Sunday, January 17, 2010
గిరిపుత్రుల దరిచేరని ’సంక్షేమం’
ప్రభుత్వం గిరిజనులకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చేబుతోంది. కాని వెంకటగిరి పట్టణంలోని గిరిజనులు నివాసం ఉంటున్న గుడిసెలను చూస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి దరిచేరుతున్నాయోలేదో తేటతెల్లమవుతుంది. వెంకటగిరి,మేజర్ న్యూస్: స్వాతంత్య్రం వచ్చి 63ఏళ్లు జరుపుకుంటున్నా నేటికి తరాలు మారినా తలరాతలు మారని గిరిజనుల వైనం పట్టణంలోని ప్రభుత్వాధికారులు కొలువు తీరిన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉంది. కైవల్యానది పరివాహక ప్రాంతంలో 12వ వార్డులో కంపచెట్ల మధ్య దారి, డొంకలేని వసతులతో ఎన్నో ఏళ్లుగా వీరు కాలం వెల్లదీస్తున్నా వీరి వెదలు పట్టించుకునేందుకు తీరికలేని అధికార గణం ప్రతిరోజు ఇదే మార్గంలో వెలుతుంటారు. వానవస్తే పాఠశాలలు, ఎండకాస్తే ప్లాస్టిక్ గోతాల క్రింద వీరు కాలం వెల్ల దీస్తుంటారు. వీరికి ఒకవైపు కైవల్యానది, మరోవైపు స్మశానం, మరోవైపు కంపచెట్లు, ఇంకొకవైపు పందుల సై్వర విహారం అంతటి దుర్భర జీవనంలో ఉన్న వీరికి ఎటువంటి గృహవసతి లేకపోవడం విశేషం. ఇక ఇక్కడ ఉన్నవారంతా పగలు ప్లాస్టిక్ పేపర్లు, చిత్తుపేపర్లు ఎరుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. ఏదైనా పెళ్లిల్లు ఉంటే కడుపునిండా తిండి తినడం జరుగుతుంది. పట్టణం నడిబొడ్డులో ఇంతటి పరిస్ధితి ఉంటే ఇక్కడి అధికారులు పట్టించుకోకపోవడం అధికార దర్పణానికి నిదర్శనంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లు అంటూ చోటా నాయకులకు, సహాయం చేసే అధికారులకు ఈ సామాన్యులు అధికారుల కంటిలో పడకపోవడం విచిత్రమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి అందుతున్నాయోలేదో పరిశీలించి తగిన చర్యలు తీసుకొని జీవితాల్లో కాంతులు నింపాలని స్థానికులు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment