సంతపేట/స్పోర్ట్‌స(నెల్లూరు) మేజర్‌న్యూస్:విశ్వం అనంత అద్భుతాలకు మూలం. సౌరకుటుంబ పరిభ్రమణం నేటికీ మానవాళికి అంతుపట్టని విఙ్ఞాన గని. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల పయనంలో సంభవించే అనేక పరిణామాలలో గ్రహణాలు సామాన్యమైనప్పటికీ నేటి సుదీర్ఘ సూర్యగ్రహణ వీక్షణం అద్భుతం. ఆకాశంలో అరుదైన ఈ అద్భుతాన్ని జిల్లా ప్రజలు శుక్రవారం వీక్షించారు. శతాబ్దిలో సుదీర్ఘంగా సంభవించిన సూర్యగ్ర హణాన్ని జిల్లాలో లక్షలాది మంది ప్రజలు సంబరానందాలతో వీక్షించారు. ఉదయం 11.30 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు సూర్యగ్రహణం వీక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. ఆకాశంలో అరుదుగా సంభవించే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో గుమికూడారు. గతంలో ఉన్న మూఢనమ్మకాలను వదలి ఎక్కువ సంఖ్యలో గ్రహణాన్ని చూసేందుకు ఎవరికి వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఎతె్తైన ప్రదేశాల్లో, అపార్ట్‌మెంట్ల పైన, టవర్లపైకి ఎక్కి యువకులు సూర్యగ్రహణాన్ని చూడడానికి అత్యుత్సాహం చూపారు. మరికొంతమంది జనవిఙ్ఞాన వేదిక అమ్మిన ఫిల్టర్‌లను కొనుక్కొని పిల్లలు, మహిళలు ఇళ్ల వద్దనే వీక్షించారు. మరికొంతమంది అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎక్స్‌రే ఫిల్మ్‌లను ఉపయోగించారు. ఎక్కువ శాతం ఇళ్లలో టివిలకు అంటిపెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో సంభవించిన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. దీంతో నగరంలో జనసంచారం సన్నగిల్లింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వెలుగుమయంగా ఉండే సూర్యుడు సన్నగిల్లిన కాంతితో డిమ్‌లైట్‌తో కొత్త కాంతిని ప్రజలు ఆతృతగా ఆస్వాదించారు. పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు సూర్యగ్రహణం కారణంగా మూసివేశారు. దీంతో దేవాలయాలు, దేవాలయాల ప్రాంగణాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేయకపోయినప్పటికీ జనవిఙ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్, వేదాయపాళెం సెంటర్లలో సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మూఢనమ్మకాలను వీడండి : జనవిఙ్ఞాన వేదిక ప్రజల్లో గ్రహణాల పట్ల ఉన్న మూఢ నమ్మకాలను తొలగించేందుకు జెవివి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్నిచ్చాయి. లక్షలాదిమంది గ్రహణాన్ని వీక్షించడానికి సోలార్ వ్యూవర్స్, సోలార్ ఫిల్టర్‌లను ఉపయోగించి గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మూఢవిశ్వాసాల పట్ల ప్రజలకున్న అనేక అభిప్రాయాలను తొలగించడానికి జనవిఙ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రహణ సమయంలో భుజించకూడదని, గర్భవతులు బయటకు రాకూడదని, దేవాలయాల తలుపులు మూసివేయాలనే తదితర అంశాలపై ప్రజలకు శాస్ర్తీయపూర్వక సమాధానాలతో విశదీకరించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ మాట్లాడుతూ జిల్లాలో 83 శాతం ఏర్పడిన సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని వీక్షించడం అరుదైన అవకాశం అన్నారు. ఆకాశంలో సంభవించే ఈ అద్భుతాన్ని మూఢనమ్మకాల పేరుతో వీక్షించకుండా మానడం సహేతుకం కాదని పేర్కొన్నారు. గ్రహణ సమయంలో తినవచ్చునని నిరూపించేందుకు జెవివి నగరశాఖ అధ్యక్షుడు సతీష్, కార్యదర్శి సుధీర్ టిఫిన్ చేసి చూపించారు. ఇటువంటి ఖగోళ విఙ్ఞాన సంబంధిత అద్భుతాలను చూసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేయాలని జెవివి రాష్ట్ర కార్యదర్శి ఎన్.సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కోశాధికారి శ్రీధర్, నగర కోశాధికారి ఎస్. ప్రభాకర్, ఉపాధ్యక్షులు జి. జోసఫ్, ఎం.నారాయణకుమార్, ఎస్‌కె.రాయలు, జి.సుధీర్, మెజీషియన్ ఆదినారాయణ, బాలభవన్ డైరెక్టర్. జి.సుభద్రాదేవి, జనవిఙ్ఞాన వేదిక కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య గ్రహణ అధ్యయనానికి మినీ రాకెట్ ప్రయోగం
సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్ : సూర్యగ్రహణ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడానికి సథీష్ ధావన్ స్ఫేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆర్‌హెచ్ 560 అనే మినీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం మరో రాకెట్ ప్రయోగం ఉంటుంది. గ్రహణ సమయంలో వాతావరణ మార్పులను అంచనా వేయడానికి ఈ రాకెట్ ప్రయోగం జరిపినట్లు షార్ అధికారులు ధృవీకరించారు. వాతావరణ మార్పులు, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి రాకెట్‌లను షార్ నుంచి తరచూ ప్రయోగిస్తుంటారు. ఒక్కొక్కసారి నాలుగైదు రాకెట్లను కూడా ఒకేసారి ప్రయోగించిన సందర్భాలున్నాయి.పెద్ద రాకెట్ ప్రయోగాల ముందు, ప్రయోగించిన తరువాత కూడా ఇలాంటి మినీ రాకెట్‌లను ప్రయోగించి వాతావరణ అధ్యయనం జరుపుతారు. ఈ సారి సూర్యగ్రహణ సందర్భంగా ఈ మినీ రాకెట్‌ను ప్రయోగించి వాతావరణం అధ్యయనం చేయడం విశేషం. షార్ డైరక్టర్ చంద్రదత్తన్ ఇతర శాస్తజ్ఞ్రులు నేతృత్వంలో శుక్రవారం ఈ మినీరాకెట్ ప్రయోగం జరిగింది. ఈ నెల 17న మరో మినీ రాకెట్‌ని ప్రయోగించనున్నట్లు షార్ శాస్తజ్ఞ్రులు తెలిపారు.
No comments:
Post a Comment