Monday, January 25, 2010
నేర మనస్తత్వాన్ని విడనాడి సత్‌పౌరుడుగా మెలగాలి
పొదలకూరురోడ్డు (నెల్లూరు) మేజర్‌న్యూస్: జైలు నుండి విడుదలైన ఖైదీలు మరలా నేరాలు చేసి జైలుకు రాకుండా సత్ప్రవర్తనతో మెలుగుతూ ఏదో ఒక పని చేసుకుని బతుకు సాగించాలని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ ఛైర్మన్ రెడ్డెపరెడ్డి ఖైదీలనుద్దేశించి ఉద్బోధించారు. జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన న్యాయ విఙ్ఞాన వేదికలో ఆయన మాట్లాడుతూ మనదేశం బ్రిటిషువారి పరిపాలనలో ఉన్నప్పుడు శిక్షలు చాలా కఠినంగా ఉండేవని, ఆ స్థితి ఇప్పుడు లేదని, ఖైదీల్లో ప్రవర్తన తీసుకురావడానికి కారాగారంలో మంచి పరిసరాలను ఆహ్లాదకర వాతావరణాన్ని, ఖైదీలకు ఆరోగ్య వసతులను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. గతంలో ఖైదీలను అండమాన్ జైలుకి పంపి చిత్రహింసలకు గురి చేసేవారని, అలాంటి పరిస్థితి నేడు లేదు కనుక నేర మనస్తత్వాన్ని విడనాడి సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా గౌరవమైన జీవనం గడపాలని ఆయన తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రెటరీ ఎస్‌వి. చలపతి మాట్లాడుతూ ఖైదీలకు లీగల్ సెల్ అథారిటీ ఎన్నో సేవలు కల్పించిందని, వాటిని వినియోగించుకుని విడుదలైన ఖైదీలు మంచి పౌరునిగా, నేర చర్యలకు దూరంగా ఉండాలని, అలాగాక మరలా నేరాలు చేసి జైలుకు వస్తే కఠినమైన శిక్షలకు గురికాక తప్పదని, క్షమాభిక్షలు ఉండవని ఆయన ఖైదీలకు హెచ్చరించారు. కారాగారంలో గ్రీవెన్సెస్ బాక్స్‌లను ఏర్పాటు చేశారని, వాటిని ఖైదీలు ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. అనంతరం నిర్వహించిన జైలు అదాలత్‌లో పలు నేరాలు చేసి ఎంతో కాలంగా రిమాండ్‌లో ఉన్న ఖైదీలైన ఐదవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో ఏడు కేసులు, రెండవ అదనపు మెజిస్ట్రేట్‌లో నాలుగు కేసులు, కావలిలో ఒక కేసు మొత్తం 12 కేసులను పరిష్కరిస్తూ ఆ కేసులలోని ఖైదీల రిమాండ్ కాలాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తూ వారిని విడుదల చేయుటకు జిల్లా కేంద్ర కారాగార అధికారులకు జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ ఛైర్మన్ రెడ్డెపరెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ జైలు అదాలత్ కార్యక్రమానికి ముందుగా జైలు పరిసరాలను, ఖైదీల వసతి సౌకర్యాలను రెడ్డెపరెడ్డి పరిశీలించి తెలుసుకున్నారు. జైలు అదాలత్ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారిగా ఐదవ అదనపు మొదటి తరగతి న్యాయమూర్తి అనూరాధ, కామేశ్వరి, టి.శ్రీనివాసరావు, టివి.రావు, పివి.ప్రసాద్‌రావు, పిసి.కృష్ణయ్య, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఫరూఖ్ ఆలీఖాన్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment