Wednesday, January 13, 2010
దూసుకొచ్చిన లారీ : ఇద్దరు మృతి,
చిల్లకూరు, (మేజర్‌న్యూస్) : చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని బస్టాండు వద్ద ఇసుక లారీ దూసుకురావడంతో ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు మంగళవారం సాయంత్రం చింతవరం గ్రామం నుండి ఇసుక లోడుతో బయలుదేరిన లారీ తిక్కవరం గ్రామం కూడలి వద్ద డ్రైవర్ అలక్ష్యం వల్ల అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఆరు దుకాణాలను ధ్వంసం చేసుకుంటూ దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఆరు మోటార్‌సైకిళ్లను ఢీ కొని ఆటో మీద ఎక్కడంతో స్కూటర్లు, ఆటో నుజ్జు నుజ్జయ్యాయి.ఆటోలో ప్రయాణిస్తున్న జ్యోతి (5) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, అక్షయ్ (5) అనే బాలుడు గూడూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బెస్తపాళెం గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వర్లును తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అలేఖ్య అనే బాలికను, తేజ అనే అతనిని నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించారు. రసూల్ సాహెబ్‌ను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన మిగిలిన వారిని గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. గాయపడిన వారిని ఎన్.జిలానిబాషా, శీనయ్య, వెంకటాల వెంకటేశ్వర్లు కవరగిరి రమణయ్య, రమణయ్యలు తిక్కవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఇదే సంఘటనలో తిక్కవరం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు కూడా గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని దుకాణాల్లో కూర్చుని ఉన్న స్థానికులు రోడ్డు మీదకు పరుగులెత్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న స్థానికులు జరిగిన ఘోరాన్ని చూసి కోపోద్రిక్తులై లారీని తగలబెట్టారు. సంఘటనా స్థలానికి చిల్లకూరు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. చింతవరం నుంచి రోజుకు వందల సంఖ్యలో లారీలు ఇసుక రవాణా జరుగుతుండడం డ్రైవర్ నిర్లక్ష్యానికి తరచూ ఈ మార్గంలో చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటి మీద నియంత్రణ లేకపోవడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు.సిఐ రజనీకాంత్‌రెడ్డి, చిల్లకూరు ఎస్‌ఐ నరశింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్త వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్‌ను కూడా వేసి ఉన్నారు. ఆ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతోనే స్పీడ్ బ్రేకర్‌లను ఏర్పాటు చేశారు. కానీ డ్రైవర్ అధిక వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తెలుగుదేశం కార్యదర్శి శీలం కిరణ్‌కుమార్ గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు చేరుకుని పరామర్శించారు. ఈ సంఘటనతో తిక్కవరం గ్రామం ఒక్కసారి విషాదంలో మునిగిపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment