Wednesday, January 13, 2010
కనిపించని సంక్రాంతి కళ
నెల్లూరు, మేజర్‌న్యూస్: తెలుగువారి పండగల్లో సంక్రాంతి పండుగకు ఉన్న స్థానం మరే పండగకు లేదనేది వాస్తవం. కలవాడికి ప్రతి రోజు పండగేనని పెద్దలు చెబుతుంటారు. అయితే లేనివాడి ఇంట కూడా లేమి లేకుండా జరుపుకునే రోజు ఏదైనా ఉందంటే అది ఇప్పటి వరకూ సంక్రాంతి పండగనే చెప్పవచ్చు. నెల రోజుల పాటు ధనుర్మాస పుణ్యదినాలు కొనసాగినా చివరి మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ పెద్ద పండుగ ప్రతి ఇంటికి శోభను తెస్తుంటుంది. ఏడాదికొకసారి రుచి చూసే అరిసె కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు.కానీ ప్రస్తుతం... ఈ ఏడాది సంక్రాంతి మాత్రం జిల్లా ప్రజలకు అరిసెల రుచిని చూపించేలా కనిపించడం లేదు. భోగి పండుగకు ఒక్క రోజు మాత్రమే మిగిలిఉంది. అయినా ఇప్పటి వరకూ జిల్లాలో సంక్రాంతి లోగిళ్లు కనిపించడం లేదు. పెరిగిన ధరల మాటున పండుగకు ప్రజలు స్వస్తి పలికారేమోననే భావన కలిగించేలా పల్లెగడపలు కనిపిస్తున్నాయి. గత నెలరోజుల పైబడి సమైక్యాంధ్ర ఆందోళన, బంద్‌లతో జనజీవనం అస్తవ్యస్థమైంది. అసలే అందనిస్థాయిలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఆందోళనల పుణ్యమాని కొండెక్కి కూర్చున్నాయి. పిండివంటలకు అత్యంత అవసరమైన బెల్లం, చక్కెరల ధరలు నెల రోజుల వ్యవధిలో 30శాతం మేర పెరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫలసరుకుల వ్యాపారాలు చాలా తగ్గుముఖం పట్టాయని స్టోన్‌హౌస్‌పేట వ్యాపారులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం పుణ్యమాని పరోక్షంగా సామాన్యుడు కూడా బాధలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పంట చేతికందక పోవడంతో అప్పు చేసైనా పండగ పూర్తి చేయాలనే తలంపుతో వడ్డీ వ్యాపారుల చుట్టూ నిరుపేద రైతులు తిరుగుతున్నారు. ఇక వస్త్ర దుకాణాలైతే వెలవెలపోతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పటివరకూ సగం వ్యాపారం కూడా జరగలేదని క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు చెప్పారు. పండగకు అధిక మోతాదులో వస్త్రాలు తీసుకువచ్చామనీ, పండగ తర్వాత మరో మూడు నెలల పాటు సాధారణంగా వస్త్ర వ్యాపారాలు అంత ఆశాజనకంగా ఉండవని, తమకేమీ పాలుపోవడం లేదని చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 12, 13 తేదీలలోనైనా వ్యాపారాలు ఉంటాయని తాము భావిస్తున్నట్లు చెబుతున్నారు. పండగ సెలవులను విద్యార్థులు ఏనాడో మర్చిపోయారు. వరుసగా జరిగిన బంద్‌ల కారణంగా పాఠ్యాంశాలు పూర్తి కాకపోవడంతో పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో నిలిచిపోయారు. ఇన్ని అవాంతరాల నడుమ ఈ ఏడాది మకర సంక్రాంతి రంగవల్లులు ఏ మేర విరబూస్తాయో చెప్పలేం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment