితాలను రైలు చక్రాల క్రిందనే చాలిస్తున్నారు. సంవత్సరానికి మత్తు పదార్ధాలపై రూ.కోట్లపైనే ఆదాయం మాదకద్రవ్యాలు, మత్తుపదార్ధాల వంటి వాటిని అక్రమంగా అమ్మకాలు జరుపుతుండటం వలన జిల్లాలో ఏటా కోట్ల రూపాయలలో అక్రమార్జన చేస్తున్నారు. ఈ వ్యాపారం చేసేవాళ్ళు లక్షల్లో ఆదాయం గడిస్తుండటంతో అధికారులకు ముడుపులు కూడ భారీగానే అందుతున్నట్లు సమాచారం. ముడుపులు భారీగా ఉండటంతో కేసులను సైతం లెక్కచేయక యథేచ్ఛగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.ప్రధాన కేంద్రాలుగా: నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌, స్టోన్‌హోస్‌పేట, రైల్వేఫీడర్స్‌రోడ్‌, మూడుహాళ్ళసెంటర్‌, వెంకటేశ్వరపురం, కావలిలోని వడ్డిపాలెం, పెద్దపవనిరోడ్డు, గూడూరు రైల్వేస్టేషన్‌, బనిగిసాహెబ్‌పేట, మాయబజార్‌, సూళ్లూరుపేట, నాయుడుపేట వంటి ప్రాంతాలలో గంజాయి, నల్లమందు వంటివాటిని అమ్మకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అయితే హెరాయిన్‌, మార్ఫిన్‌ వంటి మాదకద్రవ్యాలు చెనై్న నుంచి రైళ్లలో జిల్లాలోని గూడూరు, నెల్లూరు, కావలికి తీసుకొని వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. వీటికి తోడు స్పిరిట్‌ , డైజోఫామ్‌, ఆల్ఫాజోలమ్‌ వంటి మాత్రలు మత్తుకు ఉపయో గిస్తున్నారు. అంతేగాక పెంటజోసిన్‌ వంటి ఇంజక్షన్లను శరీరంలోకి సూదుల ద్వారా ఎక్కించుకుంటున్నారు. సాధారణంగా డాక్టర్లు ఇచ్చే మందుల చీటి లేనిదే మెడికల్‌ షాపుల్లో మత్తుతో కూడిన మందులు ఇవ్వరాదు. అయితే వ్యాపారం కోసం దుకాణాదారులు విచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నారు.గంజాయి తోటలుగా: సీతారామపురం, ఉదయగిరి వంటి ప్రాంతాల్లో చడిచప్పుడు లేకుండా గంజాయితోటల పెంపకం జరుగుతోంది. దీనికి తోడు ప్రక్క జిల్లాల నుంచి ఈ గంజాయి మన జిల్లాకు వాహనాల ద్వారా చేరుతున్నాయి. ఒక్కొక్కసారి అధికారులు దాడులు నిర్వహించినా అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. నిందితులను పట్టుకున్న వెంటనే రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గటం, ఆర్థిక, అంగబలం ముందు ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు చిన్నచిన్న వ్యాపారులపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారే తప్ప అసలు నిర్వాహకులను పట్టుకొని కేసులు నమోదు చేయటంలేదనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు చొరవ చూపి మత్తు మందులను అనధికారకంగా, ఇష్టారాజ్యంగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

8 కాళ్ళ గొర్రెపిల్ల జననం


కొడవలూరు, (మేజర్‌ న్యూస్‌) : 8 కాళ్ళతో గొర్రెపిల్ల జన్మించిన అరుదైన సంఘటన కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాళెం గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళితే కదురు రమణయ్యకు 40 గొర్రెలు, 10 మేకల మంద వుంది. అందులో ఒక గొర్రె నిండుచూలాలుకావడంతో బుధవారం సాయంత్రం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మొట్టమొదటి పిల్ల 8 కాళ్ళతో చనిపోయి బయటకు రాక తల్లి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక కుమ్మరి వారి తోపునకు చెందిన యాటగిరి వెంకయ్య చాకచక్యంగా తల్లి గొర్రె కడుపులోకి చేయిపెట్టి గొర్రెపిల్లను బయటకు తీశారు. గొర్రెపిల్ల చనిపోయి వుండి ఆలస్యంగా బయటకు రావడంతో తరువాత వచ్చిన రెండవ గొర్రె పిల్ల కూడా మృతి చెందింది. యాటగిరి వెంకయ్య వివరణ: తన 60 సంవత్సరంలో ఇలాంటి అరుదైన 8 కాళ్ళ గొర్రెపిల్ల జన్మించడం ఇప్పటి వరకు తను చూడలేదని 11వ ఏటనే పలువురు వద్ద బర్రెల మందను కాచేవాడినని యాటగిరి వెంకయ్య తెలిపారు. దేవుని సృష్టి వలననే ఇలాంటి సంఘటనలు జరగుతాయని ఆయన మేజర్‌ న్యూస్‌కు వివరణ ఇచ్చారు.

వికలాంగులకు బంగారు బాటలు

ఫత్తేఖాన్‌పేట (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న వికలాంగ బాలబాలికలకు కృత్రిమ అవయవాలను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలను వేయాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో వికలాంగులకు కృత్రిమ అవయవములను అందించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ప్రతిసారి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు అందించడం పరిపాటైందని, ఈ సారి వికలాంగులకు ఉపయోగపడేవిధంగా వినూత్న రీతిలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ లోగా ఈ ప్రణాళికను కార్యాచరణకు తేవాలని వికలాంగులశాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావును ఆదేశించారు. జడ్పీ నిధులతో జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వికలాంగ బాలబాలికలకు ప్రాముఖ్యతనివ్వాలన్నారు. గుర్తింపు పొందిన స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో చదివే బాలబాలికలకు ద్వితీయ ప్రాధాన్యతగా కృత్రిమ అవయవములను అందించాలన్నారు. జిల్లా పరిషత్‌ హెడ్మాస్టర్లు వారి హైస్కూళ్లలోని వికలాంగుల వివరాలను సేకరించి, వారికి కావాల్సిన కృత్రిమ అవయవాల వివరాలను, ఉపకరణాల జాబితాను తయారు చేసి ఎంపిడిఒల ద్వారా జిల్లా పరిషత్‌కు పంపించాలన్నారు. రాజీవ్‌ విద్యామిషన్‌ వారు ఇప్పటికే అట్టి జాబితాను తయారు చేసివున్నట్లయితే ఆ జాబితాను జిల్లా పరిషత్‌కు పంపించాలన్నారు.జిల్లాలోని వికలాంగులైన విద్యార్థులను గుర్తించి వారికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికలను, ప్రధానోపాధ్యాయుల నుంచి ధృవీకరణ పత్రాలను స్వీకరించాలని తెలిపారు. వికలాంగులు సమాజంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చూడాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. చదువుకునే వికలాంగులైన చిన్నారుల కోసం వినూత్న రీతిలో అమలుపరచే ఈ కార్యక్రమాన్ని మార్చి మొదటివారంలో ప్రారంభించి రూ.10 లక్షలు విలువ చేసే కృత్రిమ అవయవాలను వారికి అందించేందుకు సంకల్పించామన్నారు. ఇందుకోసం రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి కృత్రిమ అవయవాలను తయారు చేసే నిపుణులను నెల్లూరుకు రప్పించి మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.రామిరెడ్డి, డిప్యూటీ సిఇఒ ఎస్‌ఎస్‌.ఆంజనేయరాజు, బిసి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నిపుణులు లేకుండానే డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలంటే వాటికి తప్పనిసరిగా ఆయా రంగాల్లో నిపుణులైన వైద్యులు ఉండాలి. ఈ నిబంధనలను అన్ని ఆస్పత్రులు తప్పనిసరిగా పాటించాలి. డబ్బు కోసం కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కడం సహజమే. అయితే సాక్షాత్తు ప్రభుత్వ ఆస్పత్రికి కూడా ఇటువంటి కుయత్నాలు తప్పడం లేదు. దీనికి నెల్లూరు జిల్లా కేంద్రంలోని డిఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించడానికి చేస్తున్న ప్రయత్నాలే నిదర్శనం. కిడ్నీ పాడై దుర్భర జీవితాన్ని గడుపుతున్న రోగుల ప్రాణాలను కాపాడేదే డయాలసిస్‌ చికిత్స. ఈ చికిత్సను తప్పనిసరిగా ఆ రంగంలో నిష్ణాతులైన వైద్యుల అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య నిపుణుడు లేకపోయినా అధికారులు ఈనెల 6వ తేదీన డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నారు. కిడ్నీ చెడిపోయిన రోగుల రక్తం శుద్ధి చేయబడే అవకాశం ఉండదు. రక్తాన్ని శుద్ధి చేసే పనిని కిడ్నీలు చేయకపోవడంతో ఆయా రోగులకు చేసే రక్తమార్పిడి విధానాన్ని డయాలసిస్‌ అంటారు. నిర్థేశించిన సమయంలో డయాలసిస్‌ జరగకపోతే రోగికి ప్రాణాపాయం కలుగుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి (డయాలసిస్‌) చికిత్స జరిగినప్పుడు దీనిని ఆ చికిత్స విభాగంలో స్పెషలైజేషన్‌ చేసిన నెఫ్రాలజిస్ట్‌ అవసరం. నెఫ్రాలజిస్ట్‌ అందుబాటులో లేకపోయినా డయాలసిస్‌ చేస్తే అది చట్టవ్యతిరేక చికిత్స కింద పరిగణించవచ్చు. ఎంబిబిఎస్‌ తరువాత మూడేళ్ల పాటు పోస్టుగ్రాడ్యుయేషన్‌ వైద్య విద్యను అభ్యసించాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పట్టా తీసుకున్న తరువాత మరో మూడేళ్ల పాటు ఎంసిహెచ్‌ కోర్సును పూర్తి చేస్తేనే నెఫ్రాలజిస్ట్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. సాధారణంగా ఈ కోర్సు చేసే వైద్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వ్యవహారిక భాషలో చాలా అరుదు. ప్రస్తుతం జిల్లా మొత్తానికి నెల్లూరులో మూడే డయాలసిస్‌ కేంద్రాలు ప్రైవేట్‌ యాజమాన్యాల ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉన్నాయి.అయితే ఒకే ఒక నెఫ్రాలజిస్ట్‌ అందుబాటులో ఉన్నారు. ఎంసిహెచ్‌ కోర్సు పూర్తి చేసి నెఫ్రాలజిస్ట్‌ సర్టిఫికెట్‌ పొందిన వారు అతి తక్కువగా ఉండటంతో నెల్లూరుకు చెందిన సదరు నెఫ్రాలజిస్ట్‌ నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు కూడా వెళ్లి చికిత్స చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నెఫ్రాలజిస్ట్‌ అందుబాటులో లేకపోయినా నెల్లూరు జిల్లా కేంద్రంలోని డిఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు తెగింపుతో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి రెండు డయాలసిస్‌ మెషిన్లు కూడా తెప్పించారు. ఈనెల 6వ తేదీన ఈ సెంటర్‌ను ప్రారంభించి డయాలసిస్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే నెఫ్రాలజిస్ట్‌ లేకుండా చేసే డయాలసిన్‌ చికిత్స ఏమేరకు విజయవంతంగా నిర్వహించగలరో, ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందో వేచిచూడాలి.

Wednesday, February 3, 2010

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి


నెల్లూరు రూరల్‌, మేజర్‌న్యూస్‌:నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేదలైన అర్హులకు వైఎస్‌ఆర్‌.నగర్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. మండల పరిధిలోని కొత్తూరు పంచాయతీల పరిధిలోగల వైఎస్‌ఆర్‌.నగర్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనితీరును మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సందేహాలను సంబంధిత అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇక్కడి లబ్ధిదారులకు గృహ నిర్మాణశాఖ అందజేస్తున్న మౌలిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణం, ఇళ్ల బేస్‌ మట్టం, ఇంటి ఫ్లోరింగ్‌ , మరుగుదొడ్ల వసతి తదితరాల వివరాలను అడిగి తెలుసుకుని మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సూచించినపుడు గృహ నిర్మాణశాఖ పిడి ఆర్‌వి.సత్యనారాయణ మాట్లాడుతూ మార్చి నెలాఖరు లోపు 2,165 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ ప్రత్యేకాధికారి రవిప్రకాష్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆర్‌వి.సత్యనారాయణరెడ్డి, నెల్లూరు తహసీల్దార్‌ ఐ.భక్తవత్సలరెడ్డి, ఎంపిడిఒ డి.వెంకటరావు, హౌసింగ్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఒబామా కొలువులో ‘పేట’ ఖ్యాతి


సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ : అమెరికా నూతన అధ్యక్షుడు ఒబామా కొలువులో సూళ్ళూరుపేటకు చెందిన చైతన్య ఒబామా కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణకు సంబంధించి ముఖ్యకార్యదర్శిగా కొద్దిరోజుల క్రితం నియమితులయ్యారు. ఒబామా కొలువులో ఇలాంటి కార్యదర్శులు 12 మంది ఉండగా, వీరిలో ఒకరిగా చైతన్య నియమితులయ్యారు. చైతన్య కింద మరో 12మంది కార్యదర్శులు పని చేస్తారు. 45 వేలమంది ఈ పోస్ట్‌కు పోటీపడగా చైతన్య రాత పరీక్షలలో నెగ్గి అర్హత సాధించడం విశేషం. కాగా చైతన్య సూళ్లూరుపేటలో 1987 నుంచి 1997 (యుకెజి నుంచి, 10వ తరగతి) వరకు టైనీటాట్స్‌లో విద్య నభ్యసించాడు. చైతన్య మొదట్నుంచి పట్టుదల కలిగిన వ్యక్తి. ఏదైనా అనుకొంటే సాధించే మనస్థత్వం. ఏడవ తరగతిలోను, పదవ తరగతిలోను స్కూలు ఫస్ట్‌ సాధించాడు. అనంతరం నెల్లూరు నారాయణకాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఎంసిఏ తరువాత ఎంఎస్‌ అమెరికాలోని బిగ్స్‌ పిలాసీలో చదివి పట్టభద్రుడయ్యాడు. ఎంఎస్‌ తరువాత బెంగుళూరిలోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటూ ఒబామా కొలువుని సంపాయించాడు. టైనీటాట్స్‌ ప్రిన్సిపాల్‌ వేనాటి దనుంజయరెడ్డి తమ స్కూలు వార్షికోత్సవ సభలో ఈ విషయాన్ని ఘనంగా చాటారు. తమ స్కూలు విద్యార్ధి అంత ఎత్తు ఎదగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చైతన్య సోదరులు కె రాజ్‌కుమార్‌, కె ప్రవీణ్‌కుమార్‌ని ఈ సందర్భంగా సత్కరించి మెమొంటోలు బహూకరించారు. సూళ్ళూరుపేట సిఐ వంగాసుబ్బారెడ్డి చేతులమీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది.చైతన్య సోదరులు రాజ్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌లు కూడా టైనీటాట్స్‌ విద్యార్ధులు కావడం విశేషం. రాజ్‌కుమార్‌ బెంగుళూరు ఇన్ఫోసిస్‌లోనే ప్రాజెక్టు మేనేజరుగా పని చేస్తుండగా, ప్రవీణ్‌కుమార్‌ అమెరికా కంపెనీ అసెంచరుగా వ్యవహరిస్తున్నారు. చైతన్య వ్యక్తి గత విషయానికి వస్తే తల్లి తండ్రులు సాదారణ కుటుంబానికి చెందినవారు. తండ్రి గురవయ్య సాంఘిక సంక్షేమ శాఖలో హాస్టల్‌వార్డన్‌గా పని చేస్తూ రిటైరయ్యాడు. తల్లి లీలావతి సాదారణ గృహిణి. తల్లిదండ్రులు ప్రస్తుతం నెల్లూరులో కాపురముంటున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చైతన్య అమెరికా అధ్యక్షుడు ఒబామా కొలువులో ఉద్యోగం సంపాయించడం సూళ్ళూరుపేటవాసులతో పాటు, పలువుర్ని ఆశ్చర్యపరుస్తోంది. సూళ్ళూరుపేటకు చెందిన ఓ సాదారణ విద్యార్ధి అంత ఎత్తు ఎదగడం నిజంగా గొప్ప విషయమే.

సోమశిలలో రైతు ఆత్మహత్య


ఆత్మకూరు, (మేజర్‌న్యూస్‌): కుటుంబాన్ని పోషించాలని అప్పులు చేసి పుడమితల్లిని నమ్ముకున్న రైతన్న చేసిన అప్పులను భరించలేక ఏకంగా తనువు చాలించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి..అనంతసాగరం మండలం సోమశిలలో మంగళవారం సాయంత్రం ఓ రైతు అప్పుల బాధను తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమశిల నాూబ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న సిద్దవఠం కృష్ణయ్య (40) పికెపాడు పైతట్టు ధర్మపల్లెమ్మ దేవాలయం సమీపంలో ఒకటిన్నర ఎకర పొలం వరి సాగు చేస్తున్నాడు. మరో ఎకరా పొలం మరమ్మతుల్లో ఉంది. పొలం సాగు కోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో ఎక్కువ కావడం దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.దీంతో మంగళవారం సాయంత్రం పొలంలోకి వెళ్లి పురుగుల మందు పిచికారి చేసి వస్తాయని చెప్పి వెళ్లిన కృష్ణయ్య అదే పురుగులు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో కృష్ణయ్య చుట్టుపక్కల వారికి స్పృహ తప్పి కిందపడిపోయి ఉండడం కనిపించడంతో ఆందోళనతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టు పక్కల రైతులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసే సరికి పురుగుల మందు సేవించి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కృష్ణయ్యను టాటాసుమోలో తరలించి ఆత్మకూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.మృతునికి భార్య జయమ్మ, ఓ వివాహమైన కుమార్తె, ప్రసాద్‌, మహేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పొలం పనికి వెళ్లి మృతదేహమై తిరిగి వచ్చిన తండ్రిని చూసుకున్న పిల్లలు, భార్య జయమ్మ బోరున విలపించడంతో చూపరులను సైతం కంటి తడి పెట్టించింది. మొత్తం మీద నాూబ్రాహ్మణ కాలనీ దుఃఖసాగరమైంది. కుటుంబ పోషకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇరవైవేలకు పసికందు విక్రయం?


ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: విధి వంచితురాలైన ఒక అమాయకురాలికి జన్మించిన పసిబిడ్డను ప్రైవేటఖ వైద్యశాల నిర్వాహకులు స్థానిక గొల్లపాళెం వీధికి చెందిన ఒక మహిళకు విక్రయిస్తే ఆమె రూ.20 వేలకు చెనై్నకి చెందిన మరొక మహిళకు విక్రయించి బిడ్డచేతులు మారేలోపే కన్ను మూసిన దారుణ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ సంఘటనలో మరొక విషయం వెలుగుచూసింది. మండల పరిధిలోని దుంపవారిపల్లి గ్రామానికి చెందిన పెన్నా కొండమ్మ అనే అంధురాలైన యువతిని అదేగ్రామానికి చెందిన చిలకల రమణారెడ్డి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. అయితే విషయం బయటకు పొక్కితే కుటుంబంతో సహా చంపేస్తానని బాధితురాలిని బెదిరించటంతో వారు ఏమీచేయలేక మౌనంగా ఉండి పోయారు. అయితే బాధితురాలు ప్రసవానికి వచ్చి స్థానికంగా ఉన్న ఒక ప్రవేట్‌ వైద్యశాలలో చేరింది. అయితే ముందుగా అంగీకరించని వైద్యశాల నిర్వాహకులు తరువాత చేర్చుకున్నారు. అయితే ఆత్మకూరుకు తరలించినట్లు ప్రకటించారు. అదే వైద్యశాలలో ప్రసవించిన మగబిడ్డను ఫీజుల క్రింద ప్రవేట్‌ వైద్యశాల నిర్వాహకులు జమ చేసుకొని గొల్లపాళెం వీధిలో నివాసం ఉంటున్న ఒక మహిళకు అప్పగించినట్లు తెలుస్తోంది.ఆ మహిళ చెనై్న నగరానికి చెందిన మరొక మహిళకు రూ.20 వేలకు బేరం పెట్టి బాబుని తన దగ్గరే ఉంచుకోగా చెనై్న మహిళ డబ్బుతో వచ్చేసరికి బిడ్డ మృతిచెందింది. ప్రభుత్వ అనుమతులు లేని ప్రవేటు వైద్యశాలలు పిల్లల వ్యాపారాలు చేస్తున్నాకూడా పట్టించుకోవటంలేదని స్థానికులు వాపోతున్నారు. కానీ మృతిచెందిన బిడ్డ బాధితురాలిదా, వేరొకరిదా అనే విషయం గోప్యంగా ఉంచటం విశేషం. మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురైన అంధురాలికి అగ్రవర్ణాల నుంచి తీవ్రమైన ఒత్తిడి బెదిరింపులు రావటంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. ఆదివారం వరకూ పోలీసులకు ఎటువంటీ ఫిర్యాదు లేక పోవటంతో వారు మౌనంగా ఉన్నారు. అజ్ఞాత ంలో అంధురాలి కుటుంబం: కుటుంబాన్ని కాల్చి చంపేస్తాం అని మానవమృగం చేసిన హెచ్చరికలకు భయపడిన బాధితురాలి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే వారు వరికుంటపాడు మండలంలో తలదాచుకోంటున్నారని అంధురాలైన బాలింతకు ఆరోగ్యం ీ ణించి పరిస్థితి విషమించిందని అంధురాలి కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. కనీసం వైద్యానికి కూడా స్థోమత లేని తమకు న్యాయం చేయక పోయినాకూడా కనీసం అమ్మాయి ప్రాణాలు కాపాడాలని బాధితులు కోరుతున్నారు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు: బాధితులు ఎట్టకేలకు దైర్యం చేసి బాధితురాలి తండ్రి పెన్నా.మాలకొండయ్య సోమవారం ఉదయం ఉదయగిరి పోలీసు స్టేషన్‌కు చేరుకుని స్థానిక ఎస్‌ఐ రామక్రిష్ణకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసులు ఈ పేదవారికి ఎంత వరకు న్యాయం చేస్తారో వేచిచూడాల్సిందేనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

Monday, February 1, 2010

సమస్యల వలయంలో ప్రాథమిక పాఠశాల...


వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:స్థానిక పట్టణంలోని మల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్ధులు విద్యను అభ్యసిస్తుండగా ఈ పాఠశాలకు ప్రహారి గోడ లేకపోవడమేకాక చుట్టూ కంపచెట్లు ఉన్నాయి. వీటితోపాటు పాఠశాల చుట్టూ పేడ దిబ్బలు కూడా ఉండటంతో పాఠశాల విద్యార్ధులు అసౌకర్యానికి గురౌతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్న భోజనం అక్కడి విద్యార్ధులు భోజనం చేయాలన్న పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. మరోవైపు ఉన్న తాగునీటి బోరు ముళ్లచెట్లలో మూసుకుపోయి ఉంది. దీంతో త్రాగునీటి వసతి కూడా సక్రమంగా అందడం లేదు. సంబంధిత పాఠశాలకు పూర్తిస్ధాయిలో కల్పించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కళ్ళులేని యువతిపై అత్యాచారం?

ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: మండలంలోని తిరుమలాపురం పంచాయతీలో దుంపవారి పల్లికి చెందిన కళ్ళులేని వికలాంగురాలైన యువతిపై, అదే గ్రామానికి చెందిన ఓ అగ్రకులస్తుడు 7 నెలల కిందట బలవత్కారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి పోతే దుంపవారి పల్లికి చెందిన పెన్నా. మాలకొండయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య 1983 సంవత్సరంలో చనిపోయినది. ఆమె చనిపోయిన రెండు సంవత్సరాలకు పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. అయితే చిన్న కుమార్తె అయిన కొండమ్మకు రెండూ కళ్ళు లేకపోవడంతో అన్నీ తానై తండ్రి వద్దనే ఉంటుంది. కొండయ్య జీవనాధార ం కోసం గ్రామంలోని రైతుల వద్ద పశువుల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఒకరోజు తన కుమార్తె కొండమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మానవ మృగం అయిన చిలకల.రమణారెడ్డి అనే కామాంధుడి కంట పడింది. కళ్ళు లేని కబోధి పై కామాంధుని వికృతి చేష్టలకు బలైపోయిందని తండ్రి ఆరోపించాడు. అంతే కాకుండా ఈ కామాంధుడు ఈవిషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో అభాగ్యురాలు ఎవరికీ ఏమి చెప్పుకోలేక పోయిందని బోరున విలపించాడు. కాలక్రమేణా కళ్ళులేని కొండమ్మకు ఆరోగ్యం సహకరించక పోవడంతో మూడు రోజుల కిందట ఉదయగిరిలోని ఒక ప్రవేట్‌ వైద్యశాలలో చూపించగా కొండమ్మ గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారన్నారు. దీంతో ఏమిచేయాలో తెలియని తండ్రి లబోదిబో మంటూ ఏడవడంతో వికలాంగురాలైన కొండమ్మ అసలు విషయం బయట పెట్టింది. దీంతో మానవ మృగం అయిన చిలకల.రమణారెడ్డి ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని కొండమ్మకు గర్భం తీపించాలని లేకపోతే మీ కుటుంబంలోని ముగ్గురిని చంపేస్తానని బెదిరించాడని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. బెదిరింపులతో భయపడి తండ్రి ఆత్మకూరుకి గర్భం తీపించేందుకు కొండమ్మను తరలించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంత వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh