online marketing

Monday, February 6, 2012

రైతు శ్రేయస్సుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని హామీ - చంద్రబాబు

 అసమర్ధత కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం రైతు పోరుబాటలో భాగంగా మండల పరిధిలోని 14వ మైలు దగ్గర నుంచి రైతు పోరుబాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 74 ఎడ్లబండ్లతో రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్పరెడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతుకు చెందిన మినుము పంటను పరిశీలించారు. అనంతరం రైతులకు జరిగిన నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దారుణంగా పంటలు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్పరెడ్డిపాళెంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ యానాదులను కలిసి తాము 5 సంవత్సరాలకు పైగా కాలనీ నిర్మించుకున్నామని, కానీ ఇంతవరకు కరెంటుగాని, రోడ్లు గానీ, ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోలేదని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులతో కలిసి పాదయాత్ర చేస్తూ పెదకొండూరు గ్రామంలో మహిళలను వారి సమస్యల గురించి ఆరా తీశారు. ఓ మహిళ తాము 20 ఎకరాల మినుము పంటను వే శామని, అది చేతికి వచ్చేసరికి 60 వేలు పైగా నష్టపోయామని బాధితురాలు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే మేకపాటి గెలిచి ప్రజలకు ఏమి ఒరగబెట్టారని ఆయన ఘాటుగా విమర్శించారు. రాబోయే 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కాయమని, రైతుల కన్నీల్లు తుడుస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం పెదకొండూరు నుంచి పాద యాత్ర కొనసాగుతూ పెదపాడు గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొల్లినేని వెం టరామారావు నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ
ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహం గ్రామంలో పెట్టడం సంతోషదాయకమని అన్నారు.

ఆ మహా నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలని, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. తదుపరి పోలంపాడు గ్రామంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి కలిగిరి వరకు పాదయాత్ర కొనసాగింది. ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని దేశ విదేశాలలో కూడా చెప్పుకునే విధంగా పార్టీని అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారని ఆయన ఘాటుగా విమర్శించారు.

గత సంవత్సరంలో డి.ఎ.పి ఎరువులు రూ.500 ధర పలికితే ప్రస్తుతం అది రూ. 1000 పెరగడంతో అటు ఎరువులు,ఇటు పురుగు మందులు కొనలేని పరిస్థితిలో నేడు రైతులు అధ్వానంగా మారారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ కోసం 9 రోజులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షలు చేశానన్నారు. ఈ అసమర్ధత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దద్ధమ్మల చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో 35 మంది ఎంపీలు ఉండి కూడా ఏమీ చేతగాని దద్ధమ్మల్లా వారు ఉన్నారని రైతు కోసం, రైతు శ్రేయస్సుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని హామీ ఇచ్చానన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెడుతున్నారని, అలాగే అక్రమ కేసులు కూడా పెడుతున్నారని వారి ఆటలు ఇక సాగవని బొల్లినేని, వంటేరు నాయకత్వాన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయాలేగాని చేతగాని దద్ధమ్మల్లా వ్యవహరించడంపట్ల ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఐ.ఏ.ఎస్‌ అధికారులను, రిజర్వుబ్యాంకు గవర్నర్లుగా ఒక ఉన్నతస్థాయిలో సర్వీసులకు పంపామని, కానీ నేడు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్‌ అధికారులను నేడు చెర్లపల్లి జైలుకు పంపి అవినీతి ముద్రవేస్తున్నారని ఆయన విమర్శించారు.

కోట్లు కోట్లు అక్రమ సంపాదన సంపాదించిన గాలి జనార్ధన్‌రెడ్డి అక్రమ సంపాదనకు కారణమైన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. వేల కోట్ల రూపాయల ధనాన్ని దోచుకున్న ఘనత ఆయనదేనన్నారు. మహిళలకు పావలా రుణాలు ఇప్పించి ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందన్నారు. 25 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా చేశారన్నారు. వై.ఎస్‌ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని విమర్శించారు. యువత ఉత్సాహం చూస్తుంటే 2014 లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని మహిళలు కోరారు. బీ.ఇడి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతామని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కోడెల శివప్రసాద్‌, కర్ణం బలరామక్రిష్ణమూర్తి, లాల్‌జాన్‌బాషా, టీడీపీ ఎమ్మెల్యేలు బీదా మస్తాన్‌రావు, బల్లిదుర్గా ప్రసాద్‌, పరసారత్నం, రామక్రిష్ణ, నూనె మల్లిఖార్జున యాదవ్‌, మండల టీడీపీ నాయకులు బిజ్జం వెంకటక్రిష్ణారెడ్డి, బిజ్జం బలరామిరెడ్డి, మంగళగిరి వేణు, కొండపల్లి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh