online marketing

Wednesday, December 30, 2009

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న పథకాలు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జడ్పీ సమావేశమందిరంలో జరిగింది. అధికారుల ఊకదంపుడు ఉపన్యాసాలకు అడ్డుతగులుతూ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యుల ప్రశ్నోత్తరాలతో సాగిన సమావేశంలో విద్య, వైద్య సంబంధిత అంశాలపై కాస్త వాడివేడిగా చర్చ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని పలు సందర్భాలలో ప్రజాప్రతినిధులు అధికారులపై విరుచుకుపడ్డారు. మఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. హాస్టళ్లలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి వాకబు చేసినప్పుడల్లా ‘ప్రతిపాదనలు పంపాము. మంజూరు కాగానే పనులు చేపడతాం’ అనే సమాధానం అధికారుల నుంచి వస్తోందనీ, ప్రతి సమావేశంలోనూ అధికారులు ఇదే విధమైన సమాధానం వస్తోందని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు ఒక దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వెంకటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యురాలు తిరుపతిలో నివాసం ఉంటూ వారానికి ఒక్క రోజు మాత్రమే వైద్యశాలకు వస్తోందని స్థానిక శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ అధికారులకు ఫిర్యాదు చేయగా, జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వైద్య సిబ్బంది డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరతామన్నారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు అందుకునేందుకు త్వరలో జిల్లాస్థాయిలో తమ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టివి రమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో చికున్‌గన్యా, మలేరియా, సై్వన్‌ప్లూ, డెంగీ తదితర వ్యాధులు తీవ్రమవుతున్నాయనీ, ఇందుకు ప్రతిగా అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆశాజనకంగా లేవని జడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు.
హాస్టల్‌ విద్యార్థులకు అసౌకర్యం కలిగించొద్దు - కాకాణిజిల్లాలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహ భవనాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథక బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రూ.29 కోట్లు మంజూరు చేయడం జరిగిందనీ, ఆ నిధులను నియోజకవర్గాల వారీగా కేటాయించి పనులు అమలు చేసేందుకు సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకుంటూ ఆసుపత్రులలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపి చింతా మోహన్‌, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు పరసా రత్నం, బల్లి దుర్గాప్రసాద్‌రావు, కురుగొండ్ల రామకృష్ణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బి.రాఘవేంద్రరెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ టివిఎస్‌ రాజా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సీతామహలక్ష్మి, ఐటిడిఏ పిఓ రమేష్‌కుమార్‌, డిఇఓ డి.ఆంజనేయులు, డిఎంఓ డాక్టర్‌ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh