online marketing

Monday, December 13, 2010

సమస్యల చట్రంలో ‘వందూరుగుంట ఎస్సీకాలనీ’

ఆత్మకూరు, : పట్టణానికి దూరంగా తిప్ప కింద ఉన్న ఆ కాలనీకి తాగునీరు వారానికో రోజు వస్తుంది. దీనికి తోడు తిప్పప్రాంతం కావడంతో రోడ్లు మొనతేలిన రాళ్ళతో ప్రమాదభరితంగా ఉన్నాయి.నడిచేందుకు వీల్లేని పరిస్థితి. దీంతో ఆ కాలనీవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వారు ఎస్సీలు కావడంతో ఏమీ చేయలేక ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.వివరాల్లోకి వెళ్ళితే..... ఆత్మకూరు పట్టణం తిప్ప ప్రాంతానికి కింద వందూరుగుంట ఎస్సీకాలనీ ఉంది. కాలనీ తిప్పప్రాంతంలో ఉండడంతో రోడ్లు మొనతేలిన రాళ్ళతో అడుగు పెడితే తెగే విధంగా ఉన్నాయి. ఆ కాలనీ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఓ సిమెంటు రోడ్డు కూడా కనిపించదు.


ఇక డ్రైనేజిల సంగతి చెప్పక్కరలేదు. అధ్వానంగా ఉన్న రోడ్లపై డ్రైనేజిలు లేకపోవడంతో మురికినీరు ప్రవహిస్తూ దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఆ కాలనీ వాసులకు వారానికో సారి మాత్రమే తాగునీరు వస్తుందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కాలనీలో ఓ చిన్నపాటి ట్యాంకును ఏర్పాటు చేసి అందులోకి వారానికో సారి నీటిని అధికారులు విడుదల చేస్తారు. కనీసం ఆ ట్యాంకును శుభ్రపరచడం కూడా లేదు. దీంతో అందులో పాచి పేరుకుపోయి నీరు కలుషితంగా వస్తుంది. ఆ నీరు తాగిన ఎస్సీకాలనీవాసులు రోగాలతో అల్లాడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి ఓ మాత్రను తెచ్చి వేసుకోవడం తప్ప అధికారులకు సమస్యలను వివరించే కనీస అవగాహన కూడా వారికి లేకపోవడంతో అటువైపు అధికారులు వెళ్ళడం లేదు.


వారి బాగోగులను పట్టించుకోవడం లేదు. కాలనీ మొత్తం కంపచెట్ల నడుమ ఓ చిన్నపాటి చిట్టడవిలా ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇకపోతే కాలనీలో విద్యుత్‌స్తంభాలైతే ఉన్నాయి గానీ వాటికి వీధిలైట్లు లేవు. రాత్రుళ్ళు పట్టణ చివరి ప్రాంతం అది కూడా తిప్పప్రాంతం కావడంతో విషపురుగుల సంచారం ఉంటుంది. వీధిలైట్లు లేకపోవడంతో ఆ ప్రాంతవాసులు సూర్యోస్తమయం అయితే ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. ఈ ప్రాంతవాసులకు కనీసం ఇందిరమ్మ ఇళ్ళు కూడా మంజూరు కాలేదు. దీంతో పూరిళ్ళలోనే జీవనం వెళ్ళదీస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మొక్కుబడిగా మా ప్రాంతానికి వచ్చే అధికారులకు మా సమస్యలను వివరిస్తే చేస్తాంలే అంటూ అటుపై ఇక కనిపించడం లేదని, పట్టించుకోవడం లేదని వందూరుగుంట ఎస్సీకాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆ కాలనీ వైపు చూసి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh