Monday, January 18, 2010
పరిసరాల పరిశుభ్రం - వ్యాధులు దూరం
బుచ్చిరెడ్డిపాళెం, (మేజర్ న్యూస్) : ‘‘వుంచుదాం పరిసరాలను పరిశుభ్రంగా, తరుముదాం వ్యాధులను దూరంగా’’ అనే నినాదంతో అంటువ్యాధుల నిర్మూళనకు శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి నిమ్మల దశరథరామయ్య పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరిసరాల పరిశుభ్రతపై సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల పరిధిలో డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ ఫీవర్లను అదుపు చేసేందుకు జడ్‌పిటిసి, ఎంపిటిసి, గ్రామసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు నాయకుల సహాయసహకారాలు కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు గాను విలేజ్ శానిటేషన్, అన్‌టైడ్ నిధులను వినియోగించుకునేందుకు తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మురికి కాలువలను, పేడదిబ్బలను, చెత్తాచెదారాలను శుభ్రం చేసి స్ప్రేయింగ్, క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. విపరీతమైన జ్వరం, తలనొప్పి, కీళ్ళనొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందాలని ఆయన సూచించారు. మండల పరిధిలోని ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తులు వారానికి ఒక రోజు ‘‘డ్రైడే’’ ని పాటించి ఇళ్ళలో వున్న నీళ్ళ తొట్టెలు, వాటర్ ట్యాంక్‌లు, కూలర్లు, పూల కుండీలు లలో వున్న నీటిని తొలగించి ఆయా పాత్రలను తప్పకుండా ఎండబెట్టాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఙప్తి చేశారు. ఈ సత్కార్యానికి గ్రామాలలోని ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన మనవిచేశారు. అనంతరం మండల పరిధిలోని డెంగీ వ్యాధి లక్షణాలు, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న కట్టుబడిపాళెంలోని బెల్లంకొండ బాలకృష్ణ, బుచ్చి శాంతినగర్‌లోని ఎస్‌కె జిబేదా, జొన్నవాడలోని పిహెచ్ వెంకటప్రసాద్‌లను వారి ఇళ్ళకు వెళ్ళి పరామర్శించి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి భక్తవత్సలం, మండల హెల్త్ ఎడ్యుకేటర్ సిహెచ్ సుధాకర్‌రావు, హెల్త్ సూపర్‌వైజర్లు, వైద్యసిబ్బంది, ఆశావాలెంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment