వెంకటగిరి : పట్టణంలోని ఉపాధ్యాయ కాలనీలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో మౌలిక వసతులు కరువై విద్యార్థినులు నానా అవస్థలుపడుతున్నారు.స్నానపు గదులు నీరు రాక నిరుపయోగంగా మారాయి. హాస్టల్‌లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీంతో బాలికలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని చెరువు దగ్గరకు వెళ్లవలసివస్తోంది. కానీ, ఆప్రాంతం చిట్టడవిని తలపిస్తుండడంతో బాలికలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో వారి అవస్థలు వర్ణనాతీతం. ఇక వసతిగృహంలో దోమల బెడద అధికంగా ఉంది.
దీంతో విద్యార్థినులు జ్వరాల బారిన పడుతున్నారు. వారానికోసారి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన వైద్యులు తూతూ మంత్రంగా సేవలందిస్తున్నారు. హాస్టల్‌లో పలువురు బాలికలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. వసతిగృహంలోని వంటగది కూలేందుకు సిద్ధంగా ఉంది. కనీసం విద్యార్థినులకు పరిశుభ్రమైన నీరు కూడా దొరకడంలేదు. విధిలేని పరిస్థితుల్లో కలుషిత నీరు తాగడంవల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ అధికారులు హాస్టల్ తనిఖీ చేస్తున్నా తమ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధు స్పందించి వసతిగృహంలో మౌలిక వసతులు కల్పించాల్సిందిగా విద్యార్థినులు కోరుతున్నారు.
No comments:
Post a Comment