online marketing

Monday, January 18, 2010

ధరల పెరుగుదలపై దశలవారీ ఉద్యమాలు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : దేశచరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న నిత్యావసర వస్తువుల పెరుగుదలను నిరసిస్తూ దశలవారీ ఉద్యమాలను చేపట్టేందుకు భారతీయ జనతాపార్టీ నిర్ణయించిందని పార్టీ జాతీయ నాయకుడు, ఎంపి ఎం.వెంకయ్యనాయుడు తెలియజేశారు. సోమవారం నగరంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఏనాడూ ఈ విధంగా ధరలు పెరగలేదని, చివరకు చైనా యుద్ధం సమయంలో కూడా ధరలు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్పత్తి, డిమాండ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన దృష్టి సారించకపోవడం ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వెంకయ్యనాయుడు వివరించారు. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకూ ఛలో రాజ్‌భవన్‌ పిలుపు మేరకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు రాజ్‌భవన్‌కు చేరుకుని ధర్నా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అనంతరం మార్చి నెలలో ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ స్థాయిలో తమ నిరసనను తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఒకటి రెండు రోజుల్లో తాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కారీ, అధ్వానీ. సుష్మాస్వరాజ్‌లు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి ధరల పెరుగుదల అంశంపై చర్చించి, తమ పార్టీ వైఖరిని వ్యక్తం చేయనున్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి యేటా గణనీయంగా తగ్గిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేకపోతోందని వెంకయ్యనాయుడు విమర్శించారు. ఎగుమతులు, దిగుమతులు, ఇందనం వ్యయం, ఎరువులు, కొనుగోల్లు, అమ్మకాలు, పన్నులు వంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని, వీటిని సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తే ధరల పెరుగుదలను నియంత్రించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా 244 లక్షల టన్నుల నుంచి చక్కెర ఉత్పత్తి ఏకంగా 150 లక్షల టన్నులకు పడిపోయిందని, వరి ఉత్పత్తి కూడా ఇదే పరిస్థితిలో ఉందని ఆయన చెప్పారు. ఉత్పత్తులను పెంచుకోవాల్సింది పోయి నిరుపేదలకు అందించే రేషన్‌ కోటాను తగ్గించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనివల్ల సామాన్యుడి జీవన స్థితిగతులు దిగజారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
ట్రస్ట్‌ సేవలు మరింత విస్త ృతంకాగా స్వర్ణభారతి ట్రస్ట్‌ సేవలను మరింత విస్తృత పరచాలని నిర్ణయించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద ఏర్పాటుచేసిన ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతున్నామని ఆయన అన్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ నగరాల్లో కూడా ట్రస్ట్‌ను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సేవా రంగంపై ఆసక్తి, నిబద్దత ఉన్న వారిని ఎంపిక చేసి ట్రస్ట్‌ సేవలను విస్తృతపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కర్నాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh