online marketing

Wednesday, January 20, 2010

నెల్లూరొచ్చిన వైఙ్ఞానిక రైలు


వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:విద్యార్థుల్లో సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు భారత శాస్త్ర సాంకేతిక శాఖ మార్క్‌‌స ప్లాంట్‌ సొసైటీ (జర్మనీ) వారు ప్రారంభించిన వైఙ్ఞానిక రైలు (సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌) మంగళవారం నెల్లూరు రైల్వేస్టేషన్‌లో విద్యార్థులను అలరించింది. ఈ వైఙ్ఞానిక రైలును సింహపురి విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ వి.విశ్వేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మకతను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో అహ్మదాబాద్‌లోని విక్రమసారాభాయ్‌ సైన్స్‌ కేంద్రం వారు ఈ బాధ్యతను నిర్వర్తించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు రాసే దానికంటే చూసేదానివల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటారని, తెలుసుకున్న విషయాలను జీవితాంతం గుర్తించుకుంటారన్నారు. ఈ రైలులో పాలపుంత, బిగ్‌బ్యాంగ్‌ థీయరీ, మానవ శరీర నిర్మాణం, బయోటెక్నాలజీ లాంటి 300లకు పైగా సైన్స్‌ నమూనాలను పొందుపరచారని, వీటిని చూసి విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుని ఆకళింపు చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ రైలులో విద్యార్థులకు నమూనాలను గురించి క్షుణ్ణంగా వివరించేందుకు జిల్లా విద్యాశాఖ తరపున 30 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన రైలు జిల్లాకు రావడం వల్ల విద్యార్థులకు విఙ్ఞాన పరంగా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ రైలులో 20 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి జాయ్‌ ఆఫ్‌ సైన్స్‌ హ్యాండ్స్‌ అండ్‌ ల్యాబరేటరీలో రసాయన, భౌతిక, జీవ, గణిత శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను చేసేందుకు వీలు కల్పించారన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌ నుంచి ఈ రైలు బయలుదేరి ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీ వరకు భారత దేశమంతటా ఆయా రైల్వే స్టేషన్‌లలో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఈ ల్యాబ్‌లో ప్రయోగాలు చేయాలంటే తమ పేర్లను ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ ఆంథోనీ జయరాజ్‌ మాట్లాడుతూ వైఙ్ఞానిక రైలును సందర్శించేందుకు వస్తున్న విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో భాగంగా రైల్వే వైద్య సిబ్బందిని, రైల్వే పోలీసులను నియమించినట్లు తెలిపారు. పూర్తి జర్మన్‌ టెక్నాలజీతో తయారైన ఈ రైలును విద్యార్థులు సందర్శించి సైన్స్‌పై అవగాహన మరింత పెంచుకోవాలని కోరారు. విద్యార్థులు రైలును సందర్శించిన అనంతరం జాగ్రత్తగా తమ తమ విద్యాలయాల ఉపాధ్యాయులతో కలిసి తమ పాఠశాలలకు తిరిగి వెళ్లాలని కోరారు. స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, కనుక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నెల్లూరు స్టేషన్‌కు మొదటిసారిగా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ‘రెడ్‌ రిబ్బన్‌’, అనంతరం వైద్యాన్ని అందించే లైఫ్‌లైన్‌’ ఇప్పుడు విద్యార్థులకు విఙ్ఞానాన్ని అందించే సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే రైళ్లు రావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 21వ తేదీన ఈ రైలు నెల్లూరు నుండి కడపకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారి బంగారయ్య, సిబ్బంది రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh