అనుమసముద్రంపేట, (మేజర్‌న్యూస్): ఏఎస్‌పేటలో పోలీసులు స్వాధీన పరచుకున్న ఎర్రచందనం దుంగలు కడప జిల్లాకు చెందినట్లుగా మంగళవారం పోలీసులు నిర్థారించారు. గత ఆరు నెలలుగా ఏఎస్‌పేటలో ఎర్రచందనం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అప్పుడప్పుడు కడప జిల్లా పోరుమావిళ్ళ, బ్రహ్మంగారిమఠం పరిసర ప్రాంతాల దుంగలను కొందరు వ్యక్తులు ఏఎస్‌పేటలో ఓ చోట భద్రపరిచేవారు. ఇక్కడ నుంచి స్థానికుల సహాయంతో చెనై్నకు తరలించి వ్యాపారం నిర్వహించేవారు. అయితే మొత్తానికి పోలీసులకు సమాచారం అందడంతో ఏఎస్‌పేట ఎసై్స శ్రీనివాసరావు, ఆత్మకూరు సిఐ అక్కేశ్వరరావులు దాడి చేసి దుంగలను స్వాధీనపరచుకున్నారు. నింధితులు పది మందిగా తొలుత గుర్తించిన పోలీసులు సోమవారం అక్కడికక్కడే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహబూబ్‌బాషా, సోమవరపు సూర్యనారాయణ, షేక్ షబ్బీర్‌లు వారిలో ఉన్నారు. అయితే మంగళవారం వారిలో ఓ వ్యక్తిని తొలగించి మరో వ్యక్తిని నిందితునిగా నమోదు చేసి సాయంత్రం కోర్టుకు హాజరుపరిచారు. ఈ విషయమై స్థానికంగా పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి. పది మంది నిందితులుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం వారిలో ఒకరిని వదిలేసి మరో వ్యక్తిని నిందితునిగా కోర్టుకు హాజరుపరచడంతో ఈ సంఘటన వెనుక కొందరి నేతల హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఆరు నెలలుగా కడప జిల్లా నుంచి చాకచక్యంగా దుంగలను దర్గా పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ సంచరించే యాత్రికులను కళ్ళుగప్పి గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుండేది. దీనికి స్థానికంగా కొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ కేసును అటవీ శాఖకు అప్పగించేసేశారు పోలీసులు. మిగతా ఏడుగురి పరిస్థితి ఏమిటో ఆ పోలీసులకే తెలియాల్సి ఉంది.
నిన్న స్టేషన్‌లో... నేడు అంగట్లో....: ఎర్రచందనం కేసులో నిందితునిగా అదుపులోకి తీసుకున్న షేక్ షబ్బీర్ సోమవారం స్టేషన్‌లో కనిపించాడు. పోలీసులు ఈయన నిందితుడని పత్రికలకూ సమాచారమిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆ వ్యక్తి దర్గా వద్ద తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ కనిపించాడు. ఈ విషయమై స్థానికంగా చర్చ మొదలైంది. పోలీసులు నాయకుల సిఫార్సు మేరకే షబ్బీర్‌ను తొలగించారని గుసగుసలాడుతున్నారు.
అతను అమాయకుడు: ఎసై్సఏఎస్‌పేటలో సోమవారం పోలీసులు ఎర్రచందనం కేసులో అదుపులోకి తీసుకున్న షేక్ షబ్బీర్ అమాయకుడని, ఈ సంఘటనకు, అతనికి ఎలాంటి సంబంధం లేదని ఎసై్స శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం మేజర్‌న్యూస్‌కు వివరించారు. అయితే నిన్న షబ్బీర్‌ను నిందితునిగా గుర్తించారు కదా అని ప్రశ్నిస్తే అలాంటిదేమి లేదన్నారు. షబ్బీర్ స్థానంలో మస్తాన్‌సాహెబ్‌ను నిందితునిగా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామని ఆయన వివరించారు.
No comments:
Post a Comment