Friday, January 15, 2010
సందడి సందడిగా సంక్రాంతి సంబరాలు
నెల్లూరు (కల్చరల్) మేజర్‌న్యూస్: పుష్యం మాసం హేమంత రుతువులో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతిని ప్రజలు గురువారం సందడి సందడిగా జరుపుకున్నారు. భోగిపండుగతో ప్రారంభమైన ఈ సంబరాలను సంక్రాంతినాడు పెద్దలను స్మరిస్తూ పెద్దల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ ధనుర్మాసంలో తెల్లవారుజామున ఆహ్లాదకర వాతావరణంలో తెలుగు లోగిళ్లు రంగవల్లులతో కళాకాంతులను వెదజల్లాయి. కాంక్రీట్ అరణ్యమైన నగరంలో ఒక్కో అపార్ట్‌మెంట్ ఓ కుగ్రామంగా మారి సభ్యులందరూ ఉదయాన్నే అపార్ట్‌మెంట్ ముంగిట ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను పెట్టి సాంప్రదాయ సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. పిండి వంటలను, చుట్టుపక్కల వారికి అందజేశారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పాలు పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధరలు మండిపోతున్న రోజుల్లో కూడా అరిసెలు, బొబ్బట్లు తదితర సాంప్రదాయ పిండివంటలను చేసి పండుగకు తీపిదనాన్ని అద్దారు. అక్కడక్కడా గంగిరెద్దులను ఆడిస్తూ డోలు, సన్నాయి, వాయిద్యాల ధ్వనులతో హరిదాసులు ఇల్లిల్లూ తిరిగారు. సంక్రాంతి సంబరాలు పూర్తికాకముందే సూర్యగ్రహణం ప్రారంభమవడంతో దేవాలయాలు మూసివేయడం భక్తులకు అత్యంత నిరాశ మిగిలింది. పండుగ సంబరాల్లో మూడవ రోజైన కనుమ పండుగ సంబరాలు కనపడకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కారణం నగరంలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. ఉన్నంతలో పశువులను శుభ్రపరచి కొమ్ములకు రంగులద్ది పూజలు చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల పశువుల పోటీలు, ముగ్గుల పోటీలు తదితర ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలో ప్రజలు ఉన్నంతలో కొత్త బట్టలు కొని, పిండి వంటలు చేసుకుని బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. పండుగ సాయంత్రం వేళల్లో సినిమాలు, షికార్లు, ఎగ్జిబిషన్ దర్శించడం, బోట్ షికారు లాంటి వ్యాపకాలతో తమకున్న వనరులతో సందడి సందడిగా సంబరాలను చేసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment