Friday, January 15, 2010
ప్రభుత్వం ఉన్నట్లేనా?
నెల్లూరు, మేజర్‌న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదీ లేనిదీ అర్థం కావడం లేదని, ఎవరికివారు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ధోరణితో వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని మాజీ మంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లోనే టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమైక్యాంధ్ర వాదులను పీకలు కోస్తానని హెచ్చరించారని, ఆనాడే అతనిపై సరైన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా సమైక్యాంధ్ర వాదులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇటువంటి అరాచక శక్తులను అదుపులో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య కెసిఆర్‌ను చూసి భయపడుతున్నారని, ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కెసిఆర్ కూతురు కవిత తన తండ్రిబాటలోనే నడుస్తూ సినిమాలను తెలంగాణాలో అడ్డుకోవాలని పిలుపునివ్వడం వారి అరాచకాలకు నిదర్శనమన్నారు. అయినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి అరాచక ప్రకటనలు చేసేవారిపట్ల ప్రభుత్వం కఠినమైన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు. డిజిపి కేవలం తెలంగాణా ప్రాంతానికి మాత్రమే డిజిపి కాదని, రాష్ట్రం మొత్తానికని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని డిజిపి చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. బాధ్యత గల అధికారిగా ప్రకటన చేసినా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రిలయన్స్ వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడ్డవారిని తూతూ మంత్రంగా అరెస్ట్ చేశారని, అసలు ఈ హింసకు కారకులైన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇకనైనా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వెంటనే అభిప్రాయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర టిడిపి అధ్యక్షులు కిలారి వెంకటస్వామి నాయుడు, బిసి సెల్ జిల్లా అధ్యక్షులు నూనె మల్లికార్జున యాదవ్‌లు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment