online marketing

Monday, March 26, 2012

కోవూరు ఉప ఎన్నికలపుణ్యమా.. అని పదేళ్ల క్రితం తప్పిపోయిన ఈ చిన్నోడు సొంతూరికి చేరాడు


ఇందుకూరుపేట : రాజస్థాన్‌కి చెందిన ఇతను పదేళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేశాడు. ఎక్కడెక్కడో తిరిగి, చివరికి ఇందుకూరుపేట మండలం నిడుముసలిలో పశువుల కాపరిగా చేరాడు. కోవూరు ఉప ఎన్నికలపుణ్యమా.. అని ఈ చిన్నోడు సొంతూరికి చేరాడు. ఎన్నికల బందోబస్తుకు రాజస్థాన్ నుంచి వచ్చిన స్పెషల్ బెటాలియన్ జవాన్‌లతో ఈ అబ్బాయి మాట కలిపాడు. అందులోని ఓ జవాన్‌ది ఈ కుర్రాడి ఊరు కావడం విశేషం. ఇక చెప్పేదేముంది... రతన్ ఊరు చేరడానికి అతను సహకరించాడు. తల్లిదండ్రులు ఇందుకూరుపేటకు వచ్చి సోమవారం కుమారుడు స్వగ్రామానికి తీసుకెళ్లారు.

(ఇందుకూరుపేట) రాజస్థాన్ రాష్ట్రం రాజాసర్జన్ జిల్లా గిలుండీ గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్, దేవ్ దంపతుల పెద్ద కుమారుడు రతన్ (5). చిన్ననాటి స్నేహాలు, అల్లరిచిల్లర తిరుగుళ్లలో చదువులో వెనుకపడ్డారు. పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. వారు చేయి చేసుకోవడంతో చెన్నైకి రైలెక్కి వచ్చేశాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఆ కుర్రాడిని రైల్వే అధికారులు నెల్లూరులో దించేశారు. ఊరుగాని ఊరు...తెలియని భాషతో తంటాలు పడ్డాడు. బస్టాండులో తిరుగుతూ ఈ గిరిజన దంపతుల కంట పడ్డాడు. రతన్ చెప్పేది తెలియక ఆకలితో అలమటిస్తున్నట్లు గమనించిన వారు అతని ఆకలి తీర్చారు. సొంత వారు ఎవరూ లేకపోవడంతో తమ వెంట తీసుకెళ్లారు. కొద్ది రోజులు కూలి పనులకు పంపారు.

పశువుల కాపరిగా చేరి... అక్కడి నుంచి నిడిముసలికి చేరుకుని రైతు ఆదిశేషయ్య వద్ద పశువుల కాపరిగా చేరాడు. అతను వచ్చి పదేళ్లు గడిచినా చిరునామా సక్రమంగా చెప్పకపోవడంతో నిడిముసలిలో ఉండిపోయాడు. కోవూరు ఉప ఎన్నికల బందోబస్తు కోసం రాజస్థాన్‌కు చెందిన ఓ బెటాలియన్ వచ్చింది. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా నిడిముసలికి ఈ బెటాలియన్ చేరుకుంది. అక్కడ రతన్ తారసపడడంతో మాటా మాట కలిపారు. రతన్ చెప్పిన చిరునామా మేరకు బెటాలియన్‌లోని ఓ జవాన్‌ది గిలుండీ గ్రామం కావడం విశేషం. దీంతో పూర్తి వివరాలు తెలుసుకుని రతన్ తల్లిదండ్రులతో ఆ జవాన్ మాట్లాడాడు. ఆ జవాన్ చొరవతో రతన్ తల్లిదండ్రులు సోమవారం నిడిముసలికి చేరుకున్నారు.

రతన్ చిన్నప్పటి ఫొటోలు, దుస్తులు తదితర ఆధారాలను తీసుకువచ్చి పోలీసులకు చూపారు. గ్రామస్థులు కూడా ఈ ఆధారాలు చూసి సంతృప్తి చెందారు. దీంతో రతన్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం రాత్రి సొంతూరికి పయనమయ్యారు. కోవూరు ఉప ఎన్నికలు పుణ్యమా అని పదేళ్ల క్రితం తప్పిపోయిన తమ బిడ్డ కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh