online marketing

Friday, January 22, 2010

నేటి నుండి 90వ గ్రిగ్‌ మెమోరియల్‌ పోటీలు

నెల్లూరు (స్పోర్ట్‌‌స) మేజర్‌న్యూస్‌: జిల్లాలో పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న గ్రిగ్‌ మెమోరియల్‌ పోటీలను గురువారం పొదలకూరు జడ్పీ హైస్కూల్‌లో ప్రారంభిస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోనల్‌ స్థాయి గ్రిగ్‌ పోటీల ప్రారంభంలో భాగంగా గురువారం రాపూరు జోన్‌ పోటీలను పొదలకూరు జడ్పీ హైస్కూల్‌లో, మిగిలిన జోనల్‌ పోటీలను శుక్రవారం నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలిసారిగా జిల్లా విద్యాశాఖ, క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా పరిషత్‌ల సమన్వయంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిధుల కొరత కారణంగా అవసాన దశకు చేరుకున్న గ్రిగ్‌ మెమోరియల్‌ క్రీడలకు జవసత్వాలను కల్పించేందుకు జిల్లా పరిషత్‌ పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకుగాను సుమారు రూ.16 లక్షలతో ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బంగారు, వెండి, రజిత పథకాలతోపాటు స్పోర్ట్‌‌స బ్యాగ్స్‌ను బహుమతులుగా అందజేస్తామన్నారు. ప్రతి జోన్‌లో క్రీడా మైదానాల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని జోన్‌లలో జడ్పీ ఆధ్వర్యంలో ఉచిత భోజనవసతి కల్పిస్తున్నామని తెలిపారు. అనాదిగా జరుగుతున్న గ్రిగ్‌ మెమోరియల్‌ పోటీలలో ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా జడ్పీ సమావేశాల్లో శాశ్వత ప్రతిపాదనను ప్రవేశపెడతామన్నారు. వివిధ జోన్‌లలో మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ప్రభుత్వాధికారులు ముఖ్య అతిధులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.వెంకటేశ్వరరావు, డిఇఒ డి.ఆంజనేయులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దగ పడుతున్న రైతన్న

తడ, మేజర్‌ న్యూస్‌ : రైతుల అవసరాలను దృష్టిల ఉంచుకొని ఎరువుల డీలర్లు నిర్ణీత ధరల కంటే అధికరలతో అమ్ముతూ రైతన్నలను పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన అధికారులు డీలర్లతో కుమ్ముకై్క చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అధిక ధరల విక్రయంపై రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం శూన్యం. దీంతో నిస్సహాయస్ధితిలో రైతులు డీలర్లు నియమించినే ధరలకే ఎరువులను కొనుగోలు చేస్తూ ఏం చేయలేక మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. ఏం మాట్లాడితే ఉన్న ఎరువులు దక్కవేమో అన్న మీమాంసలో రైతులు నిమ్మకుండిపోతున్నారు.మేజర్‌న్యూస్‌ సేకరించిన సమాచారం మేరకు రైతంటే అందరికి చులకనే. ముఖ్యంగా వ్యాపారులకైతే మరీను. అసలే సకాలంలో రావాల్సిన వానలు ఆలస్యంగా రావడంతో దిగాలు చెందిన రైతన్న చాలీచాలని దిగుబడితో వరి పంట గట్టెక్కితే చాలన్న రీతిలో ఈ ఏడాది సాగుకు సిద్దమయ్యాడు. పంటలకు కావలసిన ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం రైతుల అవసరాల మేరకు సరఫరా చేసేవిధంగా ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరడైనా పట్టుకోలేడన్న సామెతెను రుజువు చేస్తూ వ్యవసాయాధికారులు డీలర్ల ఇచ్చే సొమ్ముకు ఆశపడి రైతులను నిలువునా దోచేస్తున్నారు. బాబోయ్‌.. సూళ్ళూరుపేట డివిజన్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్‌పి ధరలకంటే అధికధరలతో అమ్ముతున్నారని రైతులు లబోదిబోమంటున్న వారి గోడును పట్టించుకొనే అధికారులే కరవైనారు.సూళ్ళూరుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో తడ, సూళ్ళూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో సుమారు 32మంది ఎరువులు, పురుగుమందుల డీలర్లు ఉన్నారు. డివిజన్‌ పరిధిలో ఉన్న కోరమాండల్‌ కంపెనీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బోర్డులను ఏర్పాటుచేసి తగిన బిల్లులతో ఎరువులను విక్రయిస్తున్నారు. కాని ప్రైవేట్‌ డీలర్ల వద్ద బోర్డులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు బిల్లులు ఉండవు, ఉన్నా అవి రైతులకు కనపడకుండా వారిని మోసంచేస్తున్నారు. పరిధిలో 15వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉండగా, సీజన్‌ పంటగా 13వేల ఎకరాలను వరి సాగు చేస్తున్నారు. ఇందులో వేరుశనగ 3వందల ఎకరాలును రైతులు పంట పండించేందుకు సిద్ధమైనారు. ఇప్పటివరకు వేసిన పంట దిగుబడులకు ఎరువుల టన్నుల రూపంలో యూరియా 5వేల అయిదు వందలు, సూపర్‌ ఫాస్పేట్‌ 11వేలు, పొటాష్‌ 11వేల 5వందల టన్నులు అవసరం ఉంది. ఇందులో 18వందల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు రైతులకు అవసరం పడుతుంది. ఇదే అదను చూసుకొన్న డీలర్లు అధికారులతో ఒప్పందం కుదుర్చొకొని రైతులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులైన 20:20 బస్తాకు 70రూ. నుండి రూ. 90, 28 : 28 బస్తాకు రూ. 60, డిఏపి బస్తాకు రూ.60 నుంచి రూ.100, సూపర్‌ ఫాస్పేట్‌ బస్తాకు రూ. 40, యూరియా బస్తాకు 20చొప్పున అధిక ధరలతో రైతులకు అంటగడుతున్నారు. ఎవరైనా రైతులు బిల్లు అడిగితే తెల్ల కాగితం మీద బస్తా ఇంతనని ఓ చిత్తు కాగితం బిల్లు ఇస్తున్నారు. ఎరువులే కాకుండా చీడ పురుగుల బాధ నుంచి విముక్తి చేసే పురుగుమందులు అమ్మే డీలర్లు సైతం ఇదే తంతు కొనసాగిస్తున్నారు. అయితే ఇదంతా పక్కా మోసం జరుగుతుందని తెలిసినా రైతులు తమ అవసరాలమేరకు చేసేదిలేక, ఎవరి చేత చెప్పుకోలేకపోతున్నారు. చెప్పినా పట్టించుకొనే అధికారులు లేకపోవడంతో డీలర్లు నోటికి ఎంత వస్తే అంత చెప్పిన ధరలకు కొనుగోలు చేసుకొని ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు.రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకుపోయినా, ఎరువుల దుకాణాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డీలర్ల వద్ద బేరసారాలు కుదుర్చుకొని ఇంకా వారి చేతులను తడుపుకుంటున్నారే తప్ప రైతుల బాధలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మాత్రం రైతులకు సబ్సిడీలు కల్పించి ఆదుకుంటాం, వ్యవసాయాధికారులు, సొసైటీల ద్వార రైతుల అవసరాల మేరకు గ్రామీణ ప్రాంతాలకే ఎరువులను అందించేందుకు శ్రీకారం చుట్టామని ప్రకటనలే తప్ప రైతులకు ఒరింగిందేమి లేదు. ప్రభుత్వ అసమర్ధతను ఆసరాగా తీసుకొన్న బడా డీలర్లు వందల సంఖ్యలో ఎరువులను తరలించి రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఉన్నత స్ధాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తేగాని, అధికారులు, డీలర్ల అసల బోగోతం బయటపడదు. దీనిపై డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు మారుతీదేవిని మేజర్‌ న్యూస్‌ వివరణ కోరగా అధిక ధరలపై ఆరోపణలు మా దృష్టికి రాలేదంటున్నారు. డీలర్లు ఎవరైన మోసాలకు పాల్పొడుతుంటే పై అధికారుల దృష్టికి తీసుకుపోయి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

తరలి వెళ్లిన విఙ్ఞాన భాండాగారం


వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్‌: విద్యార్థులకు విఙ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో విక్రమసారాభాయ్‌ కమ్యూనిటీ సైన్స్‌ కేంద్రం అద్భుత విఙ్ఞాన భాండాగారం రైలు రూపంలో విద్యార్థుల ముంగిట నెల్లూరు రైల్వేస్టేషన్‌లో మూడు రోజులపాటు అలరించింది. ఎన్నో విఙ్ఞాన విశేషాలను ఒకేచోట ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమయ్యే విఙ్ఞానాన్ని సంపూర్తిగా పెంపొందించారు. ఈ సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను జిల్లా వ్యాప్తంగా 136 పాఠశాలల నుండి 35 వేల మంది విద్యార్థులు విచ్చేసి తిలకించడం విశేషం. అయితే ఎంతో ఆసక్తితో విద్యార్థులు ఈ ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం విద్యార్థులకు విఙ్ఞానంపై ఉన్న శ్రద్ధాసక్తులను వెల్లడించింది. అదే ఉత్సాహంతో 550 మంది ఉపాధ్యాయులు, ప్రజలు కుటుంబ సభ్యులతో ఈ ప్రదర్శనను తిలకించడం విశేషం. ఏడాదికి ఒక సారైనా విఙ్ఞానాన్ని పెంచే ఇటువంటి కళాఖండాలు ప్రజల ముంగిటకు రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.విద్యార్థులను ముఖ్యంగా విశ్వము, పాలపుంత, గ్రహాల ఆవిర్భావం, మానవ శరీరానికి సంబంధించిన అంగాంగ అంతర్భాగ వర్ణన ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. ఎంతో ఆసిక్తితో ప్రదర్శనకు వచ్చి భారీ రద్దీవలన తిలకించలేకపోయిన ఎంతో మంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగిపోవడం చాలా బాధాకరం. అయితే నిరాశకు గురైన విద్యార్థులు, విద్యాసంస్థలు ఇంకా రెండు రోజులపాటు ఈ రైలును ప్రదర్శన నిమిత్తం ఉంచి వుంటే బాగుండేదని, తాము కూడా ఈ కళాఖండాన్ని తిలకించేవారమని వాపోయారు. గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చినా, విద్యార్థులు ఎంతో ఓర్పుతో హుషారుగా తాము విఙ్ఞాన ప్రపంచంలోకి అడుగు పెట్టపోతున్నామనే సంతోషంతో కనిపించారు.
ప్రదర్శన విద్యార్థులను అబ్బుర పరచింది : డిఇఒ ఆంజనేయులు విక్రమసారాభాయ్‌ కమ్యూనిటీ సైన్స్‌ కేంద్రం సౌజన్యంతో విద్యార్థులకు అవగాహన నిమిత్తం దేశమంతా పర్యటిస్తున్న సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరులో గత మూడు రోజులపాటు విద్యార్థులను అబ్బురపరచిందని జిల్లా విద్యాశాఖాధికారి డిఇఒ ఆంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మేజర్‌న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ ఇలాంటి విఙ్ఞాన కార్యక్రమాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో మేధస్సు కలుగుతుందని, అలాగే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు విఙ్ఞానాన్ని అందించేందుకు దోహదపడుతుందన్నారు. సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయన్నారు. సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరు వాసులకు ఎంతో ఆనందాన్ని, నూతన అనుభూతిని కలిగించిందన్నారు.

సరిహద్దు పెట్రోల్‌ బంక్‌లో దారుణ హత్య

తడ, మేజర్‌ న్యూస్‌ : తమిళనాడు, ఆంధ్ర రాష్ర్త సరిహద్దులో జాతీయ రహదారి పక్కనే ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పెట్రోల్‌ బంక్‌లోకి చొరబడి మారణాయుధాలతో దాడిచేసి ఒకరిని చంపి, మరొకరిని తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వ్యక్తి రక్తస్రావం ఎక్కువ కావడంతో 108 వాహనంలో వెంటనే చెనై్న జిహెచ్‌కు తరలించారు. తడ మండలం సరిహద్దు గ్రామమైన పెరియవట్టు సమీపంలో ఎస్‌కెఎల్‌ఎస్‌కు చెందిన భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో డ్యూటీ పూర్తి చేసుకొని ఆఫీసు రూంలో నిద్రిస్తున్న పంపుమెన్‌ మునిశేఖర్‌ (31)ను కిరాతకంగా మెడపై నరికి చంపారు. పక్కనే ఉన్న క్యాషియర్‌ జె. ఆరోగ్య రాజును చంపేందుకు దుండగులు ప్రయత్నించి అతని కుడిచేతిపై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఆర్తనాధాలతో మేనేజర్‌ రూంలో నిద్రిస్తున్న మరో ఇద్దరు సిబ్బంది అలికిడితో దుండగులు పరారైనారు. సేకరించిన సమాచార ంమేరకు దొరవారిస్రతం బేరిజంగాల పల్లి గ్రామానికి చెందిన ఇరకం మునిశేఖర్‌కు చిట్టమూరు మండలం కుమ్మరపాళెంకు చెందిన భారతితో వ7సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలుకూడా ఉన్నారు. పిల్లల చదువు నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం సూళ్ళూరుపేట సాయినగర్‌లో మృతుడు నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకొనేందుకు వికలాంగుడైన మునిశేఖర్‌కు వీలుకాకపోవడంతో తనకున్న భూమిని కౌలుకు ఇచ్చి పెరియవట్ట పెట్రోల్‌ బంక్‌లో ఏడాదిగా పంప్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీలో మృతుడితోపాటు మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు.తెల్లవారుజామున బంక్‌లోకి ఎవ్వరూ రాకపోవడంతో ఇద్దరు బయట నిద్రపోతుండగా నగదు ఉన్న ఆఫీసురూంలో మరో ఇద్దరు నిద్రలో జోగుతున్నారు. యథావిధిగా బంక్‌లో రాత్రి వేళలందు పార్క్‌చేనే వాహనాలు, బస్సులు వెళ్లిన తర్వాత ఈ పరిమాణం చోటుచేసుకోవడంతో అసలు ఏం జరిగిందో ఎవ్వరికి అర్ధంకాలేదు. పనిచేస్తున్న సిబ్బంది పేరయ్య కథనం మేరకు 5గంటల ప్రాంతంలో బాధితుల కేకలతో నిద్రలేచినట్లు పేర్కొన్నారు. మా అలికిడిని గుర్తించిన దుండగులు బంక్‌ వెలుపలకి పరుగులు తీసినట్లు తెలిపారు. కాని అప్పటికే వికలాంగుడైన మునిశేఖర్‌ దారుణంగా మృతిచెందడం, మరో వ్యక్తి రక్తపుమడుగులో పడివుండటం షాక్‌కు గురైనట్లు పేరయ్య తెలిపారు. అదే సమయంలో విధి నిర్వహణలో చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ హరికృష్ణ హుటాహుటిన సిబ్బందితో బంక్‌ వద్దకు చేరుకొని క్షతగాత్రుడిని 108సహాయంతో చెనై్నకు త రలించారు.
సంఘటనపై ఎన్నో అనుమానాలుజిల్లాలో పెట్రోల్‌ బంక్‌లపై దాడులుచేసి నగదు కోసం సిబ్బందిని అతి దారుణంగా చంపడం, గాయాలకు గురిచేయడం నానాటికి ఎక్కువవుతున్నాయి. భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో కూడా పాత పద్ధతిలోనే దుండగులు బీభత్సం సృష్టించడంతో ప్రజలు భయాందోళనలకు గురవునారు. జరిగిన ఘటనపై పోలీసులు జిల్లా క్లూస్‌టీం సహాయంతో వేలిముద్రలను సేకరించి, విజయవాడ నుండి పోలీసు జాగిలాన్ని రప్పించారు. రెండు సంవత్సరాల క్రితం తడ నుంచి సూళ్ళూరుపేట వైపుకు మోటారుబైకుపై వెళ్లుతున్న ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి నగదును అపహరించి ఉండ డంతో, జరిగిన సంఘటన గుర్తుతెలియని తమిళ వ్యక్తుల దుశ్చర్యగా భావించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూళ్ళూరుపేట సిఐ వంగా సుబ్బారెడ్డి సంఘటనా స్ధలానికి చేరుకొని అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. బంధువుల సమాచారంతో మృతుడుపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు, కక్షలు ఏమి లేనన్నట్లుగా తేలడంతో నగదు కోసమే దుండగులు ఇంత దారుణానికి పాల్పొడినట్లు పేర్కొన్నారు. వ్యవహారంపై ప్రత్యేక ఐడి పార్టీ ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు.

Wednesday, January 20, 2010

కాసుల గలగల - వాహనాల సరసరా


తడ, మేజర్‌ న్యూస్‌ : రాష్ర్త సరిహద్దు తడ మండలం భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌లో వాహనాలకు తనిఖీలు కరువవుడంతో అక్రమార్కుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రభుత్వానికి చెందాల్సిన కోట్లాది రూపాయల పన్నులు అధికారుల జోబుల్లోకి జారుకుంటున్నాయి. దీంతో చెక్‌పోస్టులో పన్నులు రాబడి పూర్తిగా పడిపోయింది. నెల్లూరు జిల్లా అంటేనే అందరికి గుర్తొచ్చేది ధాన్యం. ఇక్కడ ప్రాంతవాసులు పండించే వరికి పొరుగురాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ప్రభుత్వం ధాన్యాన్ని తరలించకూడదని ఎన్ని ఆంక్షలు జారి చేసినా అధికారుల చేతివాటంతో ధాన్యం స్మగ్లర్లు ప్రతినిత్యం వందల సంఖ్యలో ధాన్యం, బియ్యం లారీలను సరిహద్దు ఎల్లలు దాటిస్తున్నారు.అదేవిధంగా పొరుగు రాష్టమైన తమిళనాడు నుంచి ఎలక్ట్రికల్‌, వంటనూనెలు, స్థానికంగా తయారుచేసే సబ్బులు మన రాష్టానికి భారీ సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అంతేగాకుండా మన జిల్లాకు ఆనుకొని ఉన్న ప్రకాశం, ఒంగోలు నుంచి గ్రానైటు రాళ్లుకూడా ఈ చెక్‌పోస్ట్‌ మీదుగా తమిళనాడుకు తరలుతుంటాయి. ఇందులో బిల్లులుతో వచ్చేవి పదుల సంఖ్యలో ఉంటే చాటుమాటున వచ్చే వాహనాలు వందల సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా ఇక్కడి చెక్‌పోస్ట్‌లో ఏడు ప్రభుత్వ శాఖాధికారులు తమ సిబ్బందితో 24గంటలు విధిగా వాహనాలు పరిశీలిస్తుంటారు. ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన శాఖలైన వాణిజ్యంతో పాటు రవాణా శాఖ అధికారులకు మామూళ్లు రోజుకు లక్షల్లోనే ముట్టుతాయనేందుకు గతంలో ఏసిబి అధికారులు చేసిన దాడులే ఇందుకు నిదర్శనం. అక్రమార్కులు గుట్టును రట్టుచేసే విజిలెన్స్‌, అవినీతి లంచగొండులను అరికట్టే ఏసిబి శాఖల దృష్టి చెక్‌పోస్ట్‌పై నిరంతరం ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు తమ ఉనికిని కాపాడుకొనేందుకు స్థానికంగా ఉన్న కొంతమంది వ్యాపారులను ఏజెంట్లుగా నియమించుకొన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల ద్వార బిల్లులు లేకుండా వెళ్లే వాహనాల యజమానుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని ఆ వాహనాలకు తనిఖీలు లేకుండా అటు తమిళనాడుకు, ఇటు మన రాష్టానికి పచ్చజండా ఊపుతున్నారు. అవినితిని అరికట్టేందుకు ప్రభుత్వం 8సంవత్సరాల ్ర తం అధునాతన పరిజ్ఞానంతో 40లక్షల నిధులను వెచ్చించి నిఘా కెమెరాలు ఏర్పాటుచేసింది.కొన్ని రోజులుగా సజావుగా సాగి, అవినీతి తగ్గిపోవడంతో ఆ కెమెరాలను కాస్తా ఎందుకు పనిరాకుండా చేయడంతో అధికారులు విజయం సాధించారనే చెప్పాలి. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై దృష్టిసారించి గతంలో సూళ్లూరుపేట డిసిటివోగా పనిచేసిన కిరణ్‌ చౌదరి చెక్‌పోస్ట్‌ నుంచి తరలుతున్న అక్రమ వాహనాలపై దాడులుచేసి పన్నులను వసూలూ చేయడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని చెక్‌పోస్ట్‌లకంటే భీవి పాళెం చెక్‌పోస్ట్‌ను ఆదాయంలో ప్రధమ స్ధానంలో నిలిపిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడి చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు 16సార్లుకు పైగా దాడులుచేసి అవినీతి అధికారుల బండారం బయటపెట్టింది. అంతేగాకుండా మూడు సంవత్సరాల క్రితం జిల్లా విజిలెన్స్‌ అధికారులు చెక్‌పోస్ట్‌పై ప్రతేక్య నిఘా పెట్టి 24 గంటలపాటు అక్కడే ఉండి వాహనాలు తనిఖీలు చేపట్టి రెండు లక్షలకుపైగా పన్నుల రూపంలో వసూలు చేసి ఇక్కడి అవినీతిని వే లెత్తిచూపారు. చెక్‌పోస్ట్‌కు దగ్గరలో ఉన్న సూళ్ళూరుపేట టోల్‌ప్లాజా నుంచి వెయ్యిలారీలకు పైగా వాహనాలు వెళ్లుతుంటే ఇక్కడి అధికారుల లెక్కలుమ్రాతం కేవలం నాలుగువందల వాహనాలు మాత్రమే వెళ్లుతున్నాయని రికార్డులు చూపుతున్నారు. విజిలెన్స్‌ చెకింగ్‌ చేసిన తీరు ప్రకారం ఇక్కడ ఆదాయం నెలకు రూ. 60 నుంచి రూ. 80 లక్షలకు పైగా పన్నులు రూపంలో రావలసివుంది. అయితే చెక్‌పోస్ట్‌ అధికారుల లెక్కల ప్రకారం రూ. 25 లక్షలకు మించడంలేదు. మిగిలిన పన్నులు రాబడి ఎవరి జోబుల్లోకి పోతుందో అంతుబట్టడం లేదు. వ్యవహారంపై చెక్‌పోస్ట్‌ అండ్‌ మిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ చింతయ్యను మేజర్‌ న్యూస్‌ వివరణకోరగా కొత్తగా వచ్చిన తనకు ఇక్కడి వ్యవహారాలు పూర్తిగా తెలియవన్నారు. సమైక్యా్రంధా ఉద్యమం, పండుగ వాతావరణం వల్ల వాహనాల రాకపోకలు బాగా తగ్గాయని పేర్కొన్నారు. కాని ఆంధ్రులకు ముఖ్యమైన పండుగగా ఉన్న సంక్రాంతికి వాహనాలు తగ్గాయని స్వయానా అధికారే పేర్కొనండం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవినీతిపై ఉన్నత స్ధాయి అధికారులు దృష్టిపెడితే ప్రభుత్వ రాబడి భారీ స్ధాయిలో పెరిగి, అవినీతి అధికారుల బాగోతం బయటపడనుంది.

మార్చి నాటికి కు.ని. లక్ష్యాలను సాధించాలి


భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఈ ఏడాది మార్చినాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నూటికి నూరు శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ అనిల్‌ పునీట అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు విషయాలను చర్చించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ ద్వారా విడుదలయ్యే నిధులను ఖర్చు చేసి గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటరమణారెడ్డి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

నెల్లూరొచ్చిన వైఙ్ఞానిక రైలు


వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:విద్యార్థుల్లో సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు భారత శాస్త్ర సాంకేతిక శాఖ మార్క్‌‌స ప్లాంట్‌ సొసైటీ (జర్మనీ) వారు ప్రారంభించిన వైఙ్ఞానిక రైలు (సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌) మంగళవారం నెల్లూరు రైల్వేస్టేషన్‌లో విద్యార్థులను అలరించింది. ఈ వైఙ్ఞానిక రైలును సింహపురి విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ వి.విశ్వేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మకతను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో అహ్మదాబాద్‌లోని విక్రమసారాభాయ్‌ సైన్స్‌ కేంద్రం వారు ఈ బాధ్యతను నిర్వర్తించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు రాసే దానికంటే చూసేదానివల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటారని, తెలుసుకున్న విషయాలను జీవితాంతం గుర్తించుకుంటారన్నారు. ఈ రైలులో పాలపుంత, బిగ్‌బ్యాంగ్‌ థీయరీ, మానవ శరీర నిర్మాణం, బయోటెక్నాలజీ లాంటి 300లకు పైగా సైన్స్‌ నమూనాలను పొందుపరచారని, వీటిని చూసి విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుని ఆకళింపు చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ రైలులో విద్యార్థులకు నమూనాలను గురించి క్షుణ్ణంగా వివరించేందుకు జిల్లా విద్యాశాఖ తరపున 30 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన రైలు జిల్లాకు రావడం వల్ల విద్యార్థులకు విఙ్ఞాన పరంగా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ రైలులో 20 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి జాయ్‌ ఆఫ్‌ సైన్స్‌ హ్యాండ్స్‌ అండ్‌ ల్యాబరేటరీలో రసాయన, భౌతిక, జీవ, గణిత శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను చేసేందుకు వీలు కల్పించారన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌ నుంచి ఈ రైలు బయలుదేరి ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీ వరకు భారత దేశమంతటా ఆయా రైల్వే స్టేషన్‌లలో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఈ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయాలంటే తమ పేర్లను ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ ఆంథోనీ జయరాజ్‌ మాట్లాడుతూ వైఙ్ఞానిక రైలును సందర్శించేందుకు వస్తున్న విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో భాగంగా రైల్వే వైద్య సిబ్బందిని, రైల్వే పోలీసులను నియమించినట్లు తెలిపారు. పూర్తి జర్మన్‌ టెక్నాలజీతో తయారైన ఈ రైలును విద్యార్థులు సందర్శించి సైన్స్‌పై అవగాహన మరింత పెంచుకోవాలని కోరారు. విద్యార్థులు రైలును సందర్శించిన అనంతరం జాగ్రత్తగా తమ తమ విద్యాలయాల ఉపాధ్యాయులతో కలిసి తమ పాఠశాలలకు తిరిగి వెళ్లాలని కోరారు. స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, కనుక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నెల్లూరు స్టేషన్‌కు మొదటిసారిగా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ‘రెడ్‌ రిబ్బన్‌’, అనంతరం వైద్యాన్ని అందించే లైఫ్‌లైన్‌’ ఇప్పుడు విద్యార్థులకు విఙ్ఞానాన్ని అందించే సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే రైళ్లు రావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 21వ తేదీన ఈ రైలు నెల్లూరు నుండి కడపకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారి బంగారయ్య, సిబ్బంది రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Monday, January 18, 2010

ధరల పెరుగుదలపై దశలవారీ ఉద్యమాలు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : దేశచరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న నిత్యావసర వస్తువుల పెరుగుదలను నిరసిస్తూ దశలవారీ ఉద్యమాలను చేపట్టేందుకు భారతీయ జనతాపార్టీ నిర్ణయించిందని పార్టీ జాతీయ నాయకుడు, ఎంపి ఎం.వెంకయ్యనాయుడు తెలియజేశారు. సోమవారం నగరంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఏనాడూ ఈ విధంగా ధరలు పెరగలేదని, చివరకు చైనా యుద్ధం సమయంలో కూడా ధరలు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్పత్తి, డిమాండ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన దృష్టి సారించకపోవడం ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వెంకయ్యనాయుడు వివరించారు. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకూ ఛలో రాజ్‌భవన్‌ పిలుపు మేరకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు రాజ్‌భవన్‌కు చేరుకుని ధర్నా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అనంతరం మార్చి నెలలో ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ స్థాయిలో తమ నిరసనను తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఒకటి రెండు రోజుల్లో తాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కారీ, అధ్వానీ. సుష్మాస్వరాజ్‌లు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి ధరల పెరుగుదల అంశంపై చర్చించి, తమ పార్టీ వైఖరిని వ్యక్తం చేయనున్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి యేటా గణనీయంగా తగ్గిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేకపోతోందని వెంకయ్యనాయుడు విమర్శించారు. ఎగుమతులు, దిగుమతులు, ఇందనం వ్యయం, ఎరువులు, కొనుగోల్లు, అమ్మకాలు, పన్నులు వంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని, వీటిని సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తే ధరల పెరుగుదలను నియంత్రించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా 244 లక్షల టన్నుల నుంచి చక్కెర ఉత్పత్తి ఏకంగా 150 లక్షల టన్నులకు పడిపోయిందని, వరి ఉత్పత్తి కూడా ఇదే పరిస్థితిలో ఉందని ఆయన చెప్పారు. ఉత్పత్తులను పెంచుకోవాల్సింది పోయి నిరుపేదలకు అందించే రేషన్‌ కోటాను తగ్గించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనివల్ల సామాన్యుడి జీవన స్థితిగతులు దిగజారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
ట్రస్ట్‌ సేవలు మరింత విస్త ృతంకాగా స్వర్ణభారతి ట్రస్ట్‌ సేవలను మరింత విస్తృత పరచాలని నిర్ణయించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద ఏర్పాటుచేసిన ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతున్నామని ఆయన అన్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ నగరాల్లో కూడా ట్రస్ట్‌ను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సేవా రంగంపై ఆసక్తి, నిబద్దత ఉన్న వారిని ఎంపిక చేసి ట్రస్ట్‌ సేవలను విస్తృతపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కర్నాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

బిఎన్‌.కండ్రిగ, మేజర్‌న్యూస్‌ : చిత్తూరు జిల్లా బిఎన్‌ కండ్రిగ మండలంలో సోమవారం రాత్రి గాజులపెళ్ళూరు పంచాయతిలో పరిధిలోని ఆదిలక్ష్మీ గిరిజన కాలనీ సమీపంలో ఒక కారు ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు... నెల్లూరు జిల్లా, సుళ్ళూరుపేట పట్టణానికి చెందిన సురేష్‌ (40), బుచ్చినాయుడుకండ్రిగ మండలం, కాటూరు గ్రామానికి చెందిన మునేంద్ర (38)లు కాటూరు గ్రామం నుంచి మోటార్‌సైకిల్‌పై సుళ్ళూరుపేటకు బయలుదేరారు. సురేష్‌ కోడి గుడ్లను అమ్ముకుని జీవించేవాడు. మునేంద్ర కోళ్ళఫారంలో పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. ఇరువురూ తిరుపతి నుంచి వచ్చి మునేంద్ర స్వగ్రామం కాటూరుకి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని ఆదిలక్ష్మీగిరిజనకాలనీ మలుపు వద్ద ఎదరుగా వస్తున్న టాటా ఇండికా కారు స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్‌, మునేంద్రలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ వేణుగోపాల్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

భూపరిపాలన భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన భూపరిపాలన భవనాన్ని సోమవారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో ఉద్యోగులకు ప్రత్యేక చాంబర్‌, భూసంస్కరణ, కృష్ణపట్నం విద్యుత్‌ స్టేషన్‌ తదితర విభాగాలకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ సీతారామయ్య, డిఆర్‌ఒ జయరామయ్య, ఎఒ వేలూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రం - వ్యాధులు దూరం


బుచ్చిరెడ్డిపాళెం, (మేజర్‌ న్యూస్‌) : ‘‘వుంచుదాం పరిసరాలను పరిశుభ్రంగా, తరుముదాం వ్యాధులను దూరంగా’’ అనే నినాదంతో అంటువ్యాధుల నిర్మూళనకు శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి నిమ్మల దశరథరామయ్య పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరిసరాల పరిశుభ్రతపై సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల పరిధిలో డెంగీ, చికున్‌ గున్యా వంటి వైరల్‌ ఫీవర్లను అదుపు చేసేందుకు జడ్‌పిటిసి, ఎంపిటిసి, గ్రామసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు నాయకుల సహాయసహకారాలు కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు గాను విలేజ్‌ శానిటేషన్‌, అన్‌టైడ్‌ నిధులను వినియోగించుకునేందుకు తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మురికి కాలువలను, పేడదిబ్బలను, చెత్తాచెదారాలను శుభ్రం చేసి స్ప్రేయింగ్‌, క్లోరినేషన్‌ వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. విపరీతమైన జ్వరం, తలనొప్పి, కీళ్ళనొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందాలని ఆయన సూచించారు. మండల పరిధిలోని ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తులు వారానికి ఒక రోజు ‘‘డ్రైడే’’ ని పాటించి ఇళ్ళలో వున్న నీళ్ళ తొట్టెలు, వాటర్‌ ట్యాంక్‌లు, కూలర్లు, పూల కుండీలు లలో వున్న నీటిని తొలగించి ఆయా పాత్రలను తప్పకుండా ఎండబెట్టాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఙప్తి చేశారు. ఈ సత్కార్యానికి గ్రామాలలోని ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన మనవిచేశారు. అనంతరం మండల పరిధిలోని డెంగీ వ్యాధి లక్షణాలు, వైరల్‌ ఫీవర్లతో బాధపడుతున్న కట్టుబడిపాళెంలోని బెల్లంకొండ బాలకృష్ణ, బుచ్చి శాంతినగర్‌లోని ఎస్‌కె జిబేదా, జొన్నవాడలోని పిహెచ్‌ వెంకటప్రసాద్‌లను వారి ఇళ్ళకు వెళ్ళి పరామర్శించి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ అధికారి భక్తవత్సలం, మండల హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సిహెచ్‌ సుధాకర్‌రావు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, వైద్యసిబ్బంది, ఆశావాలెంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం


ఆత్మకూరు, (మేజర్‌న్యూస్‌): ప్రభుత్వం నిరుపేదల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన ఉపాధిహామీ పథకం నిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోల్‌మాల్‌ అయిన సంఘటన మండలంలోని బండారుపల్లి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన పేదలకు 90 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. లబ్ధిదారుల విన్నపం మేరకు భూఅభివృద్ధిపథకంలో భాగంగా నిధులు మంజూరు చేసి జంగిల్‌క్లియరెన్స్‌, మొక్కలు, మోట్లు తొలగింపు చేపట్టారు. భూమిని చదును చేశారు. అయితే ఆ భూమిలో ఏదైనా వ్యవసాయం చేయాలని ప్రభుత్వం తలంచి లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకంలో నిధులు మంజూరు చేసి జామాయిల్‌ మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఒక ఎకరానికి ప్రభుత్వం రూ.10,870లు మంజూరు చేసింది. వెయ్యి మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5000లు మంజూరు చేసింది. అయితే గ్రామానికి చెందిన లబ్ధిదారులు మొక్కల పెంపకం కోసం అధికారులను సంప్రదించి ఓ ట్రాక్టరు చేత దుక్కి చేయించారు. దీంతో గ్రామానికి చెందిన ఓ నాయకుడు స్థానికంగా ఓ ట్రాక్టరుడ్రైవర్‌ను ఎంపిక చేసి ట్రాక్టరుతో 30 ఎకరాలను దుక్కి చేయించాడు. ఒక ఎకరానికి రూ.750లు ఇస్తామని మాట్లాడుకున్నాడు. అయితే ఆ నాయకుడు అధికార పార్టీ అండదండలతో మండల అధికారులను మభ్యపెట్టి 90 ఎకరాలను దుక్కి చేసినట్లుగా బిల్లులు సృష్టించాడు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ అధికారులు తనిఖీ చేసినట్లు ఆదారాలు సృష్టించడం జరిగింది.ప్రభుత్వం ఏకంగా 90 వేల రూపాయలను మంజూరు చేసింది. ఆ నిధులు ట్రాక్టరు డ్రైవర్‌ పేరుతో ఈ నెల 13న మంజూరయ్యాయి. అయితే ఆ నిధులు డ్రా చేసిన తర్వాత తన చేతికి ఇవ్వాలని గ్రామంలోని నాయకుడు ట్రాక్టరు డ్రైవర్‌ను ఆదేశించాడు. నిధులు డ్రా చేసిన డ్రైవర్‌కు, గ్రామంలోని నాయకుడికి బ్యాంకు వద్ద వాదోపవాదన జరిగింది. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు తీసుకున్న ట్రాక్టరు డ్రైవర్‌ గ్రామంలోని నాయకుడి దౌర్జన్యంతో భయబ్రాంతులకు గురై అనంతసాగరం వైపు వాహనంపై పరుగులు తీశాడు. ఆ నాయకుడు మరో ఇద్దరి సహాయంతో వెంబడించాడు. అనంతసాగరం వరకు వెళ్లిన డ్రైవర్‌ అక్కడ ఓ చోట దాక్కున్నాడు. ఈ విషయాన్ని వాళ్ల తండ్రితో ఫోన్‌లో చెప్పాడు. ఆయన బోగసముద్రంలో ఉండగా విషయం తెలుసుకుని అనంతసాగరం వచ్చి కుమారుడ్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈ లోపు గ్రామంలో నాయకుడు ట్రాక్టరు డ్రైవర్‌ నా డబ్బుతో పరారయ్యాడని ప్రచారం చేసి, డ్రైవర్‌ కోసం కాపు కాశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ వ్యక్తిని ట్రాక్టరు డ్రైవర్‌ ఇంటికి పంపాడు. ఆయన డ్రైవర్‌తో ప్రభుత్వ నిధుల విషయమై మాట్లాడుతుండగా ఈ లోపు గ్రామంలోని కొందరు రాళ్లతో, కర్రలతో ట్రాక్టరుడ్రైవర్‌ ఇంటిపై దాడి చేశారు. వీధిలో ఉన్న ట్రాక్టరు టైర్లను ధ్వంసం చేశారు. నెల్లూరు నుంచి అద్దెకు ట్రాక్టరు తీసుకుని వచ్చి పని చేసిన డ్రైవర్‌కు గ్రామంలో ప్రభుత్వ నిధుల విషయమై చుక్కెదురైంది. అధికార పార్టీ నాయకులు దాడి చేయడంతో గాయాలపాలైన ట్రాక్టరుడ్రైవర్‌, బంధువులు 108కి సమాచారమిచ్చి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేసిన నిధులు స్వాహా చేయాలనే గ్రామానికి చెందిన నాయకుడు ట్రాక్టరుడ్రైవర్‌ను బినామీగా ఎంపిక చేసుకుని రంగం సిద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న ట్రాక్టరుడ్రైవర్‌ ఆ నిధులు అధికారపార్టీ నాయకుడికి ఇవ్వకపోవడంతో గ్రామంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు. ఏదేమైనా 30 ఎకరాలు పని చేసి ఏకంగా 90 ఎకరాలకు నిధులను మంజూరు చేయించడం, ఆ నిధులను స్వాహా చేయాలని భావించడం గ్రామంలో సంచలనం సృష్టించింది. అధికార పార్టీ అండదండలతో ట్రాక్టరుడ్రైవర్‌కు ఎవరు దిక్కులేకపోవడంతో ఆ ఇంటిపై దాడి చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించి నిధుల గోల్‌మాల్‌పై విచారణ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విషయం తెలియదు - అయినా విచారిస్తాం: ఎపిఓబండారుపల్లి గ్రామంలో జరిగిన ప్రభుత్వ నిధుల గోల్‌మాల్‌పై మేజర్‌న్యూస్‌ ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిఓ షీలాను వివరణ కోరగా ఆ విషయం తమకు తెలియదన్నారు. అయితే ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులేనని, గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు చేపడుతామని, రూ.90,000లు నిధులు మంజూరు చేశామని వివరించారు.

చిరస్మరణీయ నేత ఎన్‌టీఆర్‌


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: తెలుగుజాతి ఉన్నంతకాలం దివంగత నేత ఎన్‌టీ రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అఖిల భారత ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి వేడుకలు సోమవారం స్థానిక నర్తకీ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సోమిరెడ్డి మాట్లాడుతూ కళారంగంలో ఎన్నో విశిష్ట పాత్రలు పోషించి, ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు ఎన్‌టీఆర్‌ అన్నారు. పౌరాణిక పాత్రల విషయంలో తానే దైవంగా ప్రజల చేత కొలవబడ్డ కళాకారుడు ఎన్‌టీఆర్‌ అని కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్‌, వర్తమానాల్లో ఎవరికి సాధ్యంకాని చరిత్రకు కారణమైనారని కీర్తించారు. ప్రజాసేవే పరమావధిగా భావించి వారి కోసమే చివరివరకూ జీవించిన వ్యక్తి ఎన్‌టీ రామారావు అన్నారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ తన దైవం ఎన్‌టీఆర్‌ ప్రజల మధ్య భౌతికంగా లేకపోయినా, తమ మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు. అనంతరం ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, కార్పొరేటర్లు ధర్మవరం సుబ్బారావు, వై.వి.సుబ్బారావు, సయ్యద్‌ మదార్‌, శింగంశెట్టి రవిచంద్ర, మురళీమోహన్‌రావు, ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sunday, January 17, 2010

సాహితీ నింగిలో ‘జాబిలి తునకలు’

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:జిల్లా సాహితీ క్షేత్రంలో రచయిత్రి తన్నీరు శశికళ తొలి ప్రయత్నం ‘జాబిలి తునకలు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఆదివారం స్థానిక టౌన్‌హాల్‌ రీడింగ్‌ రూమ్‌లో నిర్వహించారు. నెల్లూరు రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్‌ ఛైర్మన్‌ ఎన్‌.బలరామనాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అచ్చమైన తెలుగు సాహిత్యం అంతరించిపోతున్న రోజుల్లో కవయిత్రి ఒక కవితాసంకలనాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. తెలుగు భాషా ఔన్నత్యాన్ని గుర్తించి తెలుగుజాతి గౌరవాన్ని కాపాడాలని ఆయన అన్నారు. ఒంగోలు సెట్‌నెల్‌ ఆఫీసర్‌ టి. మహబూబ్‌, నెరసం ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, విశ్రాంత అధ్యాపకులు చీమకుర్తి వెంకటేశ్వరరావులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సమాజశ్రేయస్సు కోసం కవిత్వం తన కర్తవ్యాన్ని విస్మరించరాదని అభిప్రాయపడ్డారు. తొలి ప్రయత్నంలోనే మంచి సంపుటిని వెలువరించిన రచయిత్రిని వారు అభినందించారు. ప్రముఖ కవి, ఆడిటర్‌ చిన్ని నాగేశ్వరరావు సంపుటిని సమీక్షించారు. అనంతరం మాటేటి రత్నప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన కవి సమ్మేళనంలో ఏటూరి నాగేంద్ర, జి.సుభద్రాదేవి, దగ్గుపాటి రాధాకృష్ణ, దామెర్ల గీత తదితరులు తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో బివి.నరసింహం, ములుగు శ్రీలక్ష్మి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

గిరిపుత్రుల దరిచేరని ’సంక్షేమం’


ప్రభుత్వం గిరిజనులకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చేబుతోంది. కాని వెంకటగిరి పట్టణంలోని గిరిజనులు నివాసం ఉంటున్న గుడిసెలను చూస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి దరిచేరుతున్నాయోలేదో తేటతెల్లమవుతుంది. వెంకటగిరి,మేజర్‌ న్యూస్‌: స్వాతంత్య్రం వచ్చి 63ఏళ్లు జరుపుకుంటున్నా నేటికి తరాలు మారినా తలరాతలు మారని గిరిజనుల వైనం పట్టణంలోని ప్రభుత్వాధికారులు కొలువు తీరిన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉంది. కైవల్యానది పరివాహక ప్రాంతంలో 12వ వార్డులో కంపచెట్ల మధ్య దారి, డొంకలేని వసతులతో ఎన్నో ఏళ్లుగా వీరు కాలం వెల్లదీస్తున్నా వీరి వెదలు పట్టించుకునేందుకు తీరికలేని అధికార గణం ప్రతిరోజు ఇదే మార్గంలో వెలుతుంటారు. వానవస్తే పాఠశాలలు, ఎండకాస్తే ప్లాస్టిక్‌ గోతాల క్రింద వీరు కాలం వెల్ల దీస్తుంటారు. వీరికి ఒకవైపు కైవల్యానది, మరోవైపు స్మశానం, మరోవైపు కంపచెట్లు, ఇంకొకవైపు పందుల సై్వర విహారం అంతటి దుర్భర జీవనంలో ఉన్న వీరికి ఎటువంటి గృహవసతి లేకపోవడం విశేషం. ఇక ఇక్కడ ఉన్నవారంతా పగలు ప్లాస్టిక్‌ పేపర్లు, చిత్తుపేపర్లు ఎరుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. ఏదైనా పెళ్లిల్లు ఉంటే కడుపునిండా తిండి తినడం జరుగుతుంది. పట్టణం నడిబొడ్డులో ఇంతటి పరిస్ధితి ఉంటే ఇక్కడి అధికారులు పట్టించుకోకపోవడం అధికార దర్పణానికి నిదర్శనంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లు అంటూ చోటా నాయకులకు, సహాయం చేసే అధికారులకు ఈ సామాన్యులు అధికారుల కంటిలో పడకపోవడం విచిత్రమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి అందుతున్నాయోలేదో పరిశీలించి తగిన చర్యలు తీసుకొని జీవితాల్లో కాంతులు నింపాలని స్థానికులు కోరుతున్నారు.

భక్తులతో కిటకిటలాడిన పెంచలకోన..


రాపూరు,మేజర్‌ న్యూస్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కోన దేవస్ధానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం సూర్యగ్రహణం కారణంగా పెద్దగా రాని భక్తులు శనివారం ఒక్కసారిగి 2వేల మందికి పైగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పెంచలకోనలో వనమహోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.

డి ఆర్‌కు కన్నీటి వీడ్కోలు

కావలి రూరల్‌, మేజర్‌న్యూస్‌: గత 60సంవత్సరాల క్రితం ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మంది బడుగుల కుటుంబాలలో వెలుగులు నింపిన దొడ్ల రామచంద్రారెడ్డికి ప్రజలు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని మానస థియేటర్‌ వద్దనున్న ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు మాగుంట పార్వతమ్మ, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, జెబి కళాశాల పూర్వ విద్యార్థులైన ఎన్‌ఆర్‌ఐలతోపాటు పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. డిఆర్‌ నివాసం నుంచి భౌతికాయంతో ర్యాలీగా వెళ్లి హిందూ స్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యా దాత డిఆర్‌ లేని లోటు కావలిలో కనిపిస్తుందని తెలిపారు. ఆయన మరణం పలు జిల్లా వాసులకు తీరని లోటని స్పష్టం చేశారు. ఆయన నెలకొల్పిన విద్యా సంస్థల్లో ఎందరో విద్యనభ్యసించి ఉన్నత వ్యక్తులుగా ఎదిగారని పేర్కొన్నారు. విదేశాలలో కూడా జవహర్‌ భారతి విద్యా సంస్థ ప్రతిష్టను ఇనుమడింప చేసిన కీర్తి అక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులకే దక్కుతుందని చెప్పారు.విద్య పట్ల డిఆర్‌కున్న నమ్మకమే ఎందరో మహానుభావులకు వెలుగునిచ్చిందని తెలిపారు. జవహర్‌ భారతి రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలిగారని చెప్పారు. సుందర వాతావరణంలో జవహర్‌ భారతి నిర్మించారని ఆ తల్లి ఒడిలోనే తాము ఇంతటి వారమయ్యామని పలువురు ఎన్‌ఆర్‌ఐలు గుర్తు చేసుకున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తులము తాము కావడం వెనుక డిఆర్‌ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి జూపూడి ప్రభాకర్‌, నేదురుమల్లి పద్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నగళ్ల శ్రీనివాస కిరణ్‌, సిపిఐ జిల్లా నేత జక్కా వెంకయ్య, పిఆర్‌పి నేత రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, విరసం నాయకులు కళ్యాణరావు, యానాదిశెట్టి, మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

కొరతలతో పేదలకన్నీ వెతలే బతుకు భారం...భారం

పొదలకూరు,మేజర్‌న్యూస్‌: కోత, కోత, కోత ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో కోతలే. ప్రభుత్వం విధిస్తున్న కోతలు ప్రజల పాలిట‘వాత’లవుతున్నాయి. బహిరంగమార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశ్శానంటి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోత విధిస్తుండటంతో పేదవర్గాల్లో గుబులు పట్టుకోంది. సంసారాన్ని ఎలా నెట్టుకురావాలనే ఆందోళనలతో సగటుమనిషి తలపట్టుకొన్నాడు. చౌకదుకాణాల ద్వారా ఇచ్చే కిరోసిన్‌, చక్కెరలో కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో రేపు బియ్యం పంపిణీలో కూడా కోత విధిస్తారేమోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండల కేంద్రాల్లో 2 లీటర్లు వంతున. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లీటరు వంతున కిరోసిన్‌ పంపిణీలో కోతవిధించారు.అలాగే ప్రస్తుతం ఒక కిలో చక్కెర ఇస్తుండగా దాన్ని అరకిలోకు కుదించారు. ఖజానాలోటును పూడ్చేందుకు పేదల నెత్తిన భారం వేస్తూ వారి బతుకులను ఛిద్రం చేయడం కడుశోచనీయమని మేధావివర్గాలు ఆరోపిస్తున్నాయి. బోగస్‌కార్డుల ఏరివేతతో ప్రభుత్వానికి ఎంతో ధనం ఆదా అయిందని, అయినప్పటికీ ఇచ్చే సరుకుల్లో కోత విధించడం సమంజసం కాదని వారు పేర్కొంటున్నారు. వైఎస్‌ తన పాలనలో పేదలకు ఎలాంటి లోటురాకుండా చూసేవారని, పేదల పథకాల్లో కోత పెట్టేవాడు కాదని, ఇప్పటి ప్రభుత్వంలో అన్నీ బాధలే కలుగుతున్నాయని పేదతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలకు గంజినీళ్ళు దొకడం కూడా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్‌దుకాణాల్లో సరుకుల కోతలపై వినియోగదారుల అభిప్రాయాలు
ఇదేం! ప్రభుత్వంరా దేవుడా?రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వం ఉందో లేదో అర్ధం కావడం లేదు. అన్నీ ధరలు పెరిగిపోయాయి. పేదలకోసం కొత్త పథకాలు పెట్టకపోతే పోయె...ఉన్న వాటిలో కూడా కోత విధస్తే ఎట్టా...
ఇక మూడుపూటలా తిండికరవే!ప్రభుత్వ పాలకులు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే పేదోళ్ళకు మూడుపూటలా తిండిదొరకడం కష్టమేననిపిస్తుంది. కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కావడం లేదు.
చక్కెర చూసి లొట్ట వేయాల్సిందే...బజారులో చక్కెర ధర చుక్కలనంటుతోంది. చౌకదుకాణాల్లో అంతకంతకూ కోత పెట్టేస్తున్నారు. రాబోయే రోజుల్లో చెక్కర చూసి లొట్ట వేయాల్సిందే...తినే పరిస్థితి ఉండదు.
వంట ఎలా వండుకోవాలోకట్టెలు కొనలేం, వంటగ్యాస్‌కు డిమాండ్‌.. బుక్‌ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. చౌకడిపోద్వారా అందే కిరోసిన్‌తో ఎలాగోలా సర్దుకుంటూ వంటచేసుకునే వాళ్ళం. ఇప్పుడు దీంట్లోనూ కోత పెట్టారు. ఎలా వంట చేసుకోవాల్లో అర్ధం కావడం లేదు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh