Friday, January 22, 2010
తరలి వెళ్లిన విఙ్ఞాన భాండాగారం
వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్: విద్యార్థులకు విఙ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో విక్రమసారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ కేంద్రం అద్భుత విఙ్ఞాన భాండాగారం రైలు రూపంలో విద్యార్థుల ముంగిట నెల్లూరు రైల్వేస్టేషన్‌లో మూడు రోజులపాటు అలరించింది. ఎన్నో విఙ్ఞాన విశేషాలను ఒకేచోట ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమయ్యే విఙ్ఞానాన్ని సంపూర్తిగా పెంపొందించారు. ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను జిల్లా వ్యాప్తంగా 136 పాఠశాలల నుండి 35 వేల మంది విద్యార్థులు విచ్చేసి తిలకించడం విశేషం. అయితే ఎంతో ఆసక్తితో విద్యార్థులు ఈ ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం విద్యార్థులకు విఙ్ఞానంపై ఉన్న శ్రద్ధాసక్తులను వెల్లడించింది. అదే ఉత్సాహంతో 550 మంది ఉపాధ్యాయులు, ప్రజలు కుటుంబ సభ్యులతో ఈ ప్రదర్శనను తిలకించడం విశేషం. ఏడాదికి ఒక సారైనా విఙ్ఞానాన్ని పెంచే ఇటువంటి కళాఖండాలు ప్రజల ముంగిటకు రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.విద్యార్థులను ముఖ్యంగా విశ్వము, పాలపుంత, గ్రహాల ఆవిర్భావం, మానవ శరీరానికి సంబంధించిన అంగాంగ అంతర్భాగ వర్ణన ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. ఎంతో ఆసిక్తితో ప్రదర్శనకు వచ్చి భారీ రద్దీవలన తిలకించలేకపోయిన ఎంతో మంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగిపోవడం చాలా బాధాకరం. అయితే నిరాశకు గురైన విద్యార్థులు, విద్యాసంస్థలు ఇంకా రెండు రోజులపాటు ఈ రైలును ప్రదర్శన నిమిత్తం ఉంచి వుంటే బాగుండేదని, తాము కూడా ఈ కళాఖండాన్ని తిలకించేవారమని వాపోయారు. గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చినా, విద్యార్థులు ఎంతో ఓర్పుతో హుషారుగా తాము విఙ్ఞాన ప్రపంచంలోకి అడుగు పెట్టపోతున్నామనే సంతోషంతో కనిపించారు.
ప్రదర్శన విద్యార్థులను అబ్బుర పరచింది : డిఇఒ ఆంజనేయులు విక్రమసారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ కేంద్రం సౌజన్యంతో విద్యార్థులకు అవగాహన నిమిత్తం దేశమంతా పర్యటిస్తున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ నెల్లూరులో గత మూడు రోజులపాటు విద్యార్థులను అబ్బురపరచిందని జిల్లా విద్యాశాఖాధికారి డిఇఒ ఆంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మేజర్‌న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ ఇలాంటి విఙ్ఞాన కార్యక్రమాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో మేధస్సు కలుగుతుందని, అలాగే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు విఙ్ఞానాన్ని అందించేందుకు దోహదపడుతుందన్నారు. సైన్స్ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయన్నారు. సైన్స్ ఎక్స్‌ప్రెస్ నెల్లూరు వాసులకు ఎంతో ఆనందాన్ని, నూతన అనుభూతిని కలిగించిందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment