Wednesday, December 30, 2009
జబ్బునపడ్డ నెల్లూరు జిల్లా
నెల్లూరు, మేజర్‌న్యూస్:జిల్లాలో ఈ ఏడాది ప్రజారోగ్యం జబ్బున పడిందని చెప్పవచ్చు. మొదట్లో దీని ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ చివరి నాలుగు నెలల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సై్వన్‌ఫ్లూ భూతం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురయ్యేలా చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుంచి జిల్లాలో విషజ్వరాల తాకిడి ఎక్కువైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా జిల్లా విషజ్వరాలతో బాధ పడుతుంటే చాలదన్నట్టుగా వర్షాలు ఎక్కువ కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. వర్షపునీరు, మురికినీరు కలసి దోమలకు నిలయాలుగా మారిపోయాయి. కుళాయిల్లో నుంచి కలుషితమైన నీరు రావడం, విపరీతంగా దోమలు ప్రజలపై తమ విశ్వరూపం చూపడంతో డెంగ్యూ జ్వరాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా 15 మంది మృతి చెందారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కేవలం మూడు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యాధికి అనేకమంది చిన్నారులు గురై ప్లేట్‌లెట్ల సంఖ్య తీవ్రంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై చెనై్న, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. సకాలంలో వైద్యసదుపాయం పొందగలిగినవారు మాత్రం వేలాది రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకోగలిగారు. అయితే కొందరిని దురదృష్టం వెంటాడడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ముఖ్యంగా ఖరీదైన వైద్యసదుపాయం పొందే స్థోమత లేని పేదలు నగరంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల, డాక్టర్ రామచం్రద్రారెడ్డి ప్రజావైద్యశాల, నారాయణ, జయభారత్ తదితర ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్లేట్‌లెట్లు తయారు చేసే పరికరాలు సిద్ధంగా ఉంచినప్పటికీ అందుకు సంబంధించిన కొన్ని అనుమతులు, ఒకటి రెండు ముఖ్యమైన పరికరాల సరఫరా లేక ఇప్పటికీ వృధాగానే పడివున్నాయి. ఒక్క రెడ్‌క్రాస్ సంస్థ మాత్రమే నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు విరివిగా ప్లేట్‌లెట్లను అందజేయగలిగింది. ఇక చికున్‌గున్యా జ్వరాల విషయం చెప్పనవసరం లేదు. ప్రతి వంద మందిలో 70 మంది వరకు ఈ వ్యాధి బారిన పడ్డారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక ఇంట్లో ఒ రు ఈ వ్యాధిన పడితే తప్పకుండా అదే ఇంట్లో మరో ఇద్దరు ముగ్గురు పరిస్థితి కూడా అదే కావడం మామూలైపోయింది. చికున్‌గున్యా బారినపడి వారం రోజుల్లోగా కోలుకున్నప్పటికీ మరో నెల రోజులపాటు వారు శరీరంలోని ప్రతి అవయవం నొప్పి పుట్టేలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. అయితే జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ దృష్టిలో అధికారికంగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం హాస్యాస్పదం.అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏడాది నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో శస్తచ్రికిత్సలు వికటించి 23 మంది శాశ్వతంగా కంటిచూపు కోల్పోయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు కంటిచూపును కోల్పోవడం ఇదే ప్రధమం. ఈ ఏడాది అక్టోబర్ 19, 20వ తేదీల్లో నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో 29 మంది ఉచితంగా, మరో ఏడుగురు ఫీజు చెల్లించి ఆపరేషన్లు చేయించుకున్నారు.అయితే ఇంతటి ఘోర వైఫల్యానికి శస్తచ్రికిత్సలకు ఉపయోగించిన ‘రింగర్ లాక్టేట్’ అనే ఐవి ఫ్లూయిడ్స్ కారణంగా వైరస్ సోకి ఆపరేషన్లు వికటించినట్లు సంబంధిత నిపుణులు నిగ్గు తేల్చారు. ఈ విషయంలో ప్రభుత్వం సైతం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం నుంచి మరో రూ.1.50 లక్షలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే చివరకు ఆసుపత్రి యాజమాన్యం వైఫల్యం లేదని తేలడంతో సంబంధిత రింగర్ లాక్టేట్ తయారీ సంస్థ నుంచి ఏమైనా నష్టపరిహారం అందుతుందేమోనని బాధితులు ‘చీకటి ప్రపంచంలో’ ఉంటూ ‘మనో నేత్రాల’తో ఎదురు చూస్తున్నారు. ఇక మెదడువాపు వ్యాధి విషయంలో జిల్లాలో రెండు కేసులు అధికారికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ, మెదక్, ఆదిలాబాద్, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి నివారణకు సంబంధించిన వ్యాక్సిన్‌లను వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో తొలివిడతగా 4,43,635 మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాలనేది లక్ష్యం కాగా 3,90,918 మందికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రభుత్వం 84 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఇక రెండో విడతగా 4.30 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌లు ఇవ్వాల్సి వుంది. అయితే ప్రభుత్వం నుంచి చాలినన్ని సిరంజిలు సరఫరా కాకపోవడంతో ఈ కార్యక్రమం మరో నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. జిల్లాలో పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిలో భాగంగా వచ్చేనెల 10వ తేదీ, ఫిబ్రవరి 7వ తేదీలలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది జిల్లా తీవ్రస్థాయిలో జబ్బున పడిందని చెప్పకతప్పడంలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment