Monday, January 18, 2010
అధికారుల నిర్లక్ష్యం
ఆత్మకూరు, (మేజర్‌న్యూస్): ప్రభుత్వం నిరుపేదల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన ఉపాధిహామీ పథకం నిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోల్‌మాల్ అయిన సంఘటన మండలంలోని బండారుపల్లి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన పేదలకు 90 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. లబ్ధిదారుల విన్నపం మేరకు భూఅభివృద్ధిపథకంలో భాగంగా నిధులు మంజూరు చేసి జంగిల్‌క్లియరెన్స్, మొక్కలు, మోట్లు తొలగింపు చేపట్టారు. భూమిని చదును చేశారు. అయితే ఆ భూమిలో ఏదైనా వ్యవసాయం చేయాలని ప్రభుత్వం తలంచి లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకంలో నిధులు మంజూరు చేసి జామాయిల్ మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఒక ఎకరానికి ప్రభుత్వం రూ.10,870లు మంజూరు చేసింది. వెయ్యి మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5000లు మంజూరు చేసింది. అయితే గ్రామానికి చెందిన లబ్ధిదారులు మొక్కల పెంపకం కోసం అధికారులను సంప్రదించి ఓ ట్రాక్టరు చేత దుక్కి చేయించారు. దీంతో గ్రామానికి చెందిన ఓ నాయకుడు స్థానికంగా ఓ ట్రాక్టరుడ్రైవర్‌ను ఎంపిక చేసి ట్రాక్టరుతో 30 ఎకరాలను దుక్కి చేయించాడు. ఒక ఎకరానికి రూ.750లు ఇస్తామని మాట్లాడుకున్నాడు. అయితే ఆ నాయకుడు అధికార పార్టీ అండదండలతో మండల అధికారులను మభ్యపెట్టి 90 ఎకరాలను దుక్కి చేసినట్లుగా బిల్లులు సృష్టించాడు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు తనిఖీ చేసినట్లు ఆదారాలు సృష్టించడం జరిగింది.ప్రభుత్వం ఏకంగా 90 వేల రూపాయలను మంజూరు చేసింది. ఆ నిధులు ట్రాక్టరు డ్రైవర్ పేరుతో ఈ నెల 13న మంజూరయ్యాయి. అయితే ఆ నిధులు డ్రా చేసిన తర్వాత తన చేతికి ఇవ్వాలని గ్రామంలోని నాయకుడు ట్రాక్టరు డ్రైవర్‌ను ఆదేశించాడు. నిధులు డ్రా చేసిన డ్రైవర్‌కు, గ్రామంలోని నాయకుడికి బ్యాంకు వద్ద వాదోపవాదన జరిగింది. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు తీసుకున్న ట్రాక్టరు డ్రైవర్ గ్రామంలోని నాయకుడి దౌర్జన్యంతో భయబ్రాంతులకు గురై అనంతసాగరం వైపు వాహనంపై పరుగులు తీశాడు. ఆ నాయకుడు మరో ఇద్దరి సహాయంతో వెంబడించాడు. అనంతసాగరం వరకు వెళ్లిన డ్రైవర్ అక్కడ ఓ చోట దాక్కున్నాడు. ఈ విషయాన్ని వాళ్ల తండ్రితో ఫోన్‌లో చెప్పాడు. ఆయన బోగసముద్రంలో ఉండగా విషయం తెలుసుకుని అనంతసాగరం వచ్చి కుమారుడ్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈ లోపు గ్రామంలో నాయకుడు ట్రాక్టరు డ్రైవర్ నా డబ్బుతో పరారయ్యాడని ప్రచారం చేసి, డ్రైవర్ కోసం కాపు కాశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ వ్యక్తిని ట్రాక్టరు డ్రైవర్ ఇంటికి పంపాడు. ఆయన డ్రైవర్‌తో ప్రభుత్వ నిధుల విషయమై మాట్లాడుతుండగా ఈ లోపు గ్రామంలోని కొందరు రాళ్లతో, కర్రలతో ట్రాక్టరుడ్రైవర్ ఇంటిపై దాడి చేశారు. వీధిలో ఉన్న ట్రాక్టరు టైర్లను ధ్వంసం చేశారు. నెల్లూరు నుంచి అద్దెకు ట్రాక్టరు తీసుకుని వచ్చి పని చేసిన డ్రైవర్‌కు గ్రామంలో ప్రభుత్వ నిధుల విషయమై చుక్కెదురైంది. అధికార పార్టీ నాయకులు దాడి చేయడంతో గాయాలపాలైన ట్రాక్టరుడ్రైవర్, బంధువులు 108కి సమాచారమిచ్చి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేసిన నిధులు స్వాహా చేయాలనే గ్రామానికి చెందిన నాయకుడు ట్రాక్టరుడ్రైవర్‌ను బినామీగా ఎంపిక చేసుకుని రంగం సిద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న ట్రాక్టరుడ్రైవర్ ఆ నిధులు అధికారపార్టీ నాయకుడికి ఇవ్వకపోవడంతో గ్రామంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు. ఏదేమైనా 30 ఎకరాలు పని చేసి ఏకంగా 90 ఎకరాలకు నిధులను మంజూరు చేయించడం, ఆ నిధులను స్వాహా చేయాలని భావించడం గ్రామంలో సంచలనం సృష్టించింది. అధికార పార్టీ అండదండలతో ట్రాక్టరుడ్రైవర్‌కు ఎవరు దిక్కులేకపోవడంతో ఆ ఇంటిపై దాడి చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించి నిధుల గోల్‌మాల్‌పై విచారణ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విషయం తెలియదు - అయినా విచారిస్తాం: ఎపిఓబండారుపల్లి గ్రామంలో జరిగిన ప్రభుత్వ నిధుల గోల్‌మాల్‌పై మేజర్‌న్యూస్ ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎపిఓ షీలాను వివరణ కోరగా ఆ విషయం తమకు తెలియదన్నారు. అయితే ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులేనని, గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు చేపడుతామని, రూ.90,000లు నిధులు మంజూరు చేశామని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment