Wednesday, December 30, 2009
సమాజంలో పత్రికలది కీలక పాత్ర -- ఎమ్మెల్యే, కలెక్టర్
నెల్లూరు, మేజర్‌న్యూస్:ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు ప్రభుత్వానికి -ప్రజలకు వారధిగా నిలిచే పత్రికలది సమాజంలో ఎంతో కీలకపాత్ర అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్‌లు పేర్కొన్నారు. ‘సూర్య’ దినపత్రిక ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను వారు మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ విలేకర్లు నిజాన్ని నిర్భయంగా వార్తల రూపంలో అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తే సమాజంలో అవినీతిని పారదోలవచ్చన్నారు.సూర్య దినపత్రిక ఇలాంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకుని ప్రత్యేక సంచికలను ఆవిష్కరించుకోవాలని తాను మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జ్ మురళీధర్‌లాల్, ఎడిషన్ ఇన్‌చార్జ్ రమేష్‌బాబు తదితర అధికారులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే వార్తల వల్ల ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. పత్రికలకు విశ్వసనీయత ఎంతో అవసరమని, కొన్ని సందర్భాల్లో విశ్వసనీయత కోల్పోయే విధంగా వార్తలు ఉంటుండడం బాధాకరమన్నారు. ప్రస్తుతమున్న పోటీ సందర్భంగా సంచలనాల కోసం వస్తున్న కొన్ని వార్తలు సమాజానికి మేలు చేసేకన్నా కీడు జరుగుతుందనే విషయాన్ని పాత్రికేయులంతా గుర్తించాలన్నారు. విలేకరులు సామాజికంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా వ్యవహరించే పాత్రికేయులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య మనుగడ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుందని, సమాజాభివృద్ధికి పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ‘సూర్య’ దిన పత్రిక ఇలాంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని, సమాజాన్ని అన్నివిధాలా ముందుకు నడిపించేందుకు తనవంతు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భానుశ్రీ, కమిషనర్ టిఎస్‌ఆర్.ఆంజనేయులు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బరాజు, డిఇ సంజయ్, సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జ్ ఎస్.మురళీధర్‌లాల్, ఎడిషన్ ఇన్‌చార్జ్ రమేష్‌బాబు, అసిస్టెంట్ సర్క్యులేషన్ మేనేజర్ టి.కృష్ణారావు, సర్క్యులేషన్ ఆఫీసర్ జాన్ అహ్మద్, అడ్వర్‌టైజ్‌మెంట్ మేనేజర్ కె.కొండయ్య తదితర పాత్రికేయ సిబ్బంది పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment