online marketing

Friday, January 1, 2010

ముగిసిన ఇంటర్‌ పోటీలు


నెల్లూరు (స్పోర్ట్‌‌స) మేజర్‌న్యూస్‌: నగరంలోని ఎసి.సుబ్బారెడ్డి స్పోర్ట్‌‌స కాంప్లెక్స్‌లో ఈ నెల 29వ తేదీ నుండి జరుగుతున్న జిల్లా ఇంటర్‌ కళాశాలల ఇంటర్‌ కాలేజియేట్‌ 2009-10 పోటీలు గురువారం ముగిశాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల ప్రిన్సిపాళ్లు స్పోర్ట్‌‌స విశిష్టతను గుర్తించాలన్నారు. తమ తమ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యార్థులు క్రీడల్లో పాల్గొని భవిష్యత్‌ జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడా పథకం ‘పైకా’ ఇంటర్‌స్థాయి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. క్రమం తప్పకుండా సాధన చేసి క్రీడల్లో జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఇంటర్‌స్థాయి విద్యార్థులకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. అనంతరం విజేతలకు రోలింగ్‌ షీల్డ్‌లు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
విజేతలు జిల్లా ఇంటర్మీడియట్‌ అంతర కళాశాలల పోటీల్లో బాలుర స్పోర్ట్‌‌స చాంపియన్‌లుగా ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ జూనియర్‌ కళాశాల, చిల్లకూరు, బాలికల చాంపియన్‌లుగా జవహర్‌ భారతి జూనియర్‌ కళాశాల, కావలి, బాలుర గేమ్స్‌ చాంపియన్‌షిప్‌ను జవహర్‌భారతి, కావలి, బాలికల చాంపియన్‌షిప్‌ను డికెడబ్ల్యు కళాశాల, నెల్లూరు కైవసం చేసుకున్నాయి. చివరి రోజు జరిగిన పోటీల్లో హ్యాండ్‌బాల్‌ విజేతలుగా ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌జెసి, వాకాడు, రన్నర్స్‌గా జెబి కళాశాల, కావలి, బాల్‌బ్యాడ్మింటన్‌లో విన్నర్స్‌గా జవహర్‌భారతి, కావలి, రన్నర్స్‌గా కెఎసి, నెల్లూరు కళాశాలలు, వాలీబాల్‌లో జవహర్‌భారతి కావలి విన్నర్స్‌గా, జిజెసి విడవలూరు రన్నర్స్‌గా, ఖో-ఖోలో ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌జెసి కోట విద్యార్థులు విన్నర్స్‌గా, జిజెసి విడవలూరు రన్నర్స్‌గా నిలిచారు. బాలికల విభాగంలో బ్యాడ్మింటన్‌ విన్నర్స్‌గా డికెడబ్ల్యు నెల్లూరు, రన్నర్స్‌గా కెఎసి నెల్లూరు. బాస్కెట్‌బాల్‌ విన్నర్స్‌గా జెబి కళాశాల కావలి, రన్నర్స్‌గా విఆర్‌ కళాశాల నెల్లూరు, కబడ్డీ విన్నర్స్‌గా నెల్లూరు డికెడబ్ల్యు కళాశాల, రన్నర్స్‌గా జెబి కళాశాల కావలి, వాలీబాల్‌లో విన్నర్స్‌గా జెబి కళాశాల కావలి, రన్నర్స్‌గా డికెడబ్ల్యు కళాశాల, నెల్లూరు విద్యార్థులు నిలిచారు. ఈ కార్యక్రమంలో పోటీలకు ఆతిధ్యమిచ్చిన కెఎసి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డి.సూర్యనారాయణ, ఎస్‌విజిఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, ఎస్‌విజిఎస్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి సిహెచ్‌. రమేష్‌, నిర్వహణ సభ్యులు ఎంవి.రామ్మోహన్‌రావు, నిమ్మల సుబ్బయ్యగౌడ్‌, అధ్యాపకులు ఎన్‌.గోపాలాచారి, జివి.కృష్ణారావు, ఎస్‌విజిఎస్‌.కళాశాల పిడి వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలెంటీర్లు పాల్గొన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బడ్జెట్‌ 232 కోట్లు


చిల్లకూరు, (మేజర్‌న్యూస్‌) :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద నెల్లూరు జిల్లాకు ఈ ఏడాది 232 కోట్ల రూపాయలు బడ్జెట్‌ను కేటాయించారని డ్వామా పి.డి., సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం డివిజన్‌ స్థాయి సమావేశాన్ని చిల్లకూరు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పది మండల స్థాయి అధికారులు, క్లస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ జనవరి నెల నుండీ ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనులు రైతుల సేద్యాలకు నష్టం కలగకుండా చూడాలని వలసలు ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. గ్రామీణ హామీ పథకం పనుల మీద ఆధారపడి జీవించు 50 కుటుంబాలను గుర్తించి వారికి పూర్తి కాలం పని కల్పించాలని ఎపిఒలకు సూచించారు. 2010 సంవత్సరంలో ప్రతి గ్రామం నుండి 100 కుటుంబాలకు (పూర్తిగా హామీ పథకం పనులు చేసుకొనువారిని) 12.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధుల కొరకు మండల సమావేశంలో ప్రతిపాదించి జిల్లా పరిషత్‌కు పంపితే అక్కడ ఆమోదింపచేసి జిల్లా కలెక్టర్‌ ద్వారా నిధులు మంజూరవుతాయని సుధాకర్‌రెడ్డి చెప్పారు. హార్టికల్చర్‌ ద్వారా మామిడి, బత్తాయి, ఇతర పంటలకు ఎరువులు, మందులు, కంచెకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా అంతర్‌సేద్యానికి కూడా నిధులివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు సన్న, చిన్నకారు రైతులకు అందాయా, లేదా తెలుసుకునేందుకు లబ్దిదారుల వివరాలు కంప్యూటర్‌లో భద్రపరుస్తున్నామని, 15 రోజులకు ఒక పర్యాయం సమీక్షా సమావేశం జరుపుతామని తెలిపారు. ప్రతి గ్రామంలో 100 రోజులు పని కల్పించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ రవిచంద్రప్రకాష్‌, ప్రేమ్‌చంద్‌, విశ్రాంతికుమార్‌, ఎంపిడిఒ ప్రభాకర్‌రావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

శాంతి భద్రతలతో వెలుగొందాలి


నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌:జిల్లా ప్రజలు శాంతి భద్రతలతో నూతన సంవత్సరంలోకి అడుగిడి సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఎస్‌పి మల్లారెడ్డి కాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే యువత శాంతి భద్రతలను పాటించాలన్నారు.
పోలీస్‌ డైరీ ఆవిష్కరణనగరంలోని పోలీస్‌గ్రౌండ్‌ నందు ఉన్న ఉమేష్‌చంద్ర అతిధి గృహంలో పోలీస్‌ డైరీని ఎస్‌పి మల్లారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ డైరీని ముద్రించే సంప్రదాయం జిల్లా పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం వారికే చెల్లుతుందన్నారు. పోలీసుల సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా వాటిని సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందిలతోపాటు అధికారుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డిలతోపాటు సభ్యులు పాల్గొన్నారు.

కేంద్రం నిర్ధిష్టమైన కమిటీని నియమించాలి


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన కమిటీని నియమించాలని మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కమిటీని నియమించడం ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను అన్ని ప్రాంతాల ప్రజలకు సవివరంగా తెలియజెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనవరి 5వ తేదీ అన్ని పార్టీల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించడం సరైన నిర్ణయమేమీ కాదన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యమం పార్టీల చేతుల్లోనూ, ప్రజాప్రతినిధుల చేతుల్లోనూ లేదనీ, అది ఏనాడో ప్రజల్లోకి వెళ్లిపోయిందని గుర్తుచేశారు. ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోవడం లేదనీ, కేవలం కొన్ని పార్టీలు మాత్రమే తమ ఉనికి కోసం ప్రత్యేక తెలంగాణా బాట పట్టాయని స్పష్టం చేశారు.కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రం నుంచి జైపాల్‌రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారనీ, మిగతా మంత్రులు కేబినెట్‌ సమావేశాలకు హాజరయ్యే వారు కాదని అన్నారు. దీన్నిబట్టి చూస్తే సమైక్యాంధ్ర ఉద్యమానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు కలగడం లేదన్నారు. తమిళనాడుకు చెందిన మంత్రి చిదంబరం ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని చూస్తున్నారనీ, తద్వారా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ను దూరంగా ఉంచడమే ఆయన ఆలోచనని ఆరోపించారు. చిన్నరాష్ట్రాల మీద శ్రద్ధ ఉంటే తమిళనాడును కూడా విభజించాలని చిదంబరంకు చురకలంటించారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నూనె మల్లికార్జునయాదవ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, అన్నం దయాకర్‌గౌడ్‌, సంపత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, December 30, 2009

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న పథకాలు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జడ్పీ సమావేశమందిరంలో జరిగింది. అధికారుల ఊకదంపుడు ఉపన్యాసాలకు అడ్డుతగులుతూ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యుల ప్రశ్నోత్తరాలతో సాగిన సమావేశంలో విద్య, వైద్య సంబంధిత అంశాలపై కాస్త వాడివేడిగా చర్చ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని పలు సందర్భాలలో ప్రజాప్రతినిధులు అధికారులపై విరుచుకుపడ్డారు. మఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. హాస్టళ్లలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి వాకబు చేసినప్పుడల్లా ‘ప్రతిపాదనలు పంపాము. మంజూరు కాగానే పనులు చేపడతాం’ అనే సమాధానం అధికారుల నుంచి వస్తోందనీ, ప్రతి సమావేశంలోనూ అధికారులు ఇదే విధమైన సమాధానం వస్తోందని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు ఒక దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వెంకటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యురాలు తిరుపతిలో నివాసం ఉంటూ వారానికి ఒక్క రోజు మాత్రమే వైద్యశాలకు వస్తోందని స్థానిక శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ అధికారులకు ఫిర్యాదు చేయగా, జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వైద్య సిబ్బంది డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరతామన్నారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు అందుకునేందుకు త్వరలో జిల్లాస్థాయిలో తమ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టివి రమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో చికున్‌గన్యా, మలేరియా, సై్వన్‌ప్లూ, డెంగీ తదితర వ్యాధులు తీవ్రమవుతున్నాయనీ, ఇందుకు ప్రతిగా అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆశాజనకంగా లేవని జడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు.
హాస్టల్‌ విద్యార్థులకు అసౌకర్యం కలిగించొద్దు - కాకాణిజిల్లాలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహ భవనాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథక బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రూ.29 కోట్లు మంజూరు చేయడం జరిగిందనీ, ఆ నిధులను నియోజకవర్గాల వారీగా కేటాయించి పనులు అమలు చేసేందుకు సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకుంటూ ఆసుపత్రులలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపి చింతా మోహన్‌, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు పరసా రత్నం, బల్లి దుర్గాప్రసాద్‌రావు, కురుగొండ్ల రామకృష్ణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బి.రాఘవేంద్రరెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ టివిఎస్‌ రాజా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సీతామహలక్ష్మి, ఐటిడిఏ పిఓ రమేష్‌కుమార్‌, డిఇఓ డి.ఆంజనేయులు, డిఎంఓ డాక్టర్‌ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.

కడప ఎర్రచందనం.... ఏఎస్‌పేట నుంచి చెనై్నకు....

అనుమసముద్రంపేట, (మేజర్‌న్యూస్‌): ఏఎస్‌పేటలో పోలీసులు స్వాధీన పరచుకున్న ఎర్రచందనం దుంగలు కడప జిల్లాకు చెందినట్లుగా మంగళవారం పోలీసులు నిర్థారించారు. గత ఆరు నెలలుగా ఏఎస్‌పేటలో ఎర్రచందనం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అప్పుడప్పుడు కడప జిల్లా పోరుమావిళ్ళ, బ్రహ్మంగారిమఠం పరిసర ప్రాంతాల దుంగలను కొందరు వ్యక్తులు ఏఎస్‌పేటలో ఓ చోట భద్రపరిచేవారు. ఇక్కడ నుంచి స్థానికుల సహాయంతో చెనై్నకు తరలించి వ్యాపారం నిర్వహించేవారు. అయితే మొత్తానికి పోలీసులకు సమాచారం అందడంతో ఏఎస్‌పేట ఎసై్స శ్రీనివాసరావు, ఆత్మకూరు సిఐ అక్కేశ్వరరావులు దాడి చేసి దుంగలను స్వాధీనపరచుకున్నారు. నింధితులు పది మందిగా తొలుత గుర్తించిన పోలీసులు సోమవారం అక్కడికక్కడే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహబూబ్‌బాషా, సోమవరపు సూర్యనారాయణ, షేక్‌ షబ్బీర్‌లు వారిలో ఉన్నారు. అయితే మంగళవారం వారిలో ఓ వ్యక్తిని తొలగించి మరో వ్యక్తిని నిందితునిగా నమోదు చేసి సాయంత్రం కోర్టుకు హాజరుపరిచారు. ఈ విషయమై స్థానికంగా పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి. పది మంది నిందితులుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం వారిలో ఒకరిని వదిలేసి మరో వ్యక్తిని నిందితునిగా కోర్టుకు హాజరుపరచడంతో ఈ సంఘటన వెనుక కొందరి నేతల హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఆరు నెలలుగా కడప జిల్లా నుంచి చాకచక్యంగా దుంగలను దర్గా పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ సంచరించే యాత్రికులను కళ్ళుగప్పి గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుండేది. దీనికి స్థానికంగా కొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ కేసును అటవీ శాఖకు అప్పగించేసేశారు పోలీసులు. మిగతా ఏడుగురి పరిస్థితి ఏమిటో ఆ పోలీసులకే తెలియాల్సి ఉంది.
నిన్న స్టేషన్‌లో... నేడు అంగట్లో....: ఎర్రచందనం కేసులో నిందితునిగా అదుపులోకి తీసుకున్న షేక్‌ షబ్బీర్‌ సోమవారం స్టేషన్‌లో కనిపించాడు. పోలీసులు ఈయన నిందితుడని పత్రికలకూ సమాచారమిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆ వ్యక్తి దర్గా వద్ద తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ కనిపించాడు. ఈ విషయమై స్థానికంగా చర్చ మొదలైంది. పోలీసులు నాయకుల సిఫార్సు మేరకే షబ్బీర్‌ను తొలగించారని గుసగుసలాడుతున్నారు.
అతను అమాయకుడు: ఎసై్సఏఎస్‌పేటలో సోమవారం పోలీసులు ఎర్రచందనం కేసులో అదుపులోకి తీసుకున్న షేక్‌ షబ్బీర్‌ అమాయకుడని, ఈ సంఘటనకు, అతనికి ఎలాంటి సంబంధం లేదని ఎసై్స శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం మేజర్‌న్యూస్‌కు వివరించారు. అయితే నిన్న షబ్బీర్‌ను నిందితునిగా గుర్తించారు కదా అని ప్రశ్నిస్తే అలాంటిదేమి లేదన్నారు. షబ్బీర్‌ స్థానంలో మస్తాన్‌సాహెబ్‌ను నిందితునిగా అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచామని ఆయన వివరించారు.

కార్డుల సర్వేపై అనుమానాలొద్దు


సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ ః కార్డుల సర్వేపై అనుమానాలొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి జ్వాలాప్రకాష్‌ తెలిపారు. సూళ్ళూరుపేటలో జరుగుతున్న కార్డుల సర్వేపై మంగళవారం ఆరాతీసారు. సూళ్ళూరుపేట పట్టణంతో పాటు కొన్నుంబట్టు, మన్నారుపోలూరు తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. కార్డుల సర్వేలలో బోగస్‌ కార్డులను మాత్రమే తొలగిస్తామని, అర్హులకార్డులు ఎట్టి పరిస్థితులలోను తొలగించమని వివరణ ఇచ్చారు. జ్వాలాప్రకాష్‌తో పాటు తహసిల్‌దార్‌ జాలిరెడ్డి, డిప్యూటీ తహసిల్‌దార్‌ జయచంద్ర, విఆర్‌ఓలు రాజగోపాల్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తె.రా.స.వి దౌర్జన్యపూరిత ఉద్యమాలు


నెల్లూరు(కల్చరల్‌/ఫత్తేఖాన్‌పేట) మేజర్‌న్యూస్‌:విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రత్యేక తెలంగాణా కోసం కెసిఆర్‌ చేస్తున్న ఉద్యమాలు దౌర్జన్యపూరితమని రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర వాదుల ప్రతినిధిగా మంగళవారం నగరంలోని బారాషాహిద్‌ దర్గాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల హృదయాల్లోంచి ఉద్భవించిందన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదులు ఉద్యమాల పేరుతో విద్యార్థులను ప్రలోభపెడుతూ, రాజకీయ నాయకులను బెదిరింపులకు గురి చేస్తూ దౌర్జన్యపూరితంగా ఉద్యమించడం ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి జాయింట్‌ యాక్షన్‌ కమిటీలుగాని, రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లుగాని లేకపోవడానికి కారణం ప్రజల హృదయాల్లోనుంచి ఉద్యమం ఆవిర్భవించడమేనన్నారు. అయితే ఏర్పాటుదారులు ఎల్‌టిడి తరహాలో విద్యార్థులను తయారుచేస్తూ ఆంధ్ర కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉద్యమాలు చేపట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తును కాలరాస్తూ ఆంధ్ర ప్రాంత వాసుల విద్యాసంస్థలపై దాడులు, యాజమాన్యానికి బెదిరింపులను ఆయన తీవ్రంగా నిరసించారు. కుల, మత, జాతి, వర్గాలకు అతీతంగా ఉండే సినీరంగంపై కూడా వేర్పాటువాదులు దాడులు చే యడం సిగ్గుచేటన్నారు. కళాకారులను కళాకారులుగా గుర్తించకుండా వేర్పాటువాద ధోరణితో దుందుడుకు చర్యలకు పాల్పడడంలోనే వారి బుద్ధి అర్ధమవుతుందన్నారు. కెసిఆర్‌ మెడలు వంచైనా సమైక్యాంధ్రను సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. అందుకోసం తమ పదవులను, ప్రాణాలను, ప్రజల కోసం వదులుకోడానికి సిద్ధమన్నారు. ప్రజలకు మంచి చేసే అవకాశం జీవితంలో ఒకసారే వస్తుందని, ఆ అవకాశాన్ని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు.సుదీర్ఘ చరిత్రగల కాంగ్రెస్‌ పార్టీలో కాంగ్రెస్‌ నాయకులుగా ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కాంగ్రెస్‌ నాయకులకు ఉందన్నారు. వేర్పాటువాద నాయకులతో చేరి రాజకీయ నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు క్షమించరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలపై, వారి ఆస్తులపై దాడులు జరపడం ఎక్కువ కాలం చెల్లదన్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వారి ఆస్తుల జోలికి సమైక్యవాదులు వెళ్లడంలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఉదాహరణకు ఎంపి నామా నాగేశ్వరరావుకు చెందిన పవర్‌ప్రాజెక్టు గూడూరులో ఉన్నప్పటికీ సమైక్యవాదులంగా దాని జోలికే పోవడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో తమకు ఇష్టమొచ్చిన ప్రాంతాల్లో తమ వ్యాపార కలాపాలను నిర్వహిస్తున్న ఈ రోజుల్లో తెలంగాణా వేర్పాటువాదుల చర్యలను ఆయన దుయ్యబట్టారు.ప్రజలు, నాయకులు వాస్తవాలు తెలుసుకుని సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలన్నారు. రాజకీయ నిరుద్యోగులకు అండగా ఉండి ప్రజలకు కష్టాలు కలిగించే చర్యలకు పూనుకోవద్దని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌పార్టీ నాయకులకు ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మేయర్‌ నందిమండలం భానుశ్రీ, కార్పొరేటర్లు సందానీబాష, మునాఫ్‌, పిండి సురేష్‌, జయకుమార్‌ రెడ్డి, సాయిలలిత, కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, కాంగ్రెస్‌ నాయకులు, వక్ఫ్‌బోర్డు సభ్యులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమాజంలో పత్రికలది కీలక పాత్ర -- ఎమ్మెల్యే, కలెక్టర్‌

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు ప్రభుత్వానికి -ప్రజలకు వారధిగా నిలిచే పత్రికలది సమాజంలో ఎంతో కీలకపాత్ర అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌లు పేర్కొన్నారు. ‘సూర్య’ దినపత్రిక ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను వారు మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ విలేకర్లు నిజాన్ని నిర్భయంగా వార్తల రూపంలో అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తే సమాజంలో అవినీతిని పారదోలవచ్చన్నారు.సూర్య దినపత్రిక ఇలాంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకుని ప్రత్యేక సంచికలను ఆవిష్కరించుకోవాలని తాను మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జ్‌ మురళీధర్‌లాల్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌బాబు తదితర అధికారులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే వార్తల వల్ల ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. పత్రికలకు విశ్వసనీయత ఎంతో అవసరమని, కొన్ని సందర్భాల్లో విశ్వసనీయత కోల్పోయే విధంగా వార్తలు ఉంటుండడం బాధాకరమన్నారు. ప్రస్తుతమున్న పోటీ సందర్భంగా సంచలనాల కోసం వస్తున్న కొన్ని వార్తలు సమాజానికి మేలు చేసేకన్నా కీడు జరుగుతుందనే విషయాన్ని పాత్రికేయులంతా గుర్తించాలన్నారు. విలేకరులు సామాజికంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా వ్యవహరించే పాత్రికేయులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య మనుగడ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుందని, సమాజాభివృద్ధికి పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ‘సూర్య’ దిన పత్రిక ఇలాంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని, సమాజాన్ని అన్నివిధాలా ముందుకు నడిపించేందుకు తనవంతు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ భానుశ్రీ, కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుబ్బరాజు, డిఇ సంజయ్‌, సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జ్‌ ఎస్‌.మురళీధర్‌లాల్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌బాబు, అసిస్టెంట్‌ సర్క్యులేషన్‌ మేనేజర్‌ టి.కృష్ణారావు, సర్క్యులేషన్‌ ఆఫీసర్‌ జాన్‌ అహ్మద్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ మేనేజర్‌ కె.కొండయ్య తదితర పాత్రికేయ సిబ్బంది పాల్గొన్నారు.

జబ్బునపడ్డ నెల్లూరు జిల్లా

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:జిల్లాలో ఈ ఏడాది ప్రజారోగ్యం జబ్బున పడిందని చెప్పవచ్చు. మొదట్లో దీని ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ చివరి నాలుగు నెలల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సై్వన్‌ఫ్లూ భూతం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురయ్యేలా చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ నెల నుంచి జిల్లాలో విషజ్వరాల తాకిడి ఎక్కువైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా జిల్లా విషజ్వరాలతో బాధ పడుతుంటే చాలదన్నట్టుగా వర్షాలు ఎక్కువ కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. వర్షపునీరు, మురికినీరు కలసి దోమలకు నిలయాలుగా మారిపోయాయి. కుళాయిల్లో నుంచి కలుషితమైన నీరు రావడం, విపరీతంగా దోమలు ప్రజలపై తమ విశ్వరూపం చూపడంతో డెంగ్యూ జ్వరాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా 15 మంది మృతి చెందారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కేవలం మూడు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యాధికి అనేకమంది చిన్నారులు గురై ప్లేట్‌లెట్ల సంఖ్య తీవ్రంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై చెనై్న, తిరుపతి, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. సకాలంలో వైద్యసదుపాయం పొందగలిగినవారు మాత్రం వేలాది రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకోగలిగారు. అయితే కొందరిని దురదృష్టం వెంటాడడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ముఖ్యంగా ఖరీదైన వైద్యసదుపాయం పొందే స్థోమత లేని పేదలు నగరంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల, డాక్టర్‌ రామచం్రద్రారెడ్డి ప్రజావైద్యశాల, నారాయణ, జయభారత్‌ తదితర ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్లేట్‌లెట్లు తయారు చేసే పరికరాలు సిద్ధంగా ఉంచినప్పటికీ అందుకు సంబంధించిన కొన్ని అనుమతులు, ఒకటి రెండు ముఖ్యమైన పరికరాల సరఫరా లేక ఇప్పటికీ వృధాగానే పడివున్నాయి. ఒక్క రెడ్‌క్రాస్‌ సంస్థ మాత్రమే నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు విరివిగా ప్లేట్‌లెట్లను అందజేయగలిగింది. ఇక చికున్‌గున్యా జ్వరాల విషయం చెప్పనవసరం లేదు. ప్రతి వంద మందిలో 70 మంది వరకు ఈ వ్యాధి బారిన పడ్డారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక ఇంట్లో ఒ రు ఈ వ్యాధిన పడితే తప్పకుండా అదే ఇంట్లో మరో ఇద్దరు ముగ్గురు పరిస్థితి కూడా అదే కావడం మామూలైపోయింది. చికున్‌గున్యా బారినపడి వారం రోజుల్లోగా కోలుకున్నప్పటికీ మరో నెల రోజులపాటు వారు శరీరంలోని ప్రతి అవయవం నొప్పి పుట్టేలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. అయితే జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ దృష్టిలో అధికారికంగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం హాస్యాస్పదం.అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏడాది నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో శస్తచ్రికిత్సలు వికటించి 23 మంది శాశ్వతంగా కంటిచూపు కోల్పోయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు కంటిచూపును కోల్పోవడం ఇదే ప్రధమం. ఈ ఏడాది అక్టోబర్‌ 19, 20వ తేదీల్లో నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో 29 మంది ఉచితంగా, మరో ఏడుగురు ఫీజు చెల్లించి ఆపరేషన్లు చేయించుకున్నారు.అయితే ఇంతటి ఘోర వైఫల్యానికి శస్తచ్రికిత్సలకు ఉపయోగించిన ‘రింగర్‌ లాక్టేట్‌’ అనే ఐవి ఫ్లూయిడ్స్‌ కారణంగా వైరస్‌ సోకి ఆపరేషన్లు వికటించినట్లు సంబంధిత నిపుణులు నిగ్గు తేల్చారు. ఈ విషయంలో ప్రభుత్వం సైతం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం నుంచి మరో రూ.1.50 లక్షలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే చివరకు ఆసుపత్రి యాజమాన్యం వైఫల్యం లేదని తేలడంతో సంబంధిత రింగర్‌ లాక్టేట్‌ తయారీ సంస్థ నుంచి ఏమైనా నష్టపరిహారం అందుతుందేమోనని బాధితులు ‘చీకటి ప్రపంచంలో’ ఉంటూ ‘మనో నేత్రాల’తో ఎదురు చూస్తున్నారు. ఇక మెదడువాపు వ్యాధి విషయంలో జిల్లాలో రెండు కేసులు అధికారికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ, మెదక్‌, ఆదిలాబాద్‌, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి నివారణకు సంబంధించిన వ్యాక్సిన్‌లను వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో తొలివిడతగా 4,43,635 మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాలనేది లక్ష్యం కాగా 3,90,918 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రభుత్వం 84 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఇక రెండో విడతగా 4.30 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌లు ఇవ్వాల్సి వుంది. అయితే ప్రభుత్వం నుంచి చాలినన్ని సిరంజిలు సరఫరా కాకపోవడంతో ఈ కార్యక్రమం మరో నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. జిల్లాలో పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిలో భాగంగా వచ్చేనెల 10వ తేదీ, ఫిబ్రవరి 7వ తేదీలలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది జిల్లా తీవ్రస్థాయిలో జబ్బున పడిందని చెప్పకతప్పడంలేదు.

ప్రతిభచూపిన డిఎల్‌ఎన్‌ఆర్‌ విద్యార్ధులు

బుచ్చిరెడ్డిపాళెం, మేజర్‌న్యూస్‌ :బుచ్చి స్థానిక దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన మలవతు సుబ్బయ్య స్మారకక్రీడా పోటీలలో స్థానిక దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అద్భుత ప్రతిభ చూపారు. బుచ్చి ఎస్‌ఐ సుబ్బారావుచే అట్టహాసంగా ప్రారంభింపబడిన ఈ క్రీడాపోటీలలో పట్టణంలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనగా 100, 200, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌ క్రీడాంశాలలో మొదటి, రెండవ స్థానాలు డిఎల్‌ఎన్‌ఆర్‌ పాఠశాల విద్యార్ధులు కైవశం చేసుకున్నారు. మిగిలిన పాఠశాల విద్యార్ధులు మూడవ స్థానాలకే పరిమితమయ్యారు. ఈ క్రీడాపోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఈ కార్యక్రమంలో కొడవలూరు తహసీల్దార్‌, క్రీడాపోటీల నిర్వాహకులు అయిన మలవతు సుధాకర్‌, డిఎల్‌ఎన్‌ఆర్‌ ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు మధు, ఏసు దానమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు నెట్‌లో పంపుతారు.

Monday, December 28, 2009

ఇక్కడ హోమియో వైద్యం ఉన్నా లేనట్లే

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ప్రభుత్వం వ్యయప్రయాసలకోర్చి హోమియో వైద్యం ప్రజలకు అందించాలన్న ఉద్ధేశంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో వైద్యశాలను ఏర్పాటు చేసిన ఇక్కడ వైద్యులు లేక పోవడంతో నిరుపయోగంగా మారింది. గత ఏడాది ఆసుపత్రికి బోర్డు అయితే తగిలించారు కానీ ఒక్కరోజుకూడా వైద్యం అందించిన పాపాన పోలేదు. ఇక్కడక్కి పోస్టింగ్‌చేసిన వైద్యురాలు బాధితలు స్వీకరించక పోవడంతో వైద్యశాల ఖాళీగా ఉంది వచ్చిన మందులు ఏమౌతున్నాయో తెలియని పరిస్థితి. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా నామమాత్రంగా ఉండటంతో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులైన స్పందించి వైద్యశాలకు సిబ్బందిని నియమించి హోమియో వైద్యం ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది.

కొంత మోదం...కొంత ఖేదం

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: ఈ ఏడాది జిల్లా రైతు ఆశించినంతగా వికసించలేకపోయాడని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉదాసీనత, మధ్య మధ్యలో ప్రకృతి ప్రకోపం కలగలిసి రైతుకు మిశ్రమ ఫలితాలను మాత్రమే మిగిల్చాయి. ప్రతి ఏడాది ఏదో రకంగా ప్రకృతి వైపరీత్యాలకు ఎంతో కొంత నష్టపోతున్న జిల్లా రైతు ఈ ఏడాదైనా ప్రకృతి కరుణిస్తుందని ఆశించాడు. అన్నదాతల ఆశలను ప్రకృతి ఈ ఏడాది పూర్తిగా వమ్ము చేయకపోయినా జూన్‌, జూలై, ఆగష్టు నెలల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కలవరపెట్టాయి. గత ఏడాది ఖరీప్‌ సాగు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తయి, జిల్లా వ్యాప్తంగా సుమారు 11.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దిగుబడి బాగుందని అన్నదాత భావించే లోపే దళారుల పుణ్యమాని గిట్టుబాటు ధర లేక అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ కష్టానికి తగిన గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతూ అన్నదాతలు జిల్లాలో మార్చి నెలలో ఆందోళన చేపట్టారు. మే నెలలో వ చ్చిన ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పంట తోటలు దెబ్బతిన్నాయి. మామిడి, బత్తాయి, నిమ్మ పంటలకు తీవ్ర నష్టం కలిగింది. గాలుల ప్రభావం వలన పండ్లన్నీ నేలరాలిపోవడంతో తలపై చేతులు పెట్టుకొని దిగాలుగా రైతులు ఉండిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన నిస్సహాయతను మరోసారి చూపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఆక్వాసాగు మరింత తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది రబీలో డెల్టా కింద 2 లక్షలా 30వేల ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు మార్చి నెలలో జరిగిన ఐఏబి సమావేశంలో నిర్ణయించారు. అధికారులు అనుకున్న విధంగానే ఈ ఆయకట్టు మొత్తానికి నీటిని అందించడంలో సఫలీకృతులైనారు. అయితే నాయుడుపేట, బోగోలు తదితర మండలాలతో పాటు మెట్ట ప్రాంత మండలాల్లో నీరు లేక వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. చివరకు పశువుల దాణాగా పొలాలను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యుత్‌ కోత వలనే ఇటువంటి పరిస్థితి దాపురించిందనీ, తమకు నష్టపరిహారం అందచేయాలని రైతులు చేసిన విజ్ఙప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇక ఖరీప్‌ సాగుకు సమాయత్తమవుతున్న జిల్లా రైతుపై ప్రకృతి ప్రకోపాన్ని చూపించిన సంఘటన జూన్‌, జూలై, ఆగష్టు నెలల్లో చోటుచేసుకొంది. రైతుల నుంచి వస్తున్న ఆందోళనలతో జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దిగొచ్చిన ప్రభుత్వం జిల్లాలోని రాపూరు, నెల్లూరురూరల్‌ మండలాల మినహా మిగతా మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ రెండు ప్రాంతాల రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో చివరకు ఆ రెండు మండలాలను కూడా కరవు జాబితాలో చేర్చారు. కరవు జాబితాలో అన్ని ప్రాంతాలను చేర్చడంతో తమ పనైపోయినట్లు ప్రభుత్వం భావించడం బాధాకరం. ఇంతవరకూ రైతులకు ఎటువంటి కరవు ప్రోత్సాహకాలు అందలేదు. రుణాలను రీషెడ్యూల్‌ చేస్తారని భావించిన అన్నదాతను ప్రభుత్వం కనికరించలేదు. మెట్టప్రాంతాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల వలన పాడిరైతు కూడా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పశుగ్రాస కొరతతో పశువులను అయిష్టంగా కబేళాలకు పాడిరైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. చీకటి వెంటే వెలుతురున్నట్లు, కరవు కోరల్లో చిక్కిన రైతన్నను ప్రభుత్వం మరచినా అదే ప్రకృతి తిరిగి ఆదుకుంది. సెప్టెంబర్‌ నెల నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల పుణ్యమాని జిల్లాలోని అన్ని జలాశయాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో జిల్లాలో ఖరీప్‌ సాగుకు సుమారు నాలుగు లక్షలా 10వేల ఎకరాల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. తుపాన్‌ల నెలగా పేరుగాంచిన నవంబర్‌ నెలలో ఎటువంటి ప్రకృతి ఉపద్రవం చోటుచేసుకోకపోవడంతో అన్నదాత ఊపిరి పీల్చుకున్నాడు. మరో పక్షం రోజుల్లో ఖరీప్‌ కోతలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జలయజ్ఙంలో భాగంగా చేపట్టిన బ్యారేజి నిర్మాణాలు, చెరువుల మరమ్మతులు, కాలువల ఆధునీకరణ తదితర బృహత్తర కార్యక్రమాలన్నీ తాబేలు నడక చందాన కొనసాగుతుండడం రైతులకు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని సడలించేలా చే స్తోంది.

మహానుభావులు స్థాపించిందే కాంగ్రెస్‌పార్టీ

వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఎందరో మహానుభావులచే స్థాపించబడిందే కాంగ్రెస్‌పార్టీ అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగువేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఇందిరాభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్లసిరి మాట్లాడుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్ర్తి, మౌలానా అజాద్‌, ఇందిరాగాంధీ లాంటి ఎందరో మహానుభావులు చేసిన కృషి వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం మొత్తం తలకిందులైనపుడు అప్పటి ప్రధాని పివి.నరసింహరావు, అప్పటి కేంద్ర ఆర్థిక మంద్రి మన్మోహన్‌సింగ్‌లు ఆర్థిక సంస్కరణల వల్ల ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా మనదేశాన్ని నిలబెట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు.పదవుల కంటే పార్టీయే ముఖ్యమని ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి కాంగ్రెస్‌పార్టీని పునరుజ్జీవనం చేసిన మహానాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు. ఆమె నాయకత్వాన కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఇంత ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో తాము ఉన్నందుకు గర్వపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాదులందరూ గర్వపడుతూ ఆ మహానాయకుల అడుగుజాడల్లో నడచి ఈ దేశానికే మరింత సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి ఉడతా వెంకటరావు, బిసి సెల్‌ ఉపాధ్యక్షులు కె.రఘురాంముదిరాజ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ టి.బాలసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నష్టాలను అధిగమించండి

సంతపేట (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావంతో ఆర్టీసి భారీస్థాయి నష్టాల్లో ఉందని, వాటిని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆర్టీసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌పి యాదవ్‌ ఆదేశించారు. నెల్లూరు ఆర్టీసి మెయిన్‌ బస్టాండును ఆదివారం ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు ఆర్టీసి 1 డిపో గ్యారేజిలో పనిచేస్తున్న మెకానిక్‌లను ఉద్దేశించి పని విధానం సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. అనంతరం టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పరిశీలించి పలు సూచనలను చేశారు. అక్కడ నుంచి బయలుదేరి పడుగుపాడులో ఉన్న రీజనల్‌ వర్క్‌షాపును సందర్శించారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎస్‌సి. సాల్మన్‌రాజు, నెల్లూరు రీజనల్‌ మేనేజర్‌ పి.శేషగిరిరావు, ఛీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎంవి.ప్రభాకర్‌రెడ్డి, 1 డిపో మేనేజర్‌ ఈగా భాస్కర్‌రెడ్డి, 2 డిపో మేనేజర్‌ పి.శీనయ్య అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా వైకుంఠ ద్వారదర్శనం

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వైష్టవాలయాల్లో భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకోడానికి బారులు తీరారు. నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఇరువురు ఎమ్మెల్యేలతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను చేశారు. భక్తులు స్నానాలు ఆచరించేందుకు పెన్నానదిలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. భక్తులు దేవాలయంలోనికి వెళ్లడానికి, వెలుపలికి రావడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారదర్శనం, అమ్మవారి దర్శనం, కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వెలుపలికి రావడానికి ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల పై నుండి విఐపిలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవాలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.

జిల్లాలో కరువైన శాంతి భద్రతలు

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల పనితీరు నిర్వీర్యమైంది. అధికారులు గణాంకాల్లో మాత్రం గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖంలో ఉన్నాయని సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవానికి జిల్లాలో శాంతి భద్రతలు విఘాతం కలిగి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు మాత్రం రాజకీయ నాయకుల కనుసన్నలలో తమ ఉద్యోగాలను చేశారే తప్ప వాస్తవంగా చేయాల్సిన డ్యూటీలు చేయలేకపోయారు. కొద్దిమంది అధికారులు పూర్తిగా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలోనే మునిగి తేలారు. మరికొంతమంది అధికారులు అటు రాజకీయ నాయకుల, ఇటు తమ అధికారుల మన్ననలను పొందడానికి చేయలేని పనులు కూడా చేస్తూ మునిగి తేలారు. జిల్లాలో పేరుకుపోతున్న కేసులనుగాని, దొంగలను పట్టుకోవడంలో చూపించాల్సిన నైపుణ్యాన్ని ప్రదర్శించడంలేదు. విచ్చలవిడిగా జిల్లాలో పెరిగిపోయిన వైట్‌కాలర్‌ నేరాలను అసలు పట్టించుకోవడమే మానేశారు. దీనివలన స్టేషన్‌లలో మొక్కుబడిగా రిజిష్టర్‌ అవుతున్న దొంగతనాలు వంటి వాటిమీద మాత్రమే చర్యలుంటున్నాయి తప్ప, వైట్‌కాలర్‌ నేరగాళ్లను పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతేలేదు. అవినీతి విపరీతంగా పెరగడంతో పోలీస్‌ శాఖలోని అధికారులు పలువురు ఏసీబీ అధికారులకు చిక్కి శాఖ పరువును వీధిన పెట్టారు. నగరంలోని పలు స్టేషన్‌లలో ఎస్‌ఐ, సిబ్బందికి మధ్య వివాదాలు చోటుచేసుకుని సిబ్బందిని, ఎస్‌ఐని బదిలీలు చేసే పరిస్థితి ఏర్పడడం చూస్తే క్రమశిక్షణ ఏపాటిదో అర్థమవుతుంది. ఒక స్టేషన్‌ నుంచి మరొక స్టేషన్‌కి బదిలీ అయ్యే ఎస్‌ఐ తనతోపాటు తన ఐడి పార్టీలను కూడా బదిలీ చేయించుకుని స్టేషన్‌కు పోవడం వంటి సంఘటనలు పలువురిని బాధ కలిగించాయి. గత ఏడాది డెకాయిటీలు నాలుగు ఉండగా, ఈ ఏడాది రెండుగా ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జిల్లా పోలీసు ఎన్నికల బందోబస్తు నిర్వహణలో సత్ఫలితాలు సాధించారు. అక్కడక్కడా చిన్నపాటి సంఘటనలు తప్ప మరెక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
పెరిగిన ఛీటింగ్‌ కేసులు, కిడ్నాప్‌లు, తగ్గిన చోరీలుజిల్లాలో ఛీటింగ్‌ కేసులు గత ఏడాది 127 నమోదు కాగా ఈ ఏడాది 155 నమోదైనాయి. అదేవిధంగా కిడ్నాప్‌లు గత ఏడాది 39 నమోదు కాగా, ఈ ఏడాది 53 కేసులు నమోదైనాయి. దొంగతనాలు దాదాపు గత ఏడాది 264 నమోదు కాగా, ఈ ఏడాది 179 నమోదైనాయి. గత ఏడాది చోరీ జరిగిన ఆస్తి రి వరీ విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదు. గత ఏడాది సుమారు రూ.3 కోట్ల విలువైన సొమ్ము చోరీ కాగా ఈ ఏడాది కోటి రూపాయలు సొమ్మును రికవరీ చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఇంటలిజెన్స్‌ ఎస్‌ఐ ఇంట్లోనే దాదాపు రూ.20 లక్షల వరకు మాగుంటలేఅవుట్‌లో చోరీ అయినా రికవరీలో ఇంతవరకు అతీగతీ లేదు.
పెండింగ్‌ కేసులు ముమ్మరం జిల్లాలోని పలు స్టేషన్లలో పెండింగ్‌ కేసులు ముమ్మరంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఏడాది 60కి పైనే మర్డర్‌ కేసులు నమోదయ్యాయి. బాలాజీనగర్‌ స్టేషన్‌ పరిధిలోని హైవేపై తల్లి, బిడ్డను హత్య చేసి గోనె సంచుల్లో పెట్టి పారవేసి నేటికి ఏడాది అయినా నిందితులను అరెస్ట్‌ చేయడంలో అతీగతీ లేదు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్ద వివాహితను కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. దీనిపై హోం మంత్రి నుంచి అధికారులకు చీవాట్లు పడడంతో నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపి అధికారులు కొద్దిపాటి ఉపశాంతిని పొందారు. ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదులో గత ఏడాది 102 నమోదు కాగా, ఈ ఏడాది 135 నమోదై ఫైళ్లు పెండింగ్‌లో పేరుకుపోయాయి. అదేవిధంగా వేధింపుల కేసులు విపరీతంగా జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. వీటిని పరిష్కరించడంలో స్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తున్నారే తప్ప కేసులు పరిష్కరించడంలో సరైన నిర్ణయం తీసుకోలేదు.
రక్తం చిందిన హైవేగత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగాయి. గత ఏడాది సుమారు 1700 వరకు నమోదై 500 మంది దుర్మరణం చెందారు. ఈ ఏడాది 2000 పైచిలుకు రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు 600 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. గత నెల చింతారెడ్డిపాళెం వెళ్లే హైవే క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది చిత్తూరు జిల్లాకు చెందిన డ్రైవర్‌ ఒకరు దుర్మరణం చెందడం పలువురిని కలచివేసింది. బిట్రగుంట వ ద్ద పోలీసులు దొంగలను పట్టుకోవడంలో జరిగిన ఛేజింగ్‌ సమయంలో హైవేపై పలువురు పోలీసులు దుర్మరణం చెందడం పోలీస్‌ శాఖలో బాధను కలిగించింది.
పెరిగిన ద్విచక్ర వాహనాల చోరీ, దొంగనోట్ల చెలామణిజిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనం నిలబెట్టి ఆదమరిస్తే వాహనం మాయం కావడం ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నా వాటిని రికవరీ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దీనికి తోడు పక్క రాష్ట్రాల నుంచి దొంగ నోట్లను తీసుకొచ్చి విచ్చలవిడిగా చలామణి చేస్తున్నప్పటికీ వాటిని అదుపు చేయలేకపోయారు. దీనికి తోడు బ్యాంకు ఎటిఎంలలో డబ్బులు డ్రా చేయాలంటేనే కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. అనేక బ్యాంకుల్లో దొంగనోట్లు ఎటిఎంల ద్వారా రావడంతో కస్టమర్లు భయపడ్డారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh