online marketing

Tuesday, March 20, 2012

ఈ సంవత్సరం అంతా ఎన్నికలతోనే సరిపోయేట్లుగా....


నెల్లూరు : జిల్లాలో ఇప్పటికే కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పుణ్యమా అని జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎన్నికల కోడ్‌తో అధికారులు నిలిపివేశారు. అయితే రానున్న రోజుల్లో సహకార ఎన్నికలు, ఆపై నెల్లూరు పార్లమెంటు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగబోతున్నట్లు ఎన్నికల అధికారులు సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుపబోయే మున్సిపల్‌ ఎన్నికలు కూడా జిల్లాలో జరుపనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా జిల్లా పరిషత్‌, పంచాయతీలకు పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ఎన్నికలు కూడా నిర్వహించకుండా కాలయాపన చేస్తూ వస్తుంది. నందన నామ నూతన సంవత్సరమంతా ఎన్నికలేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ రకంగా అన్ని ఎన్నికలు వెనువెంటనే ఒక్కొక్కటి గా జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుండడంతో ఈ సంవత్సరం అంతా ఎన్నికలతోనే సరిపోయేట్లుగా వుంది. అయితే జిల్లాలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన జరుగుతుండడం ఒక ఎత్తయితే, రాబోయే ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్‌ నిబంధనతో అభివృద్ధి మరింత కుంటుపడే అవకాశముందని, దీంకతో జనజీవనం అస్తవ్యస్తం కానుందా అని అభివృద్ధికి నోచుకోని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ నివేశన స్థలాల కోసం ప్రజలు 2009 నుండి ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నించక పోవడంతో పేద ప్రజలు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందిరమ్మ గృహాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సిమెంటు, ఇనుము రేట్లు పెరిగిపోవడంతో పేద ప్రజలు సొంత ఇళ్ల కోసం కనే కలలు కలలుగానే మిగిలిపోనున్నాయని పేదలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నందన నామ సంవత్సరమంతా ఈ ఎన్నికలతోనే సరిపోనుందని, మా బతుకులింతేనా...? అని పేద ప్రజలు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh