online marketing

Saturday, February 13, 2010

మరోసారి జాతీయ యోగాలో జషిత

నెల్లూరు (స్పోర్ట్‌‌స) మేజర్‌న్యూస్‌:జిల్లా నుంచి అనేక జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రతిభను చూపుతున్న జషితారెడ్డి ఇటీవల హర్యానాలో జరిగిన పోటీల్లో 4వ స్థానం సాధించి మరోసారి జిల్లా పేరు ప్రతిష్టలను జాతీయ వ్యాప్తం చేసింది. నగరంలోని నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న వి.జషితారెడ్డి యోగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా34వ జాతీయ యోగా చాంపియన్‌షిప్‌ పోటీల్లో ‘ఆర్టిస్టిక్‌ యోగా’ విభాగంలో 4వస్థానాన్ని పొంది రాష్ట్ర యోగా సెక్రెటరీ అశోక్‌ అగర్వాల్‌ ప్రశంసలను అందుకుంది. జషిత శిక్షకులు ప్రసన్నకుమార్‌, పాఠశాల యాజమాన్యం జషితకు అభినందనలు తెలిపారు.

సమర్థతకు విలువెక్కడ?


నెల్లూరు(క్రైం), మేజర్‌న్యూస్‌: శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు పోలీసులు లాఠీలకు పనిచెబితే పోలీస్‌ల క్రౌర్యం అంటూ ఉంటాం. అదే పోలీసులు ప్రస్తుతం నేతల క్రౌర్యానికి బలైపోతున్నారు. ఈ బలయ్యే క్రమంలో కనీసం సమర్థతకు కూడా అవమానాలు ఎదురుకాక తప్పని పరిస్థితి. ఆత్మాభిమానం కలిగిన పోలీస్‌ అధికారులు చివరకు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయేందుకు కూడా వెనుకాడడం లేదు. నగరంలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నేతల విపరీత జోక్యం కారణంగా కేసులు తారుమారవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులే నిందితులుగా పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కాల్సి వస్తోంది. ముఖ్యంగా అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నగరంలోని పోలీస్‌స్టేషన్లలో కేసులు నడుస్తున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. సివిల్‌ వ్యవహారాలను సైతం అధికారపార్టీ నేతలు పోలీస్‌స్టేషన్‌ నాలుగు గోడల మధ్యన మధ్యస్తం చేయిస్తూ, అందులోనూ తమ లాభం చూసుకుంటున్నారు. ఇటీవల మినీబైపాస్‌లో ఓ స్థల వివాదమై పోలీస్‌ అధికారుల సమక్షంలో అధికారపార్టీకి చెందిన కొందరు ఛోటానేతలు స్థలాన్ని స్వాధీనపర్చుకోవడంలో తమ హవా నిరూపించుకున్నారు. దీనికితోడు నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో 24 గంటలూ సివిల్‌ వ్యవహారాల్లో తలదూరుస్తూ, పోలీసుల సైతం సివిల్‌ వ్యవహరాల్లో తలదూర్చేలా ఒత్తిడి తీసుకువస్తుండడం గమనార్హం. తమ పనులకు సహకరిస్తూ, సన్నిహితంగా ఉండే పలువురు అధికారులను నగరంలోనే కొలువుండేలా చేయడంలో అధికారపార్టీ నేతలు కృతకృత్యులవుతున్నారు.ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే నగర పరిధిలోని మరో స్టేషన్‌కే వీరు బదిలీ అవుతున్నారు తప్ప నగరం విడిచి బైటకు బదిలీ కాని పరిస్థితి. కొందరు స్టేషన్‌ అధికారులు తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ కావడమే కాకుండా తమతోటి తాము విశ్వసించే కిందిస్థాయి సిబ్బందిని కూడా తాము వెళ్తున్న చోటికే బదిలీ చేయించుకోవడం విశేషం. ఒకటవ నగర విషయంలోనూ ఇప్పటివరకూ అక్కడ పనిచేస్తున్న ఎసై్స మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లడం వెనుక అధికారపార్టీకి చెందిన కొందరు నేతలే కారణంగా తెలుస్తోంది. వారి విపరీత జోక్యానికి విసిగిపోయిన సదరు అధికారి బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా కాక మునుపే అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవడం జరిగింది. జిల్లాలో ఎన్నో ప్రధాన దోపిడీ, దొంగతనాలను చేధించిన అధికారిగా ఆయనకున్న సమర్ధత కూడా నేతల పంతం ముందు ఉన్నతాధికారుల వద్ద గెలవలేకపోయింది. రాజకీయ పార్టీ నేతలూ, అందులోనూ అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఉంటూ వారి అడుగులకు మడుగులొత్తే అధికారుల మాత్రమే నగరంలో కొలువుండే పరిస్థితి ఏర్పడిందని పలు ప్రజాసంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

బోర్డులు పీకేశారు -నిబంధనలను ఉల్లంఘించారు -రియల్టర్లా మజాకా.

బుచ్చిరెడ్డిపాళెం, (మేజర్‌ న్యూస్‌) : బుచ్చిరెడ్డిపాళెంలోని రియల్టర్ల దౌర్జన్యం పరాకాష్టకు చేరుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలను, పంచాయతీ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. బుచ్చిమండలం ఇస్కపాళెం పంచాయతీ పరిధిలో పంచాయతీ అనుమతి పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు లేఅవుట్లలో స్థానిక పంచాయతీ అధికారులు అభ్యంతరాలు తెలుపుతూ బోర్టులు నాటారు. పంచాయతీ వారి అప్రూవల్‌ పొందకుండా ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లలో ప్లాట్లుకొని ప్రజలు మోసపోవద్దని పత్రికాముఖంగా ప్రకటనలు కూడా ఇచ్చారు. కాని మందీమార్భలం వున్న రియల్టర్లు పంచాయతీవారి ఆదేశాలను బేఖాతరు చేశారు. పలు లే అవుట్లలో పంచాయితీ వారు ఏర్పాటు చేసి వున్న బోర్డులను శుక్రవారం తొలగించి పంచాయతీ వారికి రియల్టర్లు సవాలు విసిరారు. సర్పంచ్‌లైన, ఎంపిటిసిలైనా తమ లేఅవుట్లలో కాలు పెడితే ఖబడ్దార్‌ అంటూ బోర్డుల వెనుక ఎర్రతిరాతో హెచ్చరించారు. మరికొన్ని లేఅవుట్లలో బోర్డులను తగులబెట్టారు. ఓ బోర్టు వెనుక చాముండేశ్వరి కమిటి పేరుతో ఆ ప్రాంత సర్పంచ్‌, ఎంపిటిసిలను అసభ్యకరంగా భూతులు వ్రాశారు.అనంతరం ఆ లే అవుట్ల యాజమాన్యం ఫ్లెక్లీలను తొలగించే ప్రయత్నంలో ఇస్కపాళెం ఎంపిటిసి సభ్యులు ఫిరోజ్‌కు రియల్టర్ల మధ్య వాదోపవాదాలు జరిగడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం పంచాయతీ వారు నాటిన బోర్డును అందరూ చూస్తుండగా తొలగించినా అడ్డుకున్నవారు లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై స్థానిక పంచాయతీ అధికారులను వివరణ కోరగా అక్రమ లేఅవుట్లలో పంచాయతీవారు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీకృష్ణులే శెలవివ్వాలి.

తోటపల్లిగూడూరు, మేజర్‌న్యూస్‌: మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో జరిగిన జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు పలు విమర్శలకు దారి తీశాయి. తాము గెలవడం కోసం మద్యం మత్తులోవున్న యువకులు అన్యం పున్యం ఎరుగని ఎద్దుల నడ్డి విరిగేలా బాదుతుంటే చూస్తున్న కొందరి మానవతావాదుల కళ్లు చెమ్మగిల్లాయి. ఇది అనాగరిక చర్య అంటూనే బహరంగ విమర్శ చేయడానికి మాత్రం వెనుకాడారు.ఆనందించడానికి, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వేలాది పోటీలుండగా ఈ రకమైన హింసాత్మక పందాలను ఎందుకు ఎన్నుకుంటున్నారో అర్థం కావడంలేదని మరికొందరు వాపోయారు. ఓ పక్క నేతలు ప్రోత్సహిస్తుంటే, అరికట్టాల్సిన అధికారులు సోద్యం చూస్తుంటే దీనికి అంత ంలేదా అంటూ ప్రజలు తర్కించుకున్నారు. అహింసో పరమో ధర్మః అంటూ జాతిపిత బాపూజీ సత్యవాక్కును చాటిన మన భారతదేశంలో ఇలాంటి అకారణ హింసాత్మక సంఘటనలు జరుగడం దురదృష్టకరం. పోటీదారుడు నీలిగి ఎద్దువెన్ను చెదిరేలా తనచేతి జాఠీకోలాతో బాదుతుంటే అది బాధకు ఎగిరిందో, లేక ముందుకు ఉరకడానికి ఎగిరిందో తెలియదు కాని ఈలలు, చప్పట్లు కొట్టి ప్రోత్సహించే ప్రేక్షకుల్లో మాత్రం కొద్దిపాటి రాక్షసత్వం కనిపించక మానదు. ఆసక్తి లేకపోయినా, అనారోగ్యంతోవున్నా తన యజమాని గెలుపునకు సహకరించాల్సిందే. లేదా చావుదెబ్బలు తినాల్సిందే.నోటినిండా తిరంగాలు, కిళ్లీలు వేసుకుని నన్ను ఓటమిపాలు చేసావా అంటూ ఎద్దుపై ఉమ్మడాన్ని జీవరాశుల్లో కూడా దేవుణ్ణి కొలిచే మనదేశంలో ఏమంటారో ఒకసారి ఊహిస్తే తెలుస్తుంది. కాని ఆ మూగజీవాల గుండెల్లో మాత్రం తన యజమాని పట్ల, ఇలాంటి పోటీలు ప్రోత్సహించేవారిపట్ల ఎనలేని అపార్థం మూటకట్టుకట్టుకుని ఉంటుంది.స్వచ్ఛమైన కల్మశం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలను నిర్వహించడం వల్ల కక్షలు రగిలే అవకాశముంది. తద్వారా నేతల మధ్య స్పర్థలు మొదలై ప్రశాంతత దెబ్బతినే అవకాశముంది. కావున ఉన్నతాధికారులు గ్రామీణ ప్రాంతాల పెద్దలు మానవతా హృదయంతో ఆలోచించి ఇలాంటి హింసాత్మకమైన పోటీలు ఆపడం ద్వారా జీవరాశిని రక్షించడానికి నాంది పలకాల్సివుంది. లేదంటే మూగజీవాలు పూర్తిగా అంతమై మానవ మనుగడకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఎంతైనా ఉంది.

నాన్న కావాలి ఇద్దరి ఆడపిల్లల ఆవేదన

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: ప్రేమించి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తండ్రి వారిని ఆదరించక వదిలి వేయడమే కాక ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆస్తులు వారికి అప్పజెప్పడంతో గత్యంతరం లేని ఆడపిల్లలు నిరసనకు దిగారు. ఈ విషయం నాయుడుపేటలో సంచలన మైంది. బాధితుల సమాచారం మేరకు నాయుడుపేట మండలం బిరదవాడ గ్రామానికి చెందిన డాక్టర్‌ రమణయ్య నెల్లూరులో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యునిగా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన కుంబాల అరుణమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.అనంతరం ముగ్గురు పిల్లలకు తండ్రి కాగా ఉద్యోగం కూడా సంపాదించాడు. స్థానికంగా నాయుడుపేటలో ఓ క్లినిక్‌ను కూడా నడుపుతున్నాడు. క్రమేణా భార్యపిల్లలను వదిలి నాయుడుపేటలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పచుకొని జీతాలు, ఆస్తులు కూడా వారికే అందిస్తున్నారని ఆయన భార్య, కుమార్తెలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడైన రమణయ్య జీతం కూడా పిల్లలకు భార్యకు అందించకపోవడం విశేషం కాగా ఉన్న ఆస్తులను వేరే వ్యక్తులకు ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తూ గత సోమవారం రాత్రి నుంచి ఆయన నిర్మిస్తున్న ఇంటి వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌ వరకూ వెళ్లడంతో సిఐ చొరవచూపి రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం నాయుడుపేటలో సంచలనం కావడంతో వారికి మద్దతుగా ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

Wednesday, February 10, 2010

మహిళలు అభివృద్ది చెందితే సమాజాభివృద్ది

విడవలూరు, (మేజర్‌న్యూస్‌) : మహిళలు అభివృద్ధ్ది చెందితేనే సమాజాభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ఛైర్మన్‌ కె.ప్రీతమ్‌లాల్‌ చెప్పారు. విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో బుధవారం ఎపిజి బ్యాంక్‌ను నూతన భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ ఛైర్మన్‌ ప్రారంభించారు. బ్యాక్‌ అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఛైర్మన్‌ మాట్లాడుతూ మగవారికంటే మహిళలే నేడు బ్యాంక్‌కు వచ్చిరుణాలు పొందుతున్నారన్నారు. మహిళారుణాలు అనుకుంటే ఏదైనా సాధిస్తారన్నారు. యజమానిపై ఆధారపడకుండా వారే వచ్చిరుణాలు తీసుకుని, ఆర్ధికంగా ఎదుగుతున్నారన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఛైర్మన్‌ ప్రీతమ్‌లాల్‌ చెప్పారు. గతంలో మహిళలు బ్యాంక్‌కు వచ్చేందుకు భయపడేవారని, నేడు మగవారు రావడంలేదన్నారు. రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించాలని, బ్యాంకులకు వారిపై నమ్మకం వుంటుందన్నారు. వ్యవసాయ రుణాలు కూడా ఎక్కువగా ఇస్తున్నామని, రుణాలు సకాలంలో చెల్లించితే బ్యాంక్‌ పురోభివృద్ధిలో వుంటుందన్నారు.ప్రజాసేవలు అందజేయడంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ముందజలో ఉందదన్నారు. జనసాంద్రతలో మహిళలు 50శాతం మంది వున్నారు. బ్యాంక్‌ అంటే డబ్బులు తీసుకోవడం చెల్లించడంకాదని, ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్‌ చెప్పారు. ఎపిజి బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ రామారావు మాట్లాడుతూ ఎపిజికి 5 జిల్లాల్లో 66 బ్రాంచ్‌లు వున్నాయన్నారు. అన్ని బ్యాంకులు 47 శాతం రుణాలు ఇస్తే తమ బ్యాంక్‌ 53 శాతం ఇచ్చిందన్నారు. ప్రభుత్వం కూడా బెస్ట్‌ బ్యాంక్‌ అని అవార్డు ఇచ్చిందన్నారు. వావిళ్ళలో 1989 బ్యాంక్‌ను స్థాపించారని 10 కోట్ల రూపాయలు డిపాజిట్లు వున్నాయన్నారు. ఎపిజి బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్లు ఎస్‌వి రామసుబ్బారావు, హెచ్‌ఎండి బషీర్‌, విసికె ప్రసాద్‌, వావిళ్ళ బ్యాంక్‌ మేనేజర్‌ జె.మధుసూధన్‌రెడ్డి, సర్పంచ్‌ కె.సుజాత, ఎంపిటిసి పి.గోపాల్‌, ఐకెపి ఎంపిఎంలు తిమ్మన్న, గున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

కోటి రూపాయల దొంగలు అరెస్ట్‌

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది ఆనాటి సామెత. అయితే నగర పోలీసులు సోమవారం కాకర్లవారివీధిలోని ఎస్‌విఆర్‌ ట్రేడర్స్‌ షాపులో చోరీ చేసిన కోటి రూపాయల బంగారు నగదును 48 గంటల్లో రికవరీ చేశారు. నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర అతిథి గృహంలో చోరీకి పాల్పడిన దొంగలను అదుపులోకి తీసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌విఆర్‌ ట్రేడర్స్‌లోని శ్రీనివాసులుశెట్టికి చెందిన రూ.73 లక్షల నగదు, 20 బంగారు బిస్కెట్లను అదే షాపులో గుమస్తాగా పనిచేస్తున్న బచ్చల దినేష్‌కుమార్‌రెడ్డి, అతని మామ నూతక్కి రామచంద్రరావు, బావమరుదులు రవికుమార్‌, వెంకటేశ్వర్లు సహాయంతో చోరీ చేశారని తెలిపారు.వీరు గతంలో దినేష్‌రెడ్డి శ్రీనివాసులుశెట్టి వద్ద రెండేళ్లు పనిచేసి తదుపరి మానుకుని మళ్లీ మూడు నెలల క్రితం చేరాడని ఆయన తెలిపారు. అయితే ప్రతి విషయానికి యజమాని తనను విసిగిస్తున్నందుకు, కొంత మేర ఆర్థిక ఇబ్బందుల కారణం వల్ల ఈ చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. దినేష్‌రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు యజమాని వద్దే పనిచేసి తదుపరి నగరంలోని మొదటి షో సినిమాకి, రెండవ షో సినిమాకి వెళ్లాడు. అప్పటికే యజమానికి ఇతనిపై పూర్తి నమ్మకం ఏర్పడడంతో రూ. కోటి వరకు కూడా బ్యాంకులో జమచేయడం వంటి కార్యక్రమాలేకాక షాపునకు సంబంధించిన తాళాలు ఇతనికే ఇచ్చి వెళ్తుండేవాడని ఎస్‌పి తెలిపారు. ఇందులో భాగమే తాళాలు తన చేతికి అందడంతో వాటిని మైనం మీద అచ్చులు గుద్దుకుని వాటిని తమ బంధువులైన నూతక్కి రామచంద్రరావు, రవికుమార్‌, వెంకటేశ్వర్లు ద్వారా మారు తాళాలను తయారు చేయించాడు. వీటి ఆధారంగా సోమవారం రాత్రి ముందుగా బంధువులని షాపులోకి ప్రవేశింపచేసి తాళాలను తెరచి లాకర్‌లోని బంగారు, నగదును ఒక ఎర్రబ్యాగులో ఉంచుకుని బయటికొచ్చారు. అదే సమయంలో కింద మోటార్‌బైక్‌ను పెట్టుకునివున్న దినేష్‌రెడ్డితో వారి పథకాన్ని చర్చించుకున్నారు. తదుపరి దినేష్‌రెడ్డి ఇంటి సమీపంలో పొరపాటున కొంత నగదును జారవిడుచుకున్నారు. అక్కడనుంచి మద్రాసు బస్టాండు వద్దకు చేరి కాళహస్తికి పోవడానికి వాహనం కావాలని మాట్లాడి కుదరక ఆత్మకూరు బస్టాండు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా వీరికి వాహనం బాడుగకి కుదరకపోవడంతో నేరుగా ఆర్టీసి బస్టాండుకు చేరుకోవడం జరిగింది. నగదును మాత్రం బ్యాగులో ఉంచుకుని ముగ్గురు వ్యక్తులు బస్సులో కాళహస్తికి చేరుకున్నారు. బంగారు బిస్కెట్లను మోటార్‌ సైకిల్‌ పెట్రోలు ట్యాంక్‌లో జారవిడచి ఎవరికీ అనుమానం రాకుండా మూత బిగించేశారు. అయితే దినేష్‌ ఇంటి వద్ద వీరందరూ మాట్లాడుకోవడం అనుమానంగా ఉండడంతో పోలీసులు వారిని చేరేసరికి వారు అక్కడనుంచి జారుకున్నారు. వీరి చేతిలోని ఎర్రబ్యాగు ఆధారంగా ఆ నలుగురి పోలికలను కొంత మేరకు పోలీసులు గుర్తు పట్టడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు వారు చోరీ బట్టబయలైంది. పోలీసులు వెంటనే బస్టాండు అంతా విచారించగా కొందరు వ్యక్తులు బ్యాగు తగిలించుకుని బస్సులో పోవడం జరిగిందని అక్కడున్న ప్రయాణీకులు తెలపడంతో వీరి అనుమానం నిజమైంది. అప్పటికే కాళహస్తిలోని పద్మజ లాడ్జిలో దిగిన వారు బ్యాగును మాత్రం దేవస్థానం వద్ద ఉండే లాకర్లలో ఉంచి వెళ్లిపోయారు. అప్పటికి అప్రమత్తమైన అధికారులు వీరి ఆచూకి కోసం ప్రయత్నించగా వారు కాళహస్తి లాడ్జీలో ఉన్నట్లు గుర్తించి నగర డిఎస్‌పి రాధిక తన సిబ్బందితో కలసి కాళహస్తి పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దవున్న కోటి మూడు లక్షల రూపాయల సొమ్మును రికవరీ చేయడం జరిగిందని ఎస్‌పి తెలియజేశారు.ఈ చోరీని 48 గంటల్లో ఛేదించి ఊపిరి పీల్చుకున్నారు. ఈ చోరీని ఛేదించిన అధికారులకు, సిబ్బందికి ఎస్‌పి రివార్డులు ప్రకటించారు. నగర డిఎస్‌పి జిఆర్‌. రాధిక, సిసిఎస్‌ సిఐ జె.మురళీకృష్ణ, 3వ నగర క్రైం ఎస్‌ఐ టి.కృష్ణ, రేంజ్‌ ఐడి పార్టీ ఎఎస్‌ఐ ఎన్‌.సుధాకర్‌, షేక్‌ షపీ అహ్మద్‌ ఎఎస్‌ఐ, షేక్‌ షరీఫ్‌ ెహ డ్‌కానిస్టేబుల్‌, పి.వేణుగోపాల్‌రావు పిసి, ఎస్‌.కృష్ణమూర్తి, జి.రవిచంద్రకుమార్‌, జి.సుబ్బారావు, కె.గిరిధర్‌రావు, సిహెచ్‌. శివకుమార్‌, ఆర్‌.గిరిధర్‌, ఎస్‌డి.వారిస్‌అహ్మద్‌, జి.మాల్యాద్రి, ఎస్‌. సుస్రాజ్‌ అనిల్‌కుమార్‌, పి.రాజ్‌కిషోర్‌, సిహెచ్‌.వెంకటేశ్వర్లు, వి.గోవర్థన్‌, సిహెచ్‌వి.రమణయ్య, సుధాకర్‌సింగ్‌, బి.రమేష్‌, ఎల్‌.మాధవి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌సింగ్‌, పరంధామయ్య, న రసింహారావులకు రివార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్‌పి జె.కనకరావు, నగర డిఎస్‌పి రాధిక, క్రైం సిఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై వేరుశనగ లారీ బోల్తా

తడ, మేజర్‌ న్యూస్‌:ప్రమాద సమయాల్లో సాటి మనిషికి సాయం చేయాల్సింది పోయి అక్కడ దొరికిక లక్షల రూపాయలు విలువచేసే వందలాది బస్తాలను లూటీ చేసిన సంఘటన తడ మండలం కొండూరులో చోటుచేసుకుంది. సమాచారం మేరకు వరంగల్లు నుండి తమిళనాడు ఎన్నూరుకు 8లక్షల రూపాయలు విలువచేసే 340 వేరుశనగ బస్తాలతో వెళ్లుతున్న లారీ బుధవారం ఏకువజామున అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో గాయపడ్డ లారీ డ్రైవర్‌ విజయ్‌ను చికిత్స నిమిత్తం 108ద్వార సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆ సమయంలో బోల్తా పడిన లారీ వద్ద క్లీనర్‌ కార్తీక్‌ ఒక్కడే ఉండడాన్ని గమనించిన సమీప కొండూరు, సుందరపురం, అక్కంపేట గ్రామస్తు లో కొందరు లారీలోని పప్పు బస్తాలను అర్ధగంటలో లూటీ చేసి ఏమీ తెలీనట్లు ఉండిపోయారు. విషయం తెలుసుకున్న సూళ్ళూరుపేట పేట సిఐ వంగా సుబ్బారెడ్డి సర్కిల్‌ పరిధిలోని తడ, సూళ్ళూరుపేట, శ్రీహరికోట పోలీసులను అప్రమత్తం చేసారు. అప్పటికే సంఘటనా స్ధలానికి చేరుకున్న తడ ఎస్‌ఐ హరికృష్ణ లారీలోని బస్తాలు మాయమవడంపై అవాకై్కయ్యారు. వెంటనే గ్రామ సర్పంచ్‌ రవిరెడ్డిని వెంటబెట్టుకొని గ్రామాల్లోని అన్ని ఇండ్లను సోదాలు చేసి బస్తాలను బయటకు తీసుకొచ్చారు. సోదాలను గుర్తించిన గ్రామస్తులు లూటీ చేసి గృహాల్లో దాచిన బస్తాల విషయం ఏమీ తెలీనట్లుగా పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తాళాలు వేసుకొని మరీ దగ్గరుండి చోధ్యం చూసారు. అయితే పోలీసులా మజాకా అన్న తీరులో ప్రతి ఇంటిని సోదాచేసి దొంగలించిన బస్తాలను వెలికితీసారు.అంతేగాకుండా కొందరు తెలివిగా గడ్డివాముల్లో, ఇసుక గుట్టల్లో, ఇంటి పైభాగాలలో పరిసర చెట్లలో దాచిన అన్ని బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో గ్రామస్ధులతో పాటు అటు ఇటు వెళ్లుతున్న వాహనాల్లో బస్తాలను తస్కరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రమాద సమయాల్లో వాహనాలనుండి వస్తువులను దొంగలించడం పెద్ద నేరంగా పేర్కొన్నారు. వెంటనే దొంగలించిన బస్తాలను పోలీసులకు అప్పగించాలని గ్రామస్ధులను ఆదేశించారు. లూటీ చేసిన వారందరపై కఠిన కేసులు బనాయించనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో లూటీ పనులు చేస్తే గ్రామస్ధులందరిపైనా కేసులు పెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గ్రామాల్లో జరిపిన తనిఖీల్లో ఎస్‌ఐలు ఎం. శ్రీనివాసరావు, కె. శ్రీనివాసరావులతో పాటు పోలీసు సిబ్బంది, విఆర్‌వో, గ్రామ సేవకులు పాల్గొన్నారు.

Tuesday, February 9, 2010

అధికారులు

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌:నగరంలో రోజురోజుకి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న చోరీలు, ట్రాఫిక్‌ సమస్యలపై కేవలం నగరంలోని పోలీసు అధికారులు అక్కడ క్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారే తప్ప వాటి పరిష్కారానికి మార్గాలను వెతకటంలో విఫలమైనారు. అందులో భాగంగానే ఈ నెల 4వ తేది పట్టపగలే నగర నడిబొడ్డున భారీగా చోరీ జరిగింది. ఈ మధ్యకాలంలో మాగుంట లేఅవుట్‌లో రెండు మూడు అపార్ట్‌మెంట్లలో లక్షల రూపాయలలో చోరీ, వేదాయపాళెంలోని మరొక అపార్ట్‌మెంటులో చోరీ, మినీబైపాస్‌ రోడ్డులోను జరిగినప్పటికీ, వాటి రికవరీలో విషయంలో మాత్రం అటు పోలీసు అధికారులు, ఇటు క్రైం సిబ్బంది సరిగా విచారణ చేపట్టటంలేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.నగరంలో 5 క్రైం పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ వాటిలో పనిచేస్తున్న ఎస్‌.ఐ స్ధాయి అధికారి నుండి క్రింది స్ధాయి సిబ్బంది వరకు రికవరీ చేయటంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించటం లేదు. దొంగలను పట్టుకొన్న తరువాత వారితో ఏం మాట్లడకుండా నేరుగా సి.సి.యస్‌ లో అప్పగించమని ఒక అధికారి హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో నగరంలోని ఏ పోలీసు స్టేషన్‌ సిబ్బంది క్రైంపై నిఘా ఉంచడంలేదు. నామమాత్రంగా ఉద్యోగాలు చేస్తున్నారే తప్ప అంకితభావంతో పనిచేయడంలేదనే రూమర్లు వినిపిస్తున్నాయి.ఏ స్టేషన్‌ పరిధిలోనైనా చోరీ జరిగితే అక్కడ సిబ్బందినే బాధ్యులుగా చేస్తే అప్పుడే వారికి కూడా బాధ్యత అనేది ఉంటుంది. దీనిపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు దానిని పట్టించుకోకుండా కేవలం అవగాహనా సదస్సులతో సరిపెట్టుకుంటున్నారు. దీనికి తోడు కొద్దినెలల క్రితం నగరంలోని ట్రాఫిక్‌ నియంత్రించడానికి ఆటోడ్రైవర్లు, యజమానులను పిలిపించి అవగాహనా సదస్సులను పెట్టినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సదస్సు పెట్టిన తరువాత నియమనిబంధనలు తుంగలో తొక్కారు అనడానికి ఉదాహరణగా డియస్‌పి స్ధాయి అధికారి వాహనాన్ని సైతం లెక్కచేయకుండా మితిమీరిన వేగంతో ఢీ కొట్టడమే. నగరంలోని దురుసు డ్రైవింగ్‌పై చర్యలు తీసుకుంటూ, ఇకనైనా పోలీసు అధికారులు స్పందించి డిపార్ట్‌మెంటులోనే దాగిఉన్న లోపాలను సరిదిద్దుకొని చోరీ జరిగిన సొమ్ము రికవరీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అబాకస్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన

వెంకటగిరి,మేజర్‌న్యూస్‌: ఈనెల 7వ తేదిన ఐపిఎ వారు చెనై్నలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్‌, స్పీడ్‌ అర్ధమెటిక్‌ పోటీల నందు వెంకటగిరికి చెందిన శ్రీ అల్లం కృష్ణయ్య మెమోరియల్‌ స్కూల్‌ అబాకస్‌ విద్యార్ధులు పాల్గొన్నారు. వీరు తమ ప్రతిభను కనబరచి రాష్టస్థ్రాయిలో బహుమతులు సాధించి జూన్‌లో బెంగుళూరులో నిర్వహించు జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైనట్లు సంస్ధ యాజమాన్యం తెలిపారు. స్పీడ్‌అర్ధమెటిక్‌ రాష్ట్ర స్ధాయి పోటీలనందు బి1 కేటగిరిలో అల్లం సాయిరమణ, ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్‌, కె మోహన సుందరం ద్వితీయ బహుమతి, బి2 కేటగిరిలో టి కిరణ్‌కుమార్‌ ద్వితియ బహుమతి, పిఆర్‌ కార్తిక్‌ తృతీయ బహుమతి, ఎ1 కేటగిరిలో పి అరవింద్‌ గణేష్‌ ద్వితియ బహుమతి, బి వెంకటేష్‌, వై ధర్మతేజ తృతీయ బహుమతి, వై బాలాజీ కన్సలేషన్‌ సాధించారు.అదేవిధంగా అబాకస్‌ రాష్టస్ధ్రాయి పోటీల్లో జెట్‌2 కేటగిరలో కె మోహన్‌ కృష్ణ ప్రథమ బహుమతి, బి3 కేటగిరిలో కె మోహన సుందరం ద్వితీయ బహుమతి, జి2 కేటగిరలో అల్లం సాయిరమణ తృతియ బహుమతి, జి1 కేటగిరలో జి శ్వేతశ్రీ, జి3లో ఎ కృష్ణ, పిఆర్‌ కార్తిక్‌, జెట్‌2లో కె రామ్‌ ప్రీతమ్‌, పి లోహిత కన్సలేషన్‌ బహుమతులు సాధించారు. ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్‌ అవార్డును సాధించిన అల్లం సాయిరమణను, బహుమతులు సాధించిన 16మంది విద్యార్ధులను సంస్ధ యాజమాన్యం అభినందించారు.

భారీ చోరీ

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: నగరంలోని కాకర్లవారివీధిలోని ఎస్‌విఆర్‌ ఫ్యూచర్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఆఫీస్‌లో కోటి రూపాయల విలువైన బంగారు బిస్కెట్లు, నగదు ఆదివారం రాత్రి చోరీకి గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డి, అడిషినల్‌ ఎస్‌పి కనకారావు, నగర డిఎస్‌పి జిఆర్‌.రాధిక తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ చోరీపై జిల్లా ఎస్‌పి మల్లారెడ్డి మాట్లాడుతూ ఎస్‌విఆర్‌ ఫ్యూచర్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యజమాని కె. శ్రీనివాస్‌ గత రెండేళ్లుగా ఈ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఆఫీస్‌లోనే ట్రేడింగ్‌ చేస్తూ తదుపరి ఆఫీస్‌కు తాళం వేసి మిద్దెపై కాపురముంటున్న తన నివాసానికి వెళ్లాడని, ఉదయం 6 గంటల సమయంలో తన ఆఫీస్‌ తాళాలు తీసి ఉండడాన్ని గమనించి లోపలికెళ్లి చూడడంతో రూ.73 లక్షల నగదు, రెండు కిలోలు బంగారు బిస్కెట్లు చోరీకి గురయ్యాయని 3వ నగర క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఆఫీస్‌కు దగ్గరలో ఆదివారం రాత్రి బీట్‌ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ పరంధామయ్య, హోంగార్డు నరసింహరావుకు రూ.5 లక్షల నగదు దొరకగా వారు వెంటనే తమకు తెలియజేసినట్లు ఎస్‌పి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌పి తెలియజేశారు.
అనుమానాస్పదంగా చోరీమారు తాళాలతో షట్టర్‌ తాళాలు తీసి లోపలికి ప్రవేశించిన దొంగలు ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేయడమే కాక ఆఫీస్‌కు సమీపంలో రూ.5 లక్షలు పోలీసులకు దొరకడం అనుమానాస్పదంగా ఉంది. ఎస్‌విఆర్‌ కంపెనీలో చోరీకి గురైన రూ.73 లక్షల్లోని నగదులో రూ.5 లక్షల బండిల్‌ బీట్‌ కానిస్టేబుళ్లకు దొరికిందా లేక ఇది మరొకటా అన్న విషయం సంశయాత్మకంగా ఉంది. దీన్నిబట్టి ఈ చోరీ బాగా తెలిసినవారే చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. క్లూస్‌ టీం ఆ ప్రాంతానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లేకపోవడం శోచనీయం. దీనిపై అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే పూర్తి వివరాలు బయట పడగలవు.
నిజాయితీకి మారుపేరు వీరిద్దరుకుడిచేతికి దొరికిన సొమ్మును ఎడమచేతికి తెలియకుండా దాచుకోవాలనుకునే నేటి రోజుల్లో, అందులోనూ ఇందులో అందెవేసిన పోలీస్‌శాఖలో వీరిద్దరి లాంటి నీతిపరులు కూడా ఉన్నారని తెలియచెప్పిన కానిస్టేబుల్‌ పరంథామయ్య, హోంగార్డు నర్శింహరావులు ఆ శాఖలోని ఇతర సిబ్బందికి మార్గదర్శకులుగా మారారు. రూ.5 లక్షలు నగదు దొరికిన వెంటనే వారు తమ పై అధికారులకు తెలియజేసి నగదును అధికారులకు అప్పగించడం అభినందించదగ్గ విషయం. వీరి నిజాయితీని ఆ శాఖలోని పలువురు పోలీసులు కొనియాడారు. అయితే ఉన్నతాధికారులు వీరి నిజాయితీని మెచ్చి తగిన రీతిలో అభినందిస్తే మరికొందరికి వీరు దారి చూపేందుకు వీలు కల్పించినవారవుతారని పోలీస్‌ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.

అగస్త్యముని ప్రతిష్టించిన సంగమేశ్వరుడు


కోట, (మేజర్‌న్యూస్‌) : కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం అత్యంత పురాతనమైంది.ఒకప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలువబడిన ఈ గ్రామంలో సప్తమహర్షుల్లో ఒకరైన అగస్త్యమహాముని తన స్వహస్తాలతో స్వయంగా ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తిరుపతి-చంద్రగిరి కొండల మధ్య తపస్సు చేస్తూ వచ్చిన అగస్త్యుడు ఒకనాడు సముద్ర స్నానానికి వెళుతూ కూడలి వద్ద ప్రస్తుత గూడలి గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో స్నానం చేశాడని పూజ చేసుకునేందుకు అగస్త్యమహాముని శివలింగాన్ని స్థాపించాడని ప్రచారంలో ఉంది.స్వర్ణముఖి నదిలో కూడలి వద్ద రెండు నదులు కలుస్తూ కొంతదూరం తరువాత రెండుగా విడిపోవడం గమనించిన అగస్త్యుడు ఈ ప్రాంతానికి కూడలి అని నామకరణం చేశాడని ప్రచారంలో ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఒకప్పటి తొండమనాడు చక్రవర్తి ఈ ప్రదేశానికి వచ్చి సరైన నీడ లేకుండా పడిఉన్న శివలింగానికి ఆలయ ప్రకారాలు నిర్మించాడని ప్రతీతి. ఈ ఆలయం నిర్మించిన ప్రదేశం కాళాభారమ్మ, నీలి భారమ్మ అనే అక్కా చెల్లెళ్లు గ్రామ దేవతలకు చెందిందని చెబుతారు. స్వర్ణముఖి నది తీరాన ఉన్న ఈ ఆలయంలో శ్రీ సంగమేశ్వరుడు, శ్రీ కామాక్షిదేవికి వేర్వేరు గర్భగుడులు, ఆలయాలున్నాయి. ఉత్తరం గ్రామ శక్తులు కాళాభారమ్మ, నీలాభారమ్మకు ప్రత్యేక గుడి ఉంది. ఇంకా నందీశ్వరుడు వినాయకుడు, వీరభద్రస్వామి, నాగప్రతిష్ట, సుబ్రమణ్యేశ్వరస్వామి, చండీశ్వరుడు, కాళ భైరవుడు, మధ్యలో ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. అమ్మవారికి ఎదురుగా సింహం, ఈశాన్యంలో నవగ్రహ ప్రతిష్ట, స్వామివారి కళ్యాణ మండపం ఉన్నాయ. ఇక్కడి శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి వారికి శివరాత్రి కార్తిక పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజలతోపాటు ఏటా చైత్ర మాసంలో శైవ ఆగమసూత్రాల ప్రకారం 11 రోజులపాటు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. గ్రామంలోని కొండమీద వెలిసిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం కూడా పురాతనమైనది. ప్రతి శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలలో జరిగే గూడలి కొండ తిరునాళ్లకు చేరుకుంటారు. ప్రస్తుతం దాతల సహకారంతో ఆలయానికి ముందువైపు అసంపూర్తిగా ఉన్న గోపురం నిర్మాణానికి ఎంఎస్‌ రెడ్డి అనే దాత ఆర్ధిక సహాయంతో పూర్తి చేస్తున్నారు.

తల్లిదండ్రులే రోల్‌మోడల్స్‌

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:పాఠశాల స్థాయి విద్యార్థులకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్‌ అని నగర మేయర్‌ నందిమండలం భానుశ్రీ పేర్కొన్నారు. మారుతున్న కాలంలో వింత పోకడలు పోతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు నైతిక విలువలను నేర్పి ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఆదివారం స్థానిక విఆర్‌సి మైదానంలో నిర్వహించిన విబిఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ పదవ వార్షికోత్సవంలో ఆమె మాట్లాడుతూ చదువులతోపాటు సంస్కారం అవసరమన్నారు. నేటి తరానికి పుస్తకపఠన ఆవశ్యకతను తెలియజేసి రేపటి తరం మంచి పౌరులుగా వారిని తీర్చి దిద్దాలన్నారు. పాఠశాలలోని చదువులతోపాటు విద్యార్థి దశలో తల్లిదండ్రుల పరిరక్షణ అవసరమన్నారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవితంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించాలన్నారు. చదువులేకాక ఏకాగ్రతను పెంచే వివిధ అంశాలలో పిల్లలకు ప్రవేశం కల్పించి మానసిక వత్తిడిని తగ్గించాలన్నారు. జిల్లా ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చాట్ల నరసింహరావు మాట్లాడుతూ విద్యావంతులు ప్రపంచంలో ఎక్కడైనా గౌరవించబడతారని విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారణం నైతిక విలువలతో కూడిన విద్యేనని అభిప్రాయపడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌ టిఎస్‌ఆర్‌ .ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి దేశంలో భారతీయ విద్యార్థులు తమ సత్తాను చాటుతున్నారని అన్నారు. సాంప్రదాయ విద్యతోపాటు సాంకేతికంగా అభివృద్ధి చెంది విద్యార్థులు అన్ని రంగాలలో అగ్రగాములుగా నిలవాలన్నారు. విబిఆర్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ వేగూరు శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విబిఆర్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఊటుకూరు బ్రహ్మంరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ఊటుకూరు శ్రీనివాసులురెడ్డిలు మాట్లాడుతూ నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి తమ సంస్థలు కృషి చేస్తాయని అన్నారు. పదేళ్లుగా తమ విద్యాసంస్థలు గొప్ప సంకల్పంతో విద్యార్థులోని శక్తి సామర్ధ్యాలను వెలికి తీస్తున్నామన్నారు. వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారీ సెట్టింగులతో, అత్యాధునిక విద్యుత్‌ సాంకేతిక పరిఙ్ఞానంతో ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారుల నృత్య ప్రదర్శనలు పలువురిని అలరించాయి. చిన్నారుల చిట్టిపొట్టి మాటల రైమ్స్‌, నృత్యాలు, కరాటే విన్యాసాలలతోపాటు సాంప్రదాయ, ఆధునిక సాంస్కృతిక ప్రదర్శనలు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధులు మెమొంటోలను, షీల్డ్‌లను అందజేశారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకలో పిల్లలతోపాటు తల్లిదండ్రులు, నగరంలోని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh