online marketing

Friday, January 15, 2010

సందడి సందడిగా సంక్రాంతి సంబరాలు


నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌: పుష్యం మాసం హేమంత రుతువులో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతిని ప్రజలు గురువారం సందడి సందడిగా జరుపుకున్నారు. భోగిపండుగతో ప్రారంభమైన ఈ సంబరాలను సంక్రాంతినాడు పెద్దలను స్మరిస్తూ పెద్దల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ ధనుర్మాసంలో తెల్లవారుజామున ఆహ్లాదకర వాతావరణంలో తెలుగు లోగిళ్లు రంగవల్లులతో కళాకాంతులను వెదజల్లాయి. కాంక్రీట్‌ అరణ్యమైన నగరంలో ఒక్కో అపార్ట్‌మెంట్‌ ఓ కుగ్రామంగా మారి సభ్యులందరూ ఉదయాన్నే అపార్ట్‌మెంట్‌ ముంగిట ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను పెట్టి సాంప్రదాయ సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. పిండి వంటలను, చుట్టుపక్కల వారికి అందజేశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధరలు మండిపోతున్న రోజుల్లో కూడా అరిసెలు, బొబ్బట్లు తదితర సాంప్రదాయ పిండివంటలను చేసి పండుగకు తీపిదనాన్ని అద్దారు. అక్కడక్కడా గంగిరెద్దులను ఆడిస్తూ డోలు, సన్నాయి, వాయిద్యాల ధ్వనులతో హరిదాసులు ఇల్లిల్లూ తిరిగారు. సంక్రాంతి సంబరాలు పూర్తికాకముందే సూర్యగ్రహణం ప్రారంభమవడంతో దేవాలయాలు మూసివేయడం భక్తులకు అత్యంత నిరాశ మిగిలింది. పండుగ సంబరాల్లో మూడవ రోజైన కనుమ పండుగ సంబరాలు కనపడకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కారణం నగరంలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. ఉన్నంతలో పశువులను శుభ్రపరచి కొమ్ములకు రంగులద్ది పూజలు చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల పశువుల పోటీలు, ముగ్గుల పోటీలు తదితర ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలో ప్రజలు ఉన్నంతలో కొత్త బట్టలు కొని, పిండి వంటలు చేసుకుని బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. పండుగ సాయంత్రం వేళల్లో సినిమాలు, షికార్లు, ఎగ్జిబిషన్‌ దర్శించడం, బోట్‌ షికారు లాంటి వ్యాపకాలతో తమకున్న వనరులతో సందడి సందడిగా సంబరాలను చేసుకున్నారు.

ప్రభుత్వం ఉన్నట్లేనా?


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదీ లేనిదీ అర్థం కావడం లేదని, ఎవరికివారు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ధోరణితో వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని మాజీ మంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లోనే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సమైక్యాంధ్ర వాదులను పీకలు కోస్తానని హెచ్చరించారని, ఆనాడే అతనిపై సరైన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా సమైక్యాంధ్ర వాదులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇటువంటి అరాచక శక్తులను అదుపులో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య కెసిఆర్‌ను చూసి భయపడుతున్నారని, ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కెసిఆర్‌ కూతురు కవిత తన తండ్రిబాటలోనే నడుస్తూ సినిమాలను తెలంగాణాలో అడ్డుకోవాలని పిలుపునివ్వడం వారి అరాచకాలకు నిదర్శనమన్నారు. అయినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమెను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఇలాంటి అరాచక ప్రకటనలు చేసేవారిపట్ల ప్రభుత్వం కఠినమైన వైఖరి అవలంబించాలని డిమాండ్‌ చేశారు. డిజిపి కేవలం తెలంగాణా ప్రాంతానికి మాత్రమే డిజిపి కాదని, రాష్ట్రం మొత్తానికని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని డిజిపి చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. బాధ్యత గల అధికారిగా ప్రకటన చేసినా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రిలయన్స్‌ వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడ్డవారిని తూతూ మంత్రంగా అరెస్ట్‌ చేశారని, అసలు ఈ హింసకు కారకులైన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇకనైనా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వెంటనే అభిప్రాయాన్ని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నగర టిడిపి అధ్యక్షులు కిలారి వెంకటస్వామి నాయుడు, బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు నూనె మల్లికార్జున యాదవ్‌లు పాల్గొన్నారు.

గ్రిగ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించండి


నెల్లూరు (స్పోర్ట్‌‌స) మేజర్‌న్యూస్‌: జిల్లాలో పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించేందుకు 90 ఏళ్లుగా నిర్వహిస్తున్న గ్రిగ్‌ మెమోరియల్‌ క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఈ క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించే ఈ పోటీలకు మూడు శాతం నిధులను జడ్పీ సమకూరుస్తుందని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలోని ఏడు జోన్లలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.జోన్‌ - నిర్వహించు స్థలం 1. నెల్లూరు - జడ్పీ బాలుర పాఠశాల, దర్గామిట్ట, నెల్లూరు2.రాపూరు - జడ్పీ హైస్కూల్‌, పొదలకూరు3.నాయుడుపేట - జడ్పీ హైస్కూల్‌, నాయుడుపేట4. గూడూరు - జడ్పీ హైస్కూల్‌, నేలటూరు5. కావలి - జడ్పీ హైస్కూల్‌, పాత బిట్రగుంట6.ఆత్మకూరు - జడ్పీ హైస్కూల్‌, నర్రవాడ 7.బాలికల జోన్‌ - గవర్నమెంట్‌ హైస్కూల్‌, పల్లిపాడుఆయా జోన్ల ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తమకు అవసరమైన క్రీడా సామాగ్రిని డిఎస్‌డిఒ నుంచి తెప్పించుకోవాలన్నారు. సంబంధిత మండలాధికారులు, ప్రధానోపాధ్యాయుల సమన్వయ, సహకారాలతో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా క్రీడలను నిర్వహించాలన్నారు. జోన్‌ల వారీగా క్రీడా నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. అంకిత భావంతో పాఠశాల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను జిల్లా నుంచి అందించడంలో భాగస్వాములమవుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా విజేతలకు అందించే సర్టిఫికేట్లు, మెడల్స్‌ విషయాల్లో నాణ్యతను పాటించాలని, వారికందించే బహుమతులు వారికి ఉపయోగపడేలా చూడాలని ఆయన కోరారు. క్రీడాకారుల వసతి, భోజన, నీటి సరఫరా తదితర అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్రీడా స్థలాల్లో 108 వాహనం, ప్రధమ చికిత్స సామాగ్రి తప్పనిసరిగా ఉండాలని ఆయన ఆదేశించారు. సభకు అధ్యక్షత వహించిన జడ్పీ సిఇఒ మాట్లాడుతూ మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, ఎంఇఒలు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇష్టం లేకున్నా చార్జీలు పెంచాం

సంతపేట (నెల్లూరు) మేజర్‌న్యూస్‌: ఆర్టీసి బస్సు చార్జీలను ఇష్టం లేకున్నప్పటికీ పెంచాల్సి వచ్చిందని మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసి రీజనల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం నెల్లూరు-తిరుపతి ‘శీతల హంస’ ఎసి బస్సులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చార్జీలను పెంచలేదన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు, ఉద్యోగుల జీతాలు పెంచాల్సిరావడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసి కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది నిత్యం ఆర్టీసి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఆర్టీసి సిబ్బందికి జీతాలు పెంచామన్నారు.ఇవన్నింటినీ పూడ్చుకోడానికి చార్జీలు పెంచాల్సి వచ్చిందని, అయితే ఎక్కువగా పెంచామని కొంతమంది అంటున్నారని, అయినా తప్పలేదన్నారు. అంతకుముందు పచ్చజెండా ఊపి ఒక బస్సును ప్రారంభించారు. మరొక బస్సును ప్రారంభించే ముందు ఆ బస్సుకు సంబంధించిన పలు విషయాలతో వేసిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం బస్సులో ప్రయాణించి డ్రైవర్‌ను బస్సుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, నగర మేయర్‌ నందిమండలం భానుశ్రీ, ఆర్టీసి రీజనల్‌ మేనేజర్‌ పి.శేషగిరిరావు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎం.వి.ప్రభాకర్‌రెడ్డి, సిఎంఇ సిహెచ్‌. వెంకన్న, ఒకటవ డిపో మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, రెండవ డిపో మేనేజర్‌ పి.శీనయ్య, సెక్యూరిటీ ఆఫీసర్‌ హరికృష్ణ, పలువురు ప్రముఖులు, ఆర్టీసి ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆకాశంలో అద్భుతం

సంతపేట/స్పోర్ట్‌‌స(నెల్లూరు) మేజర్‌న్యూస్‌:విశ్వం అనంత అద్భుతాలకు మూలం. సౌరకుటుంబ పరిభ్రమణం నేటికీ మానవాళికి అంతుపట్టని విఙ్ఞాన గని. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల పయనంలో సంభవించే అనేక పరిణామాలలో గ్రహణాలు సామాన్యమైనప్పటికీ నేటి సుదీర్ఘ సూర్యగ్రహణ వీక్షణం అద్భుతం. ఆకాశంలో అరుదైన ఈ అద్భుతాన్ని జిల్లా ప్రజలు శుక్రవారం వీక్షించారు. శతాబ్దిలో సుదీర్ఘంగా సంభవించిన సూర్యగ్ర హణాన్ని జిల్లాలో లక్షలాది మంది ప్రజలు సంబరానందాలతో వీక్షించారు. ఉదయం 11.30 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు సూర్యగ్రహణం వీక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. ఆకాశంలో అరుదుగా సంభవించే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో గుమికూడారు. గతంలో ఉన్న మూఢనమ్మకాలను వదలి ఎక్కువ సంఖ్యలో గ్రహణాన్ని చూసేందుకు ఎవరికి వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఎతె్తైన ప్రదేశాల్లో, అపార్ట్‌మెంట్ల పైన, టవర్లపైకి ఎక్కి యువకులు సూర్యగ్రహణాన్ని చూడడానికి అత్యుత్సాహం చూపారు. మరికొంతమంది జనవిఙ్ఞాన వేదిక అమ్మిన ఫిల్టర్‌లను కొనుక్కొని పిల్లలు, మహిళలు ఇళ్ల వద్దనే వీక్షించారు. మరికొంతమంది అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎక్స్‌రే ఫిల్మ్‌లను ఉపయోగించారు. ఎక్కువ శాతం ఇళ్లలో టివిలకు అంటిపెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో సంభవించిన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. దీంతో నగరంలో జనసంచారం సన్నగిల్లింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వెలుగుమయంగా ఉండే సూర్యుడు సన్నగిల్లిన కాంతితో డిమ్‌లైట్‌తో కొత్త కాంతిని ప్రజలు ఆతృతగా ఆస్వాదించారు. పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు సూర్యగ్రహణం కారణంగా మూసివేశారు. దీంతో దేవాలయాలు, దేవాలయాల ప్రాంగణాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేయకపోయినప్పటికీ జనవిఙ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌, వేదాయపాళెం సెంటర్లలో సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మూఢనమ్మకాలను వీడండి : జనవిఙ్ఞాన వేదిక ప్రజల్లో గ్రహణాల పట్ల ఉన్న మూఢ నమ్మకాలను తొలగించేందుకు జెవివి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్నిచ్చాయి. లక్షలాదిమంది గ్రహణాన్ని వీక్షించడానికి సోలార్‌ వ్యూవర్స్‌, సోలార్‌ ఫిల్టర్‌లను ఉపయోగించి గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మూఢవిశ్వాసాల పట్ల ప్రజలకున్న అనేక అభిప్రాయాలను తొలగించడానికి జనవిఙ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రహణ సమయంలో భుజించకూడదని, గర్భవతులు బయటకు రాకూడదని, దేవాలయాల తలుపులు మూసివేయాలనే తదితర అంశాలపై ప్రజలకు శాస్ర్తీయపూర్వక సమాధానాలతో విశదీకరించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. నారాయణ మాట్లాడుతూ జిల్లాలో 83 శాతం ఏర్పడిన సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని వీక్షించడం అరుదైన అవకాశం అన్నారు. ఆకాశంలో సంభవించే ఈ అద్భుతాన్ని మూఢనమ్మకాల పేరుతో వీక్షించకుండా మానడం సహేతుకం కాదని పేర్కొన్నారు. గ్రహణ సమయంలో తినవచ్చునని నిరూపించేందుకు జెవివి నగరశాఖ అధ్యక్షుడు సతీష్‌, కార్యదర్శి సుధీర్‌ టిఫిన్‌ చేసి చూపించారు. ఇటువంటి ఖగోళ విఙ్ఞాన సంబంధిత అద్భుతాలను చూసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేయాలని జెవివి రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కోశాధికారి శ్రీధర్‌, నగర కోశాధికారి ఎస్‌. ప్రభాకర్‌, ఉపాధ్యక్షులు జి. జోసఫ్‌, ఎం.నారాయణకుమార్‌, ఎస్‌కె.రాయలు, జి.సుధీర్‌, మెజీషియన్‌ ఆదినారాయణ, బాలభవన్‌ డైరెక్టర్‌. జి.సుభద్రాదేవి, జనవిఙ్ఞాన వేదిక కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్య గ్రహణ అధ్యయనానికి మినీ రాకెట్‌ ప్రయోగం

సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ : సూర్యగ్రహణ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడానికి సథీష్‌ ధావన్‌ స్ఫేస్‌ సెంటర్‌ శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆర్‌హెచ్‌ 560 అనే మినీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం మరో రాకెట్‌ ప్రయోగం ఉంటుంది. గ్రహణ సమయంలో వాతావరణ మార్పులను అంచనా వేయడానికి ఈ రాకెట్‌ ప్రయోగం జరిపినట్లు షార్‌ అధికారులు ధృవీకరించారు. వాతావరణ మార్పులు, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి రాకెట్‌లను షార్‌ నుంచి తరచూ ప్రయోగిస్తుంటారు. ఒక్కొక్కసారి నాలుగైదు రాకెట్లను కూడా ఒకేసారి ప్రయోగించిన సందర్భాలున్నాయి.పెద్ద రాకెట్‌ ప్రయోగాల ముందు, ప్రయోగించిన తరువాత కూడా ఇలాంటి మినీ రాకెట్‌లను ప్రయోగించి వాతావరణ అధ్యయనం జరుపుతారు. ఈ సారి సూర్యగ్రహణ సందర్భంగా ఈ మినీ రాకెట్‌ను ప్రయోగించి వాతావరణం అధ్యయనం చేయడం విశేషం. షార్‌ డైరక్టర్‌ చంద్రదత్తన్‌ ఇతర శాస్తజ్ఞ్రులు నేతృత్వంలో శుక్రవారం ఈ మినీరాకెట్‌ ప్రయోగం జరిగింది. ఈ నెల 17న మరో మినీ రాకెట్‌ని ప్రయోగించనున్నట్లు షార్‌ శాస్తజ్ఞ్రులు తెలిపారు.

Wednesday, January 13, 2010

విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి


నెల్లూరు, మేజర్‌న్యూస్‌:దేశవ్యాప్తంగా ప్రస్తుతం విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వినియోగదారులను కోరారు. రూ.1.15 కోట్లతో స్థానిక డైకస్‌ రోడ్డు సెంటర్‌ (చేపల మార్కెట్‌) వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంక్షోభ నివారణకు ఎంతో కృషి చేస్తుందని, గతంలో రాష్ట్రంలో 18 లక్షల పంపుసెట్లు ఉచిత విద్యుత్‌ను పొందుతుండగా నేడు అవి 36 లక్షలకు చేరుకున్నాయన్నారు.అందరికీ విద్య, ఆరోగ్యంతోపాటు రైతులకు విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందిస్తుందన్నారు. దేశంలో సిక్కిం, ిహ మాచల్‌ ప్రదేశ్‌ వంటి కొద్ది రాష్ట్రాలు మినహా అనేక రాష్ట్రాల్లో ఈ విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉందన్నారు. భవిష్యత్తులో న్యూక్లియర్‌ పవర్‌పై ఆధారపడాల్సి ఉందని, ప్రత్యామ్నాయంగా సోలార్‌, విండ్‌ ఎనర్జీలను అభివృద్ధి చే సుకుని వ్యాపార పరంగా వాటిని వినియోగించుకోవాల్సి ఉందని, అందుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. నగరంలోని 16 ఇందిరమ్మ వార్డులలో లో వోల్టేజ్‌, కొత్త విద్యుత్‌ దీపాలు, తదితర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లను వెచ్చిస్తుందన్నారు. సభకు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ నూతనంగా డైకస్‌ రోడ్డులో విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల వేలాది కుటుంబాలకు లో వోల్టేజ్‌ సమస్య తీరిందన్నారు. నగరంలోని మాగుంట లేఅవుట్‌, ఆత్మకూరు బస్టాండు వద్ద మరో రెండు విద్యుత్‌ ఉపకేంద్రాలు మంజూరయ్యాయని, త్వరలోనే వాటి నిర్మాణం జరుగుతుందన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ త్వరలో కోటి రూపాయల వ్యయంతో చేపల మార్కెట్‌లో అధునాతన భవనాన్ని నిర్మించనున్నామన్నారు. నగర మేయర్‌ భానుశ్రీ మాట్లాడుతూ నగరంలోని 16 ఇందిరమ్మ వార్డులలో విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలు తొలగిపోనున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నింటినీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ అశ్వత్థనారాయణ, కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, డిఇ సుబ్బరాజు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు సయ్యద్‌ సందానీబాష, జరీనా సుల్తానా, పిండి సురేష్‌, సంక్రాంతి కళ్యాణ్‌, సిరిగిరి చక్రవర్తి, వెంకటజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కనిపించని సంక్రాంతి కళ


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: తెలుగువారి పండగల్లో సంక్రాంతి పండుగకు ఉన్న స్థానం మరే పండగకు లేదనేది వాస్తవం. కలవాడికి ప్రతి రోజు పండగేనని పెద్దలు చెబుతుంటారు. అయితే లేనివాడి ఇంట కూడా లేమి లేకుండా జరుపుకునే రోజు ఏదైనా ఉందంటే అది ఇప్పటి వరకూ సంక్రాంతి పండగనే చెప్పవచ్చు. నెల రోజుల పాటు ధనుర్మాస పుణ్యదినాలు కొనసాగినా చివరి మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ పెద్ద పండుగ ప్రతి ఇంటికి శోభను తెస్తుంటుంది. ఏడాదికొకసారి రుచి చూసే అరిసె కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు.కానీ ప్రస్తుతం... ఈ ఏడాది సంక్రాంతి మాత్రం జిల్లా ప్రజలకు అరిసెల రుచిని చూపించేలా కనిపించడం లేదు. భోగి పండుగకు ఒక్క రోజు మాత్రమే మిగిలిఉంది. అయినా ఇప్పటి వరకూ జిల్లాలో సంక్రాంతి లోగిళ్లు కనిపించడం లేదు. పెరిగిన ధరల మాటున పండుగకు ప్రజలు స్వస్తి పలికారేమోననే భావన కలిగించేలా పల్లెగడపలు కనిపిస్తున్నాయి. గత నెలరోజుల పైబడి సమైక్యాంధ్ర ఆందోళన, బంద్‌లతో జనజీవనం అస్తవ్యస్థమైంది. అసలే అందనిస్థాయిలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఆందోళనల పుణ్యమాని కొండెక్కి కూర్చున్నాయి. పిండివంటలకు అత్యంత అవసరమైన బెల్లం, చక్కెరల ధరలు నెల రోజుల వ్యవధిలో 30శాతం మేర పెరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫలసరుకుల వ్యాపారాలు చాలా తగ్గుముఖం పట్టాయని స్టోన్‌హౌస్‌పేట వ్యాపారులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం పుణ్యమాని పరోక్షంగా సామాన్యుడు కూడా బాధలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పంట చేతికందక పోవడంతో అప్పు చేసైనా పండగ పూర్తి చేయాలనే తలంపుతో వడ్డీ వ్యాపారుల చుట్టూ నిరుపేద రైతులు తిరుగుతున్నారు. ఇక వస్త్ర దుకాణాలైతే వెలవెలపోతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకూ సగం వ్యాపారం కూడా జరగలేదని క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నేతలు చెప్పారు. పండగకు అధిక మోతాదులో వస్త్రాలు తీసుకువచ్చామనీ, పండగ తర్వాత మరో మూడు నెలల పాటు సాధారణంగా వస్త్ర వ్యాపారాలు అంత ఆశాజనకంగా ఉండవని, తమకేమీ పాలుపోవడం లేదని చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 12, 13 తేదీలలోనైనా వ్యాపారాలు ఉంటాయని తాము భావిస్తున్నట్లు చెబుతున్నారు. పండగ సెలవులను విద్యార్థులు ఏనాడో మర్చిపోయారు. వరుసగా జరిగిన బంద్‌ల కారణంగా పాఠ్యాంశాలు పూర్తి కాకపోవడంతో పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో నిలిచిపోయారు. ఇన్ని అవాంతరాల నడుమ ఈ ఏడాది మకర సంక్రాంతి రంగవల్లులు ఏ మేర విరబూస్తాయో చెప్పలేం.

యువతకు రోల్‌మోడల్‌ వివేకానందుడు-జిల్లా కలెక్టర్‌.

కోవూరు, (మేజర్‌ న్యూస్‌) : ప్రతి రంగంలోని ప్రతిభావంతులను ఇతరులు రోల్‌మోడల్‌గా ఎంచుకోవడం పరిపాటి, అలాగే యువతకు ఎప్పటికీ రోల్‌మోడల్‌గా వివేకానందుడు చిరస్థాయిగా నిలిచిపోయాడని జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ పేర్కొన్నారు. కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని పద్మజా ఆడిటోరియంలో మంగళవారం విలేకానంద 147వ జయంతి సందర్భంగా జరిగిన యువజన వారోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి యువత అవసరం ఎంతో వుందని, వివేకానందుడు ఆనాడే సూచించారని, ఆయన గుర్తుచేశారు.భారతదేశానికి యువతే దేశ సంపద అని, అటువంటి దేశసంపదైన యువత సంఘం కోసం, దేశం కోసం పాటుపడాలని సూచించారు. నేటి యువత వివేకానందుని మార్గదర్శకంలో నడిచి భారతీయ సంసృ్కతిని, గొప్పతనాన్ని చాటి చెప్పాలని కోరారు. అనంతరం ఇటీవల వచ్చిన వరదలకు మహబూబ్‌ నగర్‌ జిల్లా అలంపూర్‌ గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో వసతి గృహాలలోని విద్యార్ధులు పుస్తకాలు, దుస్తులు కోల్పోయారు. వారికి లేగుంటపాడులో మాక్స్‌ బ్యాంక్‌ ద్వారా సోపులు, పుస్తకాలను పంపీణీ చేశారు. మరలా వారికి 260 ట్రంకుపెట్టెలను కలెక్టర్‌ చేతుల మీదుగా అందించారు.కేర్‌ అండ్‌ సపోర్ట్‌ సెంటర్‌కు అంగీకారం :- లేగుంటపాడు గ్రామంలో మాతా శిశుసంక్షేమ కేంద్రంలో నెల్లూరులోని వైఆర్‌జికె అనుబంద సంస్థగా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కేర్‌అండ్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో సెట్నల్‌ సిఇఓ సుధాకర్‌, తహసీల్దార్‌ సుధాకర్‌, ఎంపిడిఓ శ్రీహరిరెడ్డి, రెడ్‌క్రాస్‌ సంస్థ కార్యదర్శి సుబ్రమణ్యం, లాటరీక్లబ్‌ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌, సభ్యులు వేణోగోపాల్‌, ఒమ్మిన సతీష్‌, మాజీ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు, ప్రగతి యువకేంద్ర సిఇఓ గునపాటి ప్రసాద్‌రెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దూసుకొచ్చిన లారీ : ఇద్దరు మృతి,


చిల్లకూరు, (మేజర్‌న్యూస్‌) : చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని బస్టాండు వద్ద ఇసుక లారీ దూసుకురావడంతో ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు మంగళవారం సాయంత్రం చింతవరం గ్రామం నుండి ఇసుక లోడుతో బయలుదేరిన లారీ తిక్కవరం గ్రామం కూడలి వద్ద డ్రైవర్‌ అలక్ష్యం వల్ల అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఆరు దుకాణాలను ధ్వంసం చేసుకుంటూ దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఆరు మోటార్‌సైకిళ్లను ఢీ కొని ఆటో మీద ఎక్కడంతో స్కూటర్లు, ఆటో నుజ్జు నుజ్జయ్యాయి.ఆటోలో ప్రయాణిస్తున్న జ్యోతి (5) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, అక్షయ్‌ (5) అనే బాలుడు గూడూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బెస్తపాళెం గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వర్లును తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అలేఖ్య అనే బాలికను, తేజ అనే అతనిని నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించారు. రసూల్‌ సాహెబ్‌ను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన మిగిలిన వారిని గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. గాయపడిన వారిని ఎన్‌.జిలానిబాషా, శీనయ్య, వెంకటాల వెంకటేశ్వర్లు కవరగిరి రమణయ్య, రమణయ్యలు తిక్కవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఇదే సంఘటనలో తిక్కవరం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు కూడా గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని దుకాణాల్లో కూర్చుని ఉన్న స్థానికులు రోడ్డు మీదకు పరుగులెత్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న స్థానికులు జరిగిన ఘోరాన్ని చూసి కోపోద్రిక్తులై లారీని తగలబెట్టారు. సంఘటనా స్థలానికి చిల్లకూరు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. చింతవరం నుంచి రోజుకు వందల సంఖ్యలో లారీలు ఇసుక రవాణా జరుగుతుండడం డ్రైవర్‌ నిర్లక్ష్యానికి తరచూ ఈ మార్గంలో చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటి మీద నియంత్రణ లేకపోవడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు.సిఐ రజనీకాంత్‌రెడ్డి, చిల్లకూరు ఎస్‌ఐ నరశింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్త వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్పీడ్‌ బ్రేకర్‌ను కూడా వేసి ఉన్నారు. ఆ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతోనే స్పీడ్‌ బ్రేకర్‌లను ఏర్పాటు చేశారు. కానీ డ్రైవర్‌ అధిక వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తెలుగుదేశం కార్యదర్శి శీలం కిరణ్‌కుమార్‌ గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు చేరుకుని పరామర్శించారు. ఈ సంఘటనతో తిక్కవరం గ్రామం ఒక్కసారి విషాదంలో మునిగిపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

Monday, January 11, 2010

నిర్లక్ష్యం

- ఉదయగిరి మేజర్‌న్యూస్‌ : ఉదయగిరి నియోజక వర్గంలోని వివిధ శాఖల్లో ప్రభుత్వ వాహనాల వినియోగం మరమ్మతుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాదనం దుర్వినియోగం అవుతోంది. శిథిలమైన వాహనాలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వాహనాలను పట్టించుకొనే నాధుడే లేక ఎండకు ఎండి, వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. వెయ్యి రూపాయలు లోపు మరమ్మతుల ఖర్చయ్యే వాహనాలపై కూడా అధికారులు అశ్రద్ధ చూపుతున్నారు.అదేమిటంటే ప్రభుత్వ బడ్జెట్‌ విడుదల కావడంలేదని జిల్లా స్థాయి అధికారులు స్పందించడం లేదని మండల స్థాయి అధికారులు చెపుతున్నారు. అంతేకాకుండా రోజులు, సంవత్సరాల తరబడి వాహనాలు మూలన పడటంతో లక్షలాధి రూపాయల విలువ చేసి వాహనాలు మరమ్మతుల ఖర్చులు ప్రభుత్వానికి భారంగా పరణమిస్తున్నాయి. ఫలితంగా ఖర్చులు ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. అంతేకాకుండా అటువంటి వాహనాలు పనికిరాని వస్తువుల జాబితాలో చేరిపోతున్నాయి. పనికి రాని జాబితాలో ఉదయగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో జీపు, అంగన్‌వాడీ కార్యాలయంలోని ట్రక్కుట్రాలి, ఆర్‌అండ్‌బి కార్యాలయంలో తుప్పుపట్టిన ఇంజన్‌ ఆయిల్‌, అదేవిధంగా వింజమూరు రెవెన్యూ కార్యాయలంలో జీపు, ఇరిగేషన్‌ తదితర కార్యాలయాలలో ఉన్న వాహనాలు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి.కొత్త వాహనాలు లేవు : ప్రభుత్వ శాఖలకు కొత్త వాహనాలను కొనుగోలు చేసి ఇచ్చేందుకు ముందుకు రాని ప్రభుత్వం ప్రస్తుతం అరుగుతున్న వాహనాల నిర్వహణ బాధ్యతలనైనా సక్రమంగా నిర్వర్తించడం లేదు. సుమారు 35 సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన వాహనాలను ఉపయోగిస్తుడటం వల్ల వాటి సామర్ధ్యం తగ్గి మర్మతులకు లక్షలాది రూపాయలు ఖర్చువుతున్నాయి. ఉదయగిరి నియోజక వర్గంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబందించి 8 మండలాలకు 42 వాహనాలు ఉన్నాయి. వీటిలో 11 వాహనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. 6 వాహనాలను వినియోగిస్తున్నారు. మిగిలిన 25 వాహనాలు అవినీతి అధికారులకు ఆవిరైనట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బి శాఖలకు సంభంధించినవి. ఇవి ఇప్పటి వరకు ఎవరి పరిధిలో ఉన్నాయో ఆశఖల వారికే తెలియడం లేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. పని లేకుండానే డ్రైవర్లకు జీతం : ఉదయగిరి నియోజక వర్గంలో పలు మండలాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వాహనాలు లేకున్నా డ్రైవర్లకు ప్రభుత్వం జీతాలు మాత్రం చెల్లిస్తోంది. కొందరు డ్రైవర్లు అధికారుల ఇళ్ళల్లో పనులు చేస్తుండగా, మరి కొందరు కార్యాలయాల్లో గుమస్తా పనులు చే స్తున్నారు. కొందరు ఇటీవలనే ఉద్యోగ విరమణ చేశారు. నెలకు వేలాది రూపాయల జీతాలను డ్రైవర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. వీరి గురించి జిల్లా స్థాయి అధికారులు కాని, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పాత వాహనాలు మైలేజీ రావడం లేదు. వాహన మరమ్మతుల వ్యయంతో వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు రికార్డులు చెపుతున్నాయని సంబందిత శాఖల సిబ్బంది ఆరోపిస్తున్నారు. లక్షల అద్దె చెల్లింపు : ఉదయగిరి నియోజక వర్గంలో పలు మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాహనాలు మరమ్మతులకు గురి కావడం వాటి స్థానంలో అధికారులు అద్దె వాహనాలు తీసుకొని తిరుగుతున్నారు. ప్రతి నెల అద్దె వాహనాలకే ప్రభుత్వం లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రభుత్వం చెల్లించే ఒక నెల అద్దెలకు ఒకటి, రెండు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మూలనపడిన వాహనాలు వేలం వేయకుండా అలాగే వదిలేయడం వలన అవి పాత ఇనుముకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పనికిరాకుండా పోతున్న వాహనాలను వేలం వే సి ఆ డబ్బుతో నూతన వాహనాలను కొనుగోలు చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ సొమ్ము నిరూపయోగం


ఆత్మకూరు, (మేజర్‌న్యూస్‌): ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకానికి లక్షల రూపాయలు నిధులు మంజూరవుతుంటే స్థానిక అధికారుల అలసత్వంతో మొక్కల పెంపకం నామమాత్రంగా జరుగుతున్న వైనమిది. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు అటవీ శాఖ పరిధిలో ఇరిగేషన్‌ నివాసాల వద్ద రెండేళ్ల క్రితం ఓ నర్సరీని ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. మొక్కల పెంపకానికి అవసరమైన ట్రేలు, క్లోన్‌లు విరివిగా సరఫరా చేశారు. మొక్కలకు అవసరమైన నీటి వసతి కల్పించారు. ఇక్కడ పెంచిన మొక్కలను ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం, ఏఎస్‌పేట మండలాలకు వినియోగించుకోవాల్సి ఉంది. ప్రభుత్వపరంగా ఎవరు మొక్కలు నాటే కార్యక్రమానికి సమాయత్తమైతే వారికి తక్కువ రేట్లతో అటవీశాఖాధికారులు అవసరమైన మొక్కలను అందిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ భారీ లక్ష్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రారంభించిన నర్సరీని నాలుగు నెలలుగా గాలికొదిలేశారు.అక్కడ పెంపకానికి అవసరమైన విలువైన క్లోన్లు, ట్రేలు నిరూపయోగమవుతున్నాయి. ఎంతో లక్ష్యంతో ఏర్పాటు చేసిన నర్సరీ నామమాత్రంగా కనిపిస్తుంది. ఓ వైపు మొక్కల పెంపకానికి జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా నిధులు మంజూరు చేస్తుంటే రైతులకు అవసరమైన మొక్కల పెంపకం కంటికి కనిపించడం లేదు. ఎందరో రైతులు మొక్కల కోసం వస్తే నర్సరీని చూసి నవ్వుకుంటూ వెళుతున్నారు. ఇదేమని అక్కడ అడిగితే జవాబు చెప్పేవారు కనిపించరు. సంబంధిత అధికారులు ఎక్కడ ఉంటారో తెలియదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం కాస్తా నీరుగారుతుంది. ప్రతి ఏటా మొక్కల పెంపకం జరగాల్సి ఉండగా నామమాత్రంగా మొక్కలు పెంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వనసంరక్షణ విభాగంలో మొక్కల పెంపకం విరివిగా కొనసాగుతుంది. మరి ఇలాంటప్పుడు అవసరమైన మొక్కలు కనిపించకుండా నర్సరీని గాలికి ఎలా వదిలేశారో ఆ అధికారులకే తెలియాల్సి ఉంది. కానుగ, నేరేడు, వేప, మద్ది, ఉసిరి, టేకు మొక్కలు పెంచేందుకు నర్సరీ ఉండగా నేడు ఆ నర్సరీని చూస్తే అధికారుల పనితీరు ఇదా... అనిపిస్తుంది.
ఫ్రిబవరి నుంచి పనులు ప్రారంభం: రేంజర్‌ఆత్మకూరు నర్సరీ సక్రమంగా పని చేస్తుందని ప్రతి ఏటా నిధులు వస్తే మొక్కలు పెంచుతున్నామని అటవీశాఖ రేంజర్‌ ఎన్‌.శేషయ్య ‘మేజర్‌న్యూస్‌’కు వివరించారు. ఫ్రిబవరిలో నిధులు మంజూరు కానున్నాయని, అవి వచ్చిన మొక్కలు పెంచుతామన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh