Friday, January 22, 2010
నేటి నుండి 90వ గ్రిగ్ మెమోరియల్ పోటీలు
నెల్లూరు (స్పోర్ట్‌స) మేజర్‌న్యూస్: జిల్లాలో పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న గ్రిగ్ మెమోరియల్ పోటీలను గురువారం పొదలకూరు జడ్పీ హైస్కూల్‌లో ప్రారంభిస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోనల్ స్థాయి గ్రిగ్ పోటీల ప్రారంభంలో భాగంగా గురువారం రాపూరు జోన్ పోటీలను పొదలకూరు జడ్పీ హైస్కూల్‌లో, మిగిలిన జోనల్ పోటీలను శుక్రవారం నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలిసారిగా జిల్లా విద్యాశాఖ, క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా పరిషత్‌ల సమన్వయంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిధుల కొరత కారణంగా అవసాన దశకు చేరుకున్న గ్రిగ్ మెమోరియల్ క్రీడలకు జవసత్వాలను కల్పించేందుకు జిల్లా పరిషత్ పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకుగాను సుమారు రూ.16 లక్షలతో ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బంగారు, వెండి, రజిత పథకాలతోపాటు స్పోర్ట్‌స బ్యాగ్స్‌ను బహుమతులుగా అందజేస్తామన్నారు. ప్రతి జోన్‌లో క్రీడా మైదానాల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని జోన్‌లలో జడ్పీ ఆధ్వర్యంలో ఉచిత భోజనవసతి కల్పిస్తున్నామని తెలిపారు. అనాదిగా జరుగుతున్న గ్రిగ్ మెమోరియల్ పోటీలలో ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా జడ్పీ సమావేశాల్లో శాశ్వత ప్రతిపాదనను ప్రవేశపెడతామన్నారు. వివిధ జోన్‌లలో మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ప్రభుత్వాధికారులు ముఖ్య అతిధులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.వెంకటేశ్వరరావు, డిఇఒ డి.ఆంజనేయులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment