Wednesday, December 30, 2009
తె.రా.స.వి దౌర్జన్యపూరిత ఉద్యమాలు
నెల్లూరు(కల్చరల్/ఫత్తేఖాన్‌పేట) మేజర్‌న్యూస్:విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రత్యేక తెలంగాణా కోసం కెసిఆర్ చేస్తున్న ఉద్యమాలు దౌర్జన్యపూరితమని రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర వాదుల ప్రతినిధిగా మంగళవారం నగరంలోని బారాషాహిద్ దర్గాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల హృదయాల్లోంచి ఉద్భవించిందన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదులు ఉద్యమాల పేరుతో విద్యార్థులను ప్రలోభపెడుతూ, రాజకీయ నాయకులను బెదిరింపులకు గురి చేస్తూ దౌర్జన్యపూరితంగా ఉద్యమించడం ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి జాయింట్ యాక్షన్ కమిటీలుగాని, రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లుగాని లేకపోవడానికి కారణం ప్రజల హృదయాల్లోనుంచి ఉద్యమం ఆవిర్భవించడమేనన్నారు. అయితే ఏర్పాటుదారులు ఎల్‌టిడి తరహాలో విద్యార్థులను తయారుచేస్తూ ఆంధ్ర కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉద్యమాలు చేపట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తును కాలరాస్తూ ఆంధ్ర ప్రాంత వాసుల విద్యాసంస్థలపై దాడులు, యాజమాన్యానికి బెదిరింపులను ఆయన తీవ్రంగా నిరసించారు. కుల, మత, జాతి, వర్గాలకు అతీతంగా ఉండే సినీరంగంపై కూడా వేర్పాటువాదులు దాడులు చే యడం సిగ్గుచేటన్నారు. కళాకారులను కళాకారులుగా గుర్తించకుండా వేర్పాటువాద ధోరణితో దుందుడుకు చర్యలకు పాల్పడడంలోనే వారి బుద్ధి అర్ధమవుతుందన్నారు. కెసిఆర్ మెడలు వంచైనా సమైక్యాంధ్రను సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. అందుకోసం తమ పదవులను, ప్రాణాలను, ప్రజల కోసం వదులుకోడానికి సిద్ధమన్నారు. ప్రజలకు మంచి చేసే అవకాశం జీవితంలో ఒకసారే వస్తుందని, ఆ అవకాశాన్ని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు.సుదీర్ఘ చరిత్రగల కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులుగా ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులకు ఉందన్నారు. వేర్పాటువాద నాయకులతో చేరి రాజకీయ నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు క్షమించరని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలపై, వారి ఆస్తులపై దాడులు జరపడం ఎక్కువ కాలం చెల్లదన్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వారి ఆస్తుల జోలికి సమైక్యవాదులు వెళ్లడంలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఉదాహరణకు ఎంపి నామా నాగేశ్వరరావుకు చెందిన పవర్‌ప్రాజెక్టు గూడూరులో ఉన్నప్పటికీ సమైక్యవాదులంగా దాని జోలికే పోవడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో తమకు ఇష్టమొచ్చిన ప్రాంతాల్లో తమ వ్యాపార కలాపాలను నిర్వహిస్తున్న ఈ రోజుల్లో తెలంగాణా వేర్పాటువాదుల చర్యలను ఆయన దుయ్యబట్టారు.ప్రజలు, నాయకులు వాస్తవాలు తెలుసుకుని సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలన్నారు. రాజకీయ నిరుద్యోగులకు అండగా ఉండి ప్రజలకు కష్టాలు కలిగించే చర్యలకు పూనుకోవద్దని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌పార్టీ నాయకులకు ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మేయర్ నందిమండలం భానుశ్రీ, కార్పొరేటర్లు సందానీబాష, మునాఫ్, పిండి సురేష్, జయకుమార్ రెడ్డి, సాయిలలిత, కమిషనర్ టిఎస్‌ఆర్.ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు, వక్ఫ్‌బోర్డు సభ్యులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment