online marketing

Sunday, February 12, 2012

ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద రోజు రోజుకూ ట్రాఫిక్‌ అధికం..



  • నెల్లూరు నగరం నడిబొడ్డున వున్న ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద రోజు రోజుకూ ట్రాఫిక్‌ అధికం అవుతుండడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ ఈ సర్కిల్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండడంతో అత్యవసర పనులపై వెళ్లేవారు తీవ్ర వెతలు పడుతున్నట్లు నగర వాసులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం సుమారు 3 గంటలపాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ ట్రాఫిక్‌లో 108 కూడా ఇరుక్కుపోవడంతో అందులో వున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. 


నగరంలోని నుండి తూర్పు వైపుగా వెళ్లే ప్రాంతాలకు ఈ బస్టాండ్‌ వద్ద గతంలో వున్న గేట్లను పూర్తిగా తెరచివేయడంతో నగరంలో నుండి తూర్పు వైపు వెళ్లే వాహనాలు, తూర్పు వైపు నుండి నగరంలోకి వచ్చే వాహనాలు, అలాగే చెనై్న నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు, విజయవాడ నుండి చెనై్న వైపు వెళ్లే వాహనాలు ఈ సర్కిల్‌ నుండే వెళ్లాల్సి వుండడంతో కేవలం ఈ కొద్ది సర్కిల్‌లోనే గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే పరిస్థితి ఎదురవుతుంది. దీనికి తోడు నగరంలో నుండి వచ్చే ఆటోలు ఆత్మకూరు బస్టాండ్‌కు ఇవతల వైపు వున్న ఫ్లెక్సీ బోర్డుల వద్దే యు టర్న్‌ తీసుకుంటూ ఆత్మకూరు బస్టాండ్‌లోకి వెళ్తుండడంతో తూర్పు వైపు నుండి నగరంలోని వచ్చే వాహనదారులకు ఈ యు టర్న్‌ వద్ద అడ్డంగా ఆటోలను, బస్టాండ్‌ వద్దకు తీసుకెళ్లేందుకు ఆటోలు తిప్పుతుండడంతో తరచూ ఈ పాయింట్‌ వద్దే ట్రాఫిక్‌ జామ్‌ అవుతూ ఆటో వారికి, వాహన చోదకులకు తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.

ఆ ప్రాంతంలోని ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కనీసం 108 వాహనానికి అడ్డం జరుగుదామన్న అవకాశం కూడా లేకుండా ట్రాఫిక్‌ నిలబడిపోవడంతో ఈ అంబులెన్స్‌ వెళ్లేందుకే కనీసం ముక్కాలు గంట పైగా పట్టిందంటే ఈ ప్రాంతంలో ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమైపోతోంది. నగరంలో ఏ దిశగా వెళ్లాలన్నా ఇది ప్రధాన కూడలిగా ఉండడమే ఇందుకు కారణంగా వుంది. కేవలం ఈ ప్రాంతంలో నలుగురైదుగురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఉంటుండడంతో వాహనదారులు వీరిని కూడా లెక్క చేయకుండా తమ ఇష్టానుసారం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ సందు దొరికితే దూరేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతోనే తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందన్న వ్యాఖ్యలు కూడా లేకపోలేదు.


ఫలితంగా కూడా ఈ ప్రాంతంలో విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతూ గంటల కొద్దీ ఈ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కునే పరిస్థితి ప్రయాణీకులకు ఏర్పడుతుంది. అలాగే ఆత్మకూరు బస్టాండ్‌ ఉత్తరం వైపు వున్న ద్వారం వద్ద ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు వందలాది ఆటోలు అడ్డదిడ్డాలుగా నిలిపివేయడం, ప్రైవేట్‌ బస్సులను అదే ప్రాంతంలో నిలిపివేస్తుండడంతో కూడా ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ విపరీతంగా ఆగిపోతూ రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నగరవాసుల నుండి ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఎప్పటి నుండో ఈ బస్టాండ్‌ను ఈ ప్రాంతం నుండి దూరంగా తరలించాలన్న నగర వాసుల కోరికను పాలకులు కాని, అధికారులు కాని పట్టించుకోకపోవడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఈ బస్టాండ్‌ను అల్లీపురం ప్రాంతంలోని ప్రభుత్వ భూమి, కార్పొరేషన్‌ భూమిలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా అధికారులు ప్రభుత్వానికి సిఫారసులు కూడా చేయడం జరిగింది. అయినా అవి ఇప్పటివరకు అమలు కాకపోవడంపై పలు రకాల విమర్శలు ఎదురవుతున్నాయి. ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ను అరికట్టాలంటే ఇప్పటిలో సాధ్యమయ్యే పని కాదన్న విషయం జగమెరిగిన సత్యమే. ఈ ప్రాంతంలో ఎంత మంది ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లను నియమించినా వారు నియంత్రించలేకపోవడం గతంలో జరిగిన సంఘటనలే ఉదాహరణ. జిల్లాకు కొత్తగా వచ్చిన ప్రతి ఎస్‌పి బాధ్యతలు స్వీకరించగానే జిల్లాలో వున్న అతి పెద్ద ప్రధాన సమస్య ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద వున్న ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తామని ప్రకటనలు ఇవ్వడం పరిపాటి. అనంతరం పాలకుల నుండి వచ్చే ఒత్తిడితో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేయడం జరుగుతోంది.

ఈ దశలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించాలంటే నగర నడిబొడ్డున వున్న ఈ బస్టాండ్‌ను నగర శివారు ప్రాంతాలకు తరలించడమేనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది తప్ప ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేందుకు మరో మార్గం లేదనేది నగరవాసుల అభిప్రాయం. మరి ఈ దిశగా మన పాలకులు ఎందుకు ప్రయత్నించడం లేదనేది నగరవాసుల్లో మెదలుతున్న శేషప్రశ్న. మరి ఈ ప్రాంతం నుండి నగర శివారు ప్రాంతాలకు తరలించాలా లేక ఇదే ప్రాంతంలో వుంచి నగరవాసులను మరింత ఇబ్బందులకు గురి చేస్తారా అనేది వేచి చూడాల్సివుంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh