online marketing

Saturday, August 27, 2011

ఇక బహిరంగ సభలతో చిరంజీవి తడాఖా, తొలుత విశాఖ

నెల్లూరు: విశాఖపట్నంలో వచ్చే నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీన్ని భారీగా నిర్వహించాలని తలపెట్టారు. కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం నాయకులే ఈ బాధ్యతను తీసుకున్నారు. ప్రజారాజ్యం శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా చూసేందుకు దీనిని తలపెట్టారు. విశాఖపట్నం సమీప నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభకు చిరంజీవితోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని చెబుతున్నారు. ఆ తర్వాత మరో రెండు ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత రెండు వారాలకు గుంటూరులో అదే స్థాయిలో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం దీనిని ఉద్దేశిస్తున్నారు. ఆపై రాయలసీమ జిల్లాల కోసం అనంతపురం లేదా కర్నూలుల్లో మరో సభ జరుపుతారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసంలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సీనియర్‌ నేతలు గంటా శ్రీనివాసరావు, కోటగిరి విద్యాధరరావు, వేదవ్యాస్‌, సుబ్బరాయుడు, కామినేని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పార్టీ పదవుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో నియమించాల్సిన నాయకులు, సీనియర్‌ కార్యకర్తల జాబితాను ఇవ్వాలని బొత్స వీరిని కోరారు. వారంరోజుల్లో పీసీసీ, డీసీసీల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నానని వాటిలో ప్రరాపాలో పనిచేసిన వారిని వారి స్థాయినిబట్టి సర్దుబాటు చేస్తానని బొత్స వారికి వివరించారు. నామినేటెడ్‌ పదవులు ఇవ్వాల్సిన వారి జాబితాను ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించారు.
 

Friday, August 26, 2011

ఒంటరిగా ఉన్న మహిళా న్యాయవాదిపై కత్తితో దాడి

నెల్లూరు: ఓ మహిళా న్యాయవాదిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో గురువారం చోటు చేసుకుంది. కావలిలోని వెంగళరావు నగర్‌లో ఉంటున్న రాధమ్మ అనే మహిళా న్యాయవాదిపై గురువారం ఉదయం కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. కత్తితో తీవ్రంగా గాయపర్చారు. ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం, నగదు ఎత్తుకు పోయారు. ఇంట్లో ఇంకా ఏమైనా విలువైనవి ఉన్నావో చూసేందుకు ఇళ్లంతా చెల్లాచెదురు చేసి వెళ్లిపోయారు.


ఉదయం రాధమ్మ రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. రాధమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. భర్త లేడు. దీంతో వచ్చిన వారు కేవలం దొంగతనానికే వచ్చారా? లేక మరో కారణం ఏమైనా ఉందా? న్యాయవాది కావడంతో కేసుల విషయంలో ఘర్షణ కారణంగా హత్యా ప్రయత్నం చేశారా? అనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. రాధమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

రాజీనామాలపై తగ్గేది లేదు: జగన్ ఎమ్మెల్యే మేకపాటి

నెల్లూరు : వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజీనామాలకు కట్టుబడి ఉన్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురువారం అన్నారు. రాజీనామాలపై ఎవరూ వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజీనామాలు చేసిన వాళ్లమంతా నూటికి నూరునూరు శాతం కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ రాజీనామాలు ఖచ్చితంగా ఆమోదించుకుంటామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాధరణ తట్టుకోలేకే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు.


ఆయన శక్తిని ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెసు, టిడిపిలు రాష్ట్రంలో తుడిచి పెట్టుకు పోవడం ఖాయమన్నరు. వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారి కుట్రలను ప్రజలకు తెలియజేయడానికి త్వరలో బస్సుయాత్ర చేపడతామని చెప్పారు. కాంగ్రెసు బాబు ఉచ్చులో పడిపోయిందన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు ఎవరూ స్పందించడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రభుత్వం అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

బొత్స సత్యనారాయణపై వైయస్ జగన్ వర్గం ఎదురుదాడి

నెల్లూరు : ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేస్తే ఎవరు అవినీతిపరులో తెలుస్తుందని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారన్న బొత్స వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఎవరు నిజాయితీపరులో తెలియాలంటే బొత్స రాజీనామా చేసి ప్రజాకోర్టుకు రావాలన్నారు. రాజీనామాలు చేసిన వారు ఎవరూ వెనక్కి వెళ్లరన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే ముందు రాజీనామాలు ఆమోదించాలని సవాల్ విసిరారు.


దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ మీద గెలిచిన మంత్రులు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తుంది బొత్సనే అన్నారు. తాము ఎవరి ప్రలోభాలకు లొంగేది లేదన్నారు. అవినీతిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోరాటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తమకు పదవి ముఖ్యం కాదని వైయస్సార్, జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమమన్నారు. కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళీ వ్యాఖ్యలపై జగన్ వర్గం నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళీ త్వరలో తమ పార్టీలోకి వస్తారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి సైతం కొండ్రు వ్యాఖ్యలను ఖండించారు. జగన్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు కట్టుబడి ఉన్నారన్నారు. రాజీనామాల కోసం ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. అందరూ సొంతగానే రాజీనామాలు చేశారన్నారు. ఎమ్మెల్యేల రాజీనామా విషయం జగన్‌కు సైతం తెలియదన్నారు. ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించడానికే కొండ్రు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు

జగన్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫోన్ చేస్తున్నారు: ఆనం

నెల్లూరు : దివంగత వైయస్ పేరు ఎఫ్ఐఆర్‌లో ఉన్నందున రాజీనామా చేశామని చెబుతున్న వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫోన్ చేసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్ జగన్, ఆయన వర్గం నేతలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను రోడ్డు పైకి ఈడుస్తున్నారని విమర్శించారు.


జగన్ ఆస్తుల పైన జరుగుతున్న సిబిఐ దాడుల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వారు తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. సిబిఐ దర్యాఫ్తును ఆపేందుకు రాజీనామాల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులపై విచారణ జరిగి నిజాలు తెలియాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజీనామాలు చేసిన కొందరు ఎమ్మెల్యేలకు జగన్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని విమర్శించారు. జగన్ పక్కనే ఆయన అనుకూల శతృవులు ఉన్నారన్నారు.

ఎంపీ పదవికి మేకపాటి రాజీనామా

నెల్లూరు: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఏక వాక్యంతో ఆయన తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు సమర్పించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చటం వల్లే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఈ విషయంలో తానే కాదని, రాష్ట్ర ప్రజలు కూడా మనస్తాపం చెందారన్నారు. రాజీనామాల ద్వారా తమ నిరసనలు తెలిపామని మేకపాటి అన్నారు. నిస్సహాయంగా ఉన్నారని భావించే ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కావాలని సంతకాలు చేసినవారే తర్వాత దూరం అయ్యారని ఆయన గుర్తు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన జనం మాత్రం జగన్ వెంటే ఉంటారన్నారు. ధర్మం ఉంది కాబట్టే జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలికానని మేకపాటి అన్నారు. తన రాజకీయ జీవితమంతా రహదారేనని, ఎత్తులు, జిత్తులు లేవని ఆయన తెలిపారు

రాజకీయ, సమాజిక మార్పుకు యువత కృషి చేయాలి

నెల్లూరు  : యువతకు దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలపై అవగాహన ఉండాలని, ఈ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో యువకులు ప్రధాన పాత్ర పోషించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో స్థానిక రామకోటయ్య భవన్‌లో ఆదివారం కోస్తాంధ్ర యువజన సమాఖ్య కార్యకర్తల విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను నారాయణ ప్రారంభించారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఈ అవినీతి కుళ్ళి కంపుకొడుతున్న దశలో 75 సంవత్సరాల అన్నాహజారే దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నారాయణ అన్నారు. దేశ భద్రత విషయంలో వీర జవానులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో కూడా పాలకులు అవినీతికి పాల్పడ్డారని, ప్రతిదీ అవినీతిమయమైన ప్రస్తుత తరుణంలో యువకులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు, ప్రకృతి సంపద మన దేశంలో ఉన్నాయని, సారవంతమైన పొలాలు, నిష్ణాతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్‌లు, మేధావులు ఉన్నప్పటికీ దేశం అవినీతితో అనుకున్న ప్రగతి సాధించలేకపోతున్నదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్‌బ్యాంకులో మన దేశ సంపద అంతా దాచివుందని, ఈ డబ్బును బయటకు తీస్తే దేశంలో ప్రతి గ్రామాభివృద్ధికి రూ. 600 కోట్లు నిధులు కేటాయించవచ్చునని అన్నారు. అన్నాహజారేకి ముందే అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు దేశంలోనూ, పార్లమెంటులోనూ పోరాటం చేశాయని, అనేక అక్రమాలు బయటపెట్టాయని, అయితే ప్రచార సాధనాలు వాటికంత ప్రాధాన్యత ఇవ్వనందున అవి ప్రజలలోకి వెళ్ళలేదని నారాయణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ దివాళాకోరుతనం వల్లనే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయని, కాంగ్రెస్‌పార్టీ నేతలు తెలంగాణాలో ఒక మాట, కోస్తాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నా, పార్టీ హై కమాండ్‌ ఈ నేతల మాటలను సమర్ధిస్తున్నదని ఇందువల్లే తెలంగాణా సమస్యగా మారిందన్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ఇందుకు వ్యతిరేకంగా యువకులు పోరాటం సాగించాలని నారాయణ పిలుపునిచ్చారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh