Friday, January 15, 2010
ఇష్టం లేకున్నా చార్జీలు పెంచాం
సంతపేట (నెల్లూరు) మేజర్‌న్యూస్: ఆర్టీసి బస్సు చార్జీలను ఇష్టం లేకున్నప్పటికీ పెంచాల్సి వచ్చిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసి రీజనల్ కార్యాలయం వద్ద శుక్రవారం నెల్లూరు-తిరుపతి ‘శీతల హంస’ ఎసి బస్సులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలను పెంచలేదన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు, ఉద్యోగుల జీతాలు పెంచాల్సిరావడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసి కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది నిత్యం ఆర్టీసి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఆర్టీసి సిబ్బందికి జీతాలు పెంచామన్నారు.ఇవన్నింటినీ పూడ్చుకోడానికి చార్జీలు పెంచాల్సి వచ్చిందని, అయితే ఎక్కువగా పెంచామని కొంతమంది అంటున్నారని, అయినా తప్పలేదన్నారు. అంతకుముందు పచ్చజెండా ఊపి ఒక బస్సును ప్రారంభించారు. మరొక బస్సును ప్రారంభించే ముందు ఆ బస్సుకు సంబంధించిన పలు విషయాలతో వేసిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం బస్సులో ప్రయాణించి డ్రైవర్‌ను బస్సుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, నగర మేయర్ నందిమండలం భానుశ్రీ, ఆర్టీసి రీజనల్ మేనేజర్ పి.శేషగిరిరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎం.వి.ప్రభాకర్‌రెడ్డి, సిఎంఇ సిహెచ్. వెంకన్న, ఒకటవ డిపో మేనేజర్ భాస్కర్‌రెడ్డి, రెండవ డిపో మేనేజర్ పి.శీనయ్య, సెక్యూరిటీ ఆఫీసర్ హరికృష్ణ, పలువురు ప్రముఖులు, ఆర్టీసి ఉద్యోగులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment