online marketing

Monday, March 19, 2012

నేటి నుంచి పోలేరమ్మజాతర అత్యంత వైభవంగా


తూర్పుకనుపూరు : భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన ముత్యాలమ్మ ఆలయంలో నేటి నుంచి పోలేరమ్మజాతర అత్యంత వైభవంగా జరగనుంది. తీరప్రాంతంలోని తూర్పుకనుపూరు, అద్దేపల్లి, కొమరావారిపాళెం, బల్లవోలు, పోసినవారిపాళెం, ఈదలవారిపాళెం, రావులవారిపాళెం గ్రామాల ఆరాధ్యదైవంగా వెలుగొందే ముత్యాలమ్మ కాలక్రమంలో భక్తుల సంఖ్యను పెంచుకుంటూ జిల్లాలోని నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాలైన చెన్నై, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికోసం వస్తుంటారు.

100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో తమలపాకుల వ్యాపారం చేసుకుంటున్న రామయ్యశెట్టికి అమ్మవారు కలలో కనిపించి తూర్పుకనుపూరు ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు అక్కడివారు చెపుతుంటారు. ఈ క్రమంలో అప్పట్లో పూరిగుడిసెలో అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టారు. అనంతరం వేమారెడ్డి వంశస్తులు రాతిగోడలు నిర్మించి అమ్మవారికి గుడి కట్టారు. కాలక్రమంలో భక్తులు అధికసంఖ్యలో వస్తుండడంతో దేవాదాయశాఖ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. నేటి నుంచి 23వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే చుట్టు ప్రక్కల గ్రామాల్లో చాటింపు వేయించి ఆదివారం ఘటోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ఘటం తూర్పుకనుపూరు, ఈదలవారిపాళెం గ్రామాల్లో సోమవారం వరకూ సంచరించగా, మంగళవారం కొమరవారిపాళెం, రావులవారిపాళెం, పోసినవారిపాళెం గ్రామాల్లో తిరిగి తూర్పుకనుపూరుకు చేరుకుంటుంది. ఘటం చేరుకున్న వెంటనే పోలేరమ్మ విగ్రహాన్ని తయారు చేసేందుకు కుమ్మర్లు సిద్ధం అవుతారు. అనంతరం గంగ మిట్టమీద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి గణాచారి కొమ్ముబూర ఊది జాతర ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తారు. జాతర ఆరంభమవుతుంది. ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh