online marketing

Monday, December 13, 2010

nellore bandh photo

nellore district paper

పీఠం’ కోసం పోటీ

నెల్లూరు: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తూ తమ తమ వర్గనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటి వరకూ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్లసిరి గోపాల్‌రెడ్డి జగన్‌ వర్గానికి మద్దతు తెలిపడంతో ఆయనను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. దీంతో అప్పటి నుంచి డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. తాజాగా జిల్లాలో పార్టీ బాధ్యతలను కొత్త అధ్యక్షుడిగా ఎంపిక జరిగేవరకూ జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికే అధిష్ఠానం అప్పజెప్పడం జరిగింది. అయితే ఆయన కూడా త్వరలోనే డీసీసీ అధ్యక్ష ఎంపిక పూర్తిచేయాలని అధిష్ఠానాన్ని కోరడం ద్వారా ఆర్థిక మంత్రిగా తనకు వెసులుబాటు ఉండకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే డీసీసీ అధ్యక్ష స్థానానికి అభ్యర్థి ఎంపిక పూర్తిచేయనున్నట్లు తెలిసింది.

ఈ పదవి కోసం పోటీలో పలువురు నేతలున్నారు. వీరిలో ముందు వరసలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. నేదురుమల్లి సన్నిహితుడిగా పేరున్న ఈయనకు పదవి ఇప్పించేందుకు పెద్దాయన ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. తాజా మంత్రివర్గంలో తన వారికి అవకాశం ఇప్పించడంలో విఫలమైన నేదురుమల్లి ఎలాగైనా డీసీసీ పీఠం తన వర్గానికే దక్కాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈయన మద్దతుదారుడుగా ఉంటూనే ఆనం వర్గంతో విబేధాలు లేని డీసీసీబి అధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి పేరు కూడా ఈ రేసులో ప్రముఖంగా వినవస్తోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థికే టికెట్‌ తీసుకొచ్చుకోవడంలో సఫలమైన వాకాటికి నేదురుమల్లి అడ్డుచెప్పక పోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. వీరిద్దరిలో ఎవరికిచ్చినా ఆదాల, కాకాణిలు పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఆనం వర్గం తరపున ఈ పదవి కోసం ప్రస్తుతం పార్టీ నగర అధ్యక్షుడు చాట్ల నరసింహరావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి వెంట జిల్లాలో పర్యటిస్తూ తనను అన్ని ప్రాంతాల నేతలకు పరిచయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబోయే డీసీసీ ప్రెసిడెంట్‌గా చాట్ల పేరు నగరంలో మార్మోగుతోంది. అయితే ఇతని ఎంపికను జిల్లాలో ఆదాల, నేదురుమల్లి వర్గాలు తీవ్రంగా అడ్డుకునే అవకాశాలు ఉండడంతో ఇతని ఎంపిక మీద సందేహాలు కూడా నెలకొన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చేవూరు దేవకుమార్‌రెడ్డి కూడా డీసీసీ రేసులో దూసుకుపోతున్నారు. పనబాక వర్గం కింద ఈయన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒకవేళ అధిష్ఠానం ఈయన్ను ఎంపిక చేయాలని భావిస్తే ఆనం వర్గం అడ్డుచెప్పకపోవచ్చు. ప్రస్తుతానికి డీసీసీ అధ్యక్ష రేసులో ప్రధానంగా పోటీ ఈ నలుగురి నడుమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధిష్ఠానం కూడా సస్పెన్స్‌కు తెరదించి త్వరలో సమర్థుడికి డీసీసీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా ఇటు ప్రతిపక్షాలను, అటు త్వరలో ఏర్పాటు కాబోయే జగన్‌ పార్టీని ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉంది.

నెల్లూరు టు ఫారిన్‌కు హైటెక్‌ వ్యభిచారం

నెల్లూరు:రోజుకొక తరహాలో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల నుంచి యువతులను ఆకర్షించి నెల్లూరు నుండి విదేశాలకు వ్యభిచారం నిమిత్తం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అందిన వివరాల్లోకెళ్తే సింగపూర్‌, బ్యాంకాక్‌, దుబాయ్‌ వంటి ప్రాంతాల్లో ఆంధ్ర అమ్మాయిలకు విపరీతమైన గిరాకీ పెరగడంతో రాష్ట్రంలోనే నెల్లూరులోని ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న యువతులను కొందరు బ్రోకర్లు అట్టే రాబట్టేస్తున్నారు. కోవూరు, బుచ్చి, నెల్లూరు, గూడూరు, కావలి వంటి ప్రధానమైన ప్రాంతాల్లో ఇళ్లను బాడుగకు తీసుకుని కొంతమంది ఆడ, మగ బ్రోకర్లు మకాం వేస్తున్నారు. వీరు ప్రతి రోజూ రద్దీగా ఉండే బస్టాండ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కాలేజీల వద్దకు చేరి మహిళలను మాయమాటలు చెప్పి వారికి ముందుగా ఆకర్షణీయమైన మాటలు చెప్పి లోబరుచుకుంటున్నారు.

తర్వాత అమ్మాయిల ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని వారికి పాస్‌పోర్ట్‌ తయారుచేయించి విదేశాలలో ఉద్యోగమిప్పిస్తామని మాయమాటలతో న మ్మపలికి విదేశాలకి పంపిస్తున్నారు. అయితే వారికి ఏర్పాటు చేసే వీసా కేవలం తాత్కాలికంగా ఇచ్చిన సంగతి వారికి చెప్పకుండానే పంపించడమేగాక, ఇచ్చే పాస్‌పోర్ట్‌ నకిలీది ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాస్‌పోర్ట్‌తో ఏదోవిధంగా మద్రాస్‌లోని కొంతమంది బ్రోకర్లు విమానమెక్కించి విదేశాలకు తరలిస్తున్నారు. అయితే అక్కడకు పోయిన తర్వాత అసలు ఉద్యోగం వ్యభిచారం అన్న సంగతి వారికి తెలియదు. ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో నెలల పర్యంతం అక్కడే వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారు. మరికొంతమందిని ఇక్కడే వ్యభిచార వృత్తిలో బాగా సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి ఈ బ్రోకర్లు అక్కడకు పంపుతున్నట్లు తెలిసింది.

జిల్లాలో నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారుచేసేవారు కూడా ఉన్నారని సమాచారం. ఇటీవల కొంతమంది జిల్లా వాసులు దుబాయ్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌కు వెళ్లొచ్చినవారు జిల్లాకు చెందిన మహిళలు అక్కడ వ్యభిచార వృత్తిలో మగ్గుతున్నారని, వారి బాధలు వర్ణనాతీతమని తెలిపినట్లు తెలిసింది. కేవలం బ్రోకర్ల మాయమాటలతో తాము ఈ మురికి కూపంలో ఇరుక్కుపోయినట్లు విదేశాల్లో ఉన్న జిల్లా మహిళలు వాపోయినట్లు సమాచారం. నెల్లూరు నుండి లగ్జరీ కార్లలో మాయమాటలు చెప్పి ఇక్కడే మహిళలకు కొంత ఆర్థిక సహాయం అందించి లగ్జరీ షాపింగ్‌లు చేయించి చెనై్నకు తీసుకెళ్తున్నారు. కష్టమొకరిది- సుఖం మరొకరిది అన్నట్లుగా బ్రోకర్లు వీరిని విదేశాలకు పంపించి జిల్లాలో అత్యంత విలాస జీవితాలను గడుపుతోంటే సదరు మహిళలు అక్కడ అనేక కష్టాలు పడుతున్నారు.

వాళ్లు తిరిగి స్వదేశానికి వచ్చేటప్పుడు డబ్బులు సంగతి దేవుడెరుగు- జబ్బులు మాత్రం విపరీతంగా మోసుకొస్తున్నారు. అధికారులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకీ హైటెక్‌ పంథాలో ఈ వ్యభిచారాన్ని హైటెక్‌ బ్రోకర్లు నెల్లూరు నుంచి ఫారిన్‌కి నిత్యం ఏదోఒక ప్రాంతం నుంచి కొనసాగిస్తున్నారని సమాచారం. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి ఆయా ప్రాంతాల నుంచి మద్రాస్‌కు తరలిస్తున్న మహిళలను బ్రోకర్ల చెర నుంచి విడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

అడవులను వదిలి...

వెంకటగిరి:స్మగ్లర్లకే స్మగ్లర్లు ఉండటం విశేషం అయితే ఏకంగా అటవీశాఖ అధికారులనే డుమ్మాకొట్టించి దాదాపు 125 ఎర్రచందనం దుంగలను కొత్త తరహాలో స్మగ్లర్లు చోరీచేయడం విశేషం. ఎర్రచందనం దుంగలను అటవీప్రాంతాల నుండి తీసుకురావడం స్మగ్లర్లకు పెను సవాల్‌ అయితే. ఈ కొత్త రకం చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎంచుకున్న వైనం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే స్థానిక వెంకటగిరి అటవీశాఖ కార్యాలయం గూడౌన్‌లో స్మగ్లర్ల నుండి స్వాదీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను, వాహనాలను నిల్వ చేస్తారు. అయితే ఆ దుంగలపై కన్ను పడిన చిత్తూరు జిల్లా కెవిబి పురం మండలం వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన జయరామయ్య, నె ల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాళెం గ్రామానికి చెందిన ఆటపాక మునెయ్యలు తెలివైన ప్రణాళికను వేశారు.

దీంతో చిత్తూరుజిల్లా కెవివిపురం మండలం రాయపేటకు చెందిన రఘునాధ్‌రెడ్డితో కలిసి పక్కా ప్రణాళికతో ఫారెస్ట్‌ గూడౌన్‌ నుంచే ఎర్రచందనం దుంగలను చోరి చేసేందుకు పూనుకున్నారు. దీంతో ఇటీవల గత రెండున్నర నెలల నుండి వర్షాల కురుస్తున్న సమయంలో, విద్యుత్‌ సరఫరా లేని సమయంలో మాటువేసి రోజువారీగా కొన్ని దుంగలను చోరీచేసి బొప్పాపురం చెరువులో దాచిపెట్టారు. చివరకు ఏకంగా 125 దుంగలను లారీకి లోడ్‌చేసి చెనై్నకు తరలిస్తుండగా శ్రీకాళహస్ర్తి మండలంలోని కనపర్తి రోడ్డు వద్ద చిత్తూరు జిల్లా అటవీశాఖ సిబ్బంది దుంగలతో సహ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ దుంగలపై వెంకటగిరి అటవీశాఖకు సంబంధించిన నెంబర్లు వేసి ఉండటంతో అక్కడి అధికారులు నెల్లూరు జిల్లా అటవీశాఖ అధికారులకు సమాఛారమిచ్చారు. దీంతో సబ్‌డిఎఫ్‌ఓ పవన్‌కుమార్‌ స్థానిక అటవీశాఖ అధికారులు కలిసి చోరీకి కారణమైన రఘునాధ్‌రెడ్డిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇంకా సంబంధం ఉన్న జైరామయ్య, అటపాక మునెయ్యలు పరారీలో ఉన్నారు. అయితే కొత్త తరహాలో ఈ చోరీ జరగడంతో ఈ విషయంపై ప్రజలు ముక్కున వేలేసుకోవడం విశేషం.

వెంకటేశ్వరపురం సమస్యలపై బిజెపి ఆరా....

నెల్లూరు‌:నగరంలోని 1,50 డివిజన్‌ పరిధిలోని ప్రాంతాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన మాజీ, కార్యకర్తలను కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఆ ప్రాంత వాసులు వెంకటేశ్వరపురంలోని ప్రధాన కాలువల్లో గత 20యేళ్ళుగా పూడిక తీయలేదన్నారు. మసీదు, గుడి ప్రాంతాల్లో పందులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయనకు తెలిపారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో అనేక గుంతలతో, దోమలతోను, వానాకాలంలో బురదతోను జీవనం సాగిస్తున్నామని ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు చిలకపాటి శ్రీనివాసులు, జనార్దనరావు, జయచంద్ర, భాషా, శ్రీనివాసుల గౌడ్‌, బండారు శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.

నిరాహార దీక్షలను జయప్రదం చేయండి

నెల్లూరు‌:రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 13 లక్షల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పని చేస్తున్నారని, వీరిలో 25 వేలమంది నెల్లూరు జిల్లాలో పని చేస్తున్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నుండి మూడు రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటి కన్వీనర్‌ మన్నెం శ్రీధర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2005 నుండి నేటి వరకు వీరి వేతనాలను పెంచలేదని, చాలిచాలని జీతాలతో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కనీస స్కేలు మినిమమ్‌ బేసిక్‌ సమానంగా వేతనాలను పెంచాలని, డిఏ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల 1వ తేదిన జీతాలు చెల్లించాలని, 15 రోజుల క్యాజువల్‌ లీవులు, మహిళలకు 180 రోజుల స్రసూతి శెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

నేత్రదానంపై అవగాహన సదస్సు

నెల్లూరు:వాసవి క్లబ్‌ విక్రమసింహపురి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలాజీనగర్‌లోని వై.కె. ఆచారి ఆంగ్ల మీడియం పాఠశాలలో రక్త, నేత్ర దానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులకు రక్త, నేత్ర దానాలపై సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ కార్యదర్శి సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ రక్తదానం మరొక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని, నేత్రదానం ఇద్దరి అంధులకు చూపునిచ్చి ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని కలిగిస్తుందని వివరించారు. 18వ ఏటనుండే విద్యార్ధులు రక్త దానం చేయవచ్చని, అలాగే 60 ఏళ్ళ వరకు కూడా రక్త దానాన్ని చేయవచ్చని తెలిపారు. క్లబ్‌ అద్యక్షులు యుగంధర్‌ మాట్లాడుతూ గత రెండు యేళ్ళుగా వాసవి క్లబ్‌ నేత్రదానంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తద్వారా నేత్ర దానం పట్ల ఎంతో స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కోశాధికారి సురేంద్ర, జెవివి. మురళి, పాఠశాల కరెస్పాండెంట్‌ శేషబ్రహ్మం, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్దులు పాల్గొన్నారు.

ప్రమాదభరితంగా పాఠశాల స్లాబు

ఆత్మకూరు : మండలంలోని అప్పారావుపాళెం ఎస్సీకాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడిపడుతూ ప్రమాదభరితంగా ఉంది. పాఠశాలలో స్లాబు పెచ్చులూడిపోతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల సమయంలో పాఠశాలలో కూర్చునే పరిస్థితి లేదని వారు వాపోయారు. ఉరుస్తున్న పాఠశాల భవనంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అల్లాడుతున్నారు. ఓవైపు విద్యార్థులు చదువుకోలేక, మరోవైపు ఉపాధ్యాయులు బోధించలేక ఉరుస్తున్న స్లాబు వైపు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఈ విషయమై ఇప్పటికే పలు దఫాలు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల స్లాబుకు మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సమస్యల చట్రంలో ‘వందూరుగుంట ఎస్సీకాలనీ’

ఆత్మకూరు, : పట్టణానికి దూరంగా తిప్ప కింద ఉన్న ఆ కాలనీకి తాగునీరు వారానికో రోజు వస్తుంది. దీనికి తోడు తిప్పప్రాంతం కావడంతో రోడ్లు మొనతేలిన రాళ్ళతో ప్రమాదభరితంగా ఉన్నాయి.నడిచేందుకు వీల్లేని పరిస్థితి. దీంతో ఆ కాలనీవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వారు ఎస్సీలు కావడంతో ఏమీ చేయలేక ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.వివరాల్లోకి వెళ్ళితే..... ఆత్మకూరు పట్టణం తిప్ప ప్రాంతానికి కింద వందూరుగుంట ఎస్సీకాలనీ ఉంది. కాలనీ తిప్పప్రాంతంలో ఉండడంతో రోడ్లు మొనతేలిన రాళ్ళతో అడుగు పెడితే తెగే విధంగా ఉన్నాయి. ఆ కాలనీ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఓ సిమెంటు రోడ్డు కూడా కనిపించదు.


ఇక డ్రైనేజిల సంగతి చెప్పక్కరలేదు. అధ్వానంగా ఉన్న రోడ్లపై డ్రైనేజిలు లేకపోవడంతో మురికినీరు ప్రవహిస్తూ దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఆ కాలనీ వాసులకు వారానికో సారి మాత్రమే తాగునీరు వస్తుందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కాలనీలో ఓ చిన్నపాటి ట్యాంకును ఏర్పాటు చేసి అందులోకి వారానికో సారి నీటిని అధికారులు విడుదల చేస్తారు. కనీసం ఆ ట్యాంకును శుభ్రపరచడం కూడా లేదు. దీంతో అందులో పాచి పేరుకుపోయి నీరు కలుషితంగా వస్తుంది. ఆ నీరు తాగిన ఎస్సీకాలనీవాసులు రోగాలతో అల్లాడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి ఓ మాత్రను తెచ్చి వేసుకోవడం తప్ప అధికారులకు సమస్యలను వివరించే కనీస అవగాహన కూడా వారికి లేకపోవడంతో అటువైపు అధికారులు వెళ్ళడం లేదు.


వారి బాగోగులను పట్టించుకోవడం లేదు. కాలనీ మొత్తం కంపచెట్ల నడుమ ఓ చిన్నపాటి చిట్టడవిలా ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇకపోతే కాలనీలో విద్యుత్‌స్తంభాలైతే ఉన్నాయి గానీ వాటికి వీధిలైట్లు లేవు. రాత్రుళ్ళు పట్టణ చివరి ప్రాంతం అది కూడా తిప్పప్రాంతం కావడంతో విషపురుగుల సంచారం ఉంటుంది. వీధిలైట్లు లేకపోవడంతో ఆ ప్రాంతవాసులు సూర్యోస్తమయం అయితే ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. ఈ ప్రాంతవాసులకు కనీసం ఇందిరమ్మ ఇళ్ళు కూడా మంజూరు కాలేదు. దీంతో పూరిళ్ళలోనే జీవనం వెళ్ళదీస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మొక్కుబడిగా మా ప్రాంతానికి వచ్చే అధికారులకు మా సమస్యలను వివరిస్తే చేస్తాంలే అంటూ అటుపై ఇక కనిపించడం లేదని, పట్టించుకోవడం లేదని వందూరుగుంట ఎస్సీకాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆ కాలనీ వైపు చూసి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh