Friday, January 1, 2010
కేంద్రం నిర్ధిష్టమైన కమిటీని నియమించాలి
నెల్లూరు, మేజర్‌న్యూస్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన కమిటీని నియమించాలని మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కమిటీని నియమించడం ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను అన్ని ప్రాంతాల ప్రజలకు సవివరంగా తెలియజెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనవరి 5వ తేదీ అన్ని పార్టీల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించడం సరైన నిర్ణయమేమీ కాదన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యమం పార్టీల చేతుల్లోనూ, ప్రజాప్రతినిధుల చేతుల్లోనూ లేదనీ, అది ఏనాడో ప్రజల్లోకి వెళ్లిపోయిందని గుర్తుచేశారు. ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోవడం లేదనీ, కేవలం కొన్ని పార్టీలు మాత్రమే తమ ఉనికి కోసం ప్రత్యేక తెలంగాణా బాట పట్టాయని స్పష్టం చేశారు.కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రం నుంచి జైపాల్‌రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారనీ, మిగతా మంత్రులు కేబినెట్ సమావేశాలకు హాజరయ్యే వారు కాదని అన్నారు. దీన్నిబట్టి చూస్తే సమైక్యాంధ్ర ఉద్యమానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు కలగడం లేదన్నారు. తమిళనాడుకు చెందిన మంత్రి చిదంబరం ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని చూస్తున్నారనీ, తద్వారా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ను దూరంగా ఉంచడమే ఆయన ఆలోచనని ఆరోపించారు. చిన్నరాష్ట్రాల మీద శ్రద్ధ ఉంటే తమిళనాడును కూడా విభజించాలని చిదంబరంకు చురకలంటించారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నూనె మల్లికార్జునయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, అన్నం దయాకర్‌గౌడ్, సంపత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment