online marketing

Sunday, November 27, 2011

స్తంభానికి కట్టేసి మహిళపై దాడి

నెల్లూరు: నగరంలోని పద్మావతి సెంటర్లో ఒక మహిళను స్తంభానికి కట్టేసి, దాడి చేసిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని నేతాజీనగర్ ఏడో వీధికి చెందిన కుమారి అదే ప్రాంతానికి చెందిన జయంతి వద్ద రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది. ఇటీవల రూ. 50 వేలు తిరిగి ఇచ్చేసింది. మిగిలిన రూ. 30 వేలు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని జయంతి మరి కొంత మందిని వెంటబెట్టుకుని వచ్చి కుమారిని ఇంట్లో నుంచి బయటకు లాగి స్తంభానికి కట్టేసి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాధితురాలు కుమారి ఫిర్యాదు మేరకు ఐదో నగర ఎస్సై శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీవీకే నివాసంలో ప్రసన్న

కొత్తూరు: : ప్రముఖ పారిశ్రామికవేత్త గునపాటి వెంకటకృష్ణారెడ్డి(జీవీకే)ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శనివారం కలిశారు. నాలుగురోజుల క్రితం జీవీకే తల్లి రుక్మిణమ్మ ఆశీర్వాదం తీసుకున్నానని, జీవీకే ఆశీస్సులు పొందేందుకు వచ్చానని ప్రసన్న తెలిపారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలను జీవీకేతో కలిసి సందర్శించారు. జీవీకే సొంత నిధులతో పాఠశాలలో నూతన భవనాల నిర్మాణం చేపట్టనున్నారని, దీనికి సంబంధించి స్థల పరిశీలనకు కలిసి వచ్చామన్నారు. డబ్బు చాలా మంది సంపాదిస్తారని, అయితే పేదల కోసం సొంత ఊరికోసం ఖర్చుచేసే మహోన్నత వ్యక్తి జీవీకే అని ప్రసన్న కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి విజయ్‌కుమార్, మావులూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, జీవీకే ఫౌండేషన్ ప్రతినిధి రామభద్రయ్య, ఖాసిం, జీవీకే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వైవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

పోటేత్తిన కైవల్యా..

నెల్లూరు :గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సైదాపురం కైవల్యానది ఉధృతరూపం దాల్చుతుంది. వరదనీరు గంటగంటకు పెరుగుతుండటంతో మండల ప్రజలు భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. ఈనది సమీపంలో ఉన్న చప్టాపై 8అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో గూడూరు- రాజంపేట రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో 45 గ్రామాలతో పాటు రాపూరు, డక్కిలి మండలాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ మార్గం గుండా వ్యాపారస్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు.

తక్కువ ఛార్జీలతో గూడూరు చేరాల్సిన వీరు ప్రత్యామ్నాయంగా రెట్టింపు ఛార్జీలతో సైదాపురం నుండి పొదలకూరు చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కైవల్యానది రెండోవ రోజుకు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ
నాగరాజు గట్టి చర్యలు తీసుకున్నారు.
చినుకుపడితేనే భయమేస్తుంది: స్థానికుడు చెంచయ్య
చిన్నపాటి వర్షానికే కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తుంది.. దీంతో గూడూరుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నాము. వర్షాకాలంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే భయాందోళనలకు గురౌతున్నారు.

ప్రతి ఏడాది తిప్పలు తప్పవు: స్థానికుడు సిద్ధయ్య
ప్రతి ఏడాది కైవల్యానది చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లడంతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

వర్షానికి రోడ్లు ధ్వంసం - ట్రాఫిక్‌కు అంతరాయం

నెల్లూరు  : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో, పట్టణాల్లోని రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బి హైవే, పంచాయతీ రాజ్‌ శాఖల తారు రోడ్లు గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లోని తారు రోడ్లు, సిమెంట్‌ రోడ్లు వర్షానికి తీవ్రంగా గుంటలు ఏర్పడి చిన్న వాహనం పోవాలన్నా కష్టతరంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాయుడుపేట పట్టణంలోని పంచాయతీ సిమెంట్‌ రోడ్లు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైనేజ్‌ సిస్టమ్‌ కూడా తీవ్రంగా దెబ్బతినింది.

వర్షం అధికంగా కురవడంతో గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండి పోవడంతో భయపడ్డ గ్రామస్తులు కలుజులు ఎత్తివేయడంతో ప్రమాదం జరగకుండా చెరువు కట్టలు భధ్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కురిసిన భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యలుగా స్థానిక రెవెన్యూ శాఖకు చెందిన తహసీల్దార్‌ విఠల్‌ తన సిబ్బందిని ఆయా గ్రామాల్లో అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంటలు దెబ్బతినకుండా కాపాడేందుకు రైతులకు ముందు జాగ్రత్త చర్యలు తెలియచేశారు. స్వర్ణముఖి నదిలో నీళ్ళు అధికంగా పారుతున్నాయి. తిమ్మాజికండ్రిగ, మేనకూరు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మేనకూరు వద్ద ఏర్పాటువుతున్న ఫ్యాక్టరీల దృష్ట్యా రోడ్డు దెబ్బతినడంతో భారీ వాహనాలు రోడ్డుపై నడపలేక లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడే నిలుపుదల చేయించారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి యుద్ధప్రాతిపధికన రోడ్లు రిపేర్లు చేయాలని ప్రయాణీకులు, ప్రజలు కోరుతున్నారు. శనివారం పట్టణంలోని తిరుపతి హైవే రోడ్డు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల చొరవతో ట్రాఫిక్‌కుఅంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh