online marketing

Monday, December 7, 2009

’దృష్టి’కి బొల్లినేని ‘షాక్‌’

నెల్లూరు:జిల్లాలో పనిచేసే ఉన్నతాధికారులు ముఖ్యంగా కలెక్టర్‌, ఎస్‌పి తదితరులు ఎంత కాలంపాటు పనిచేస్తారో ఖచ్చితంగా చెప్పలేని రోజులివి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే సుమారు రెండు నుంచి నాలుగేళ్లపాటు పనిచేయగలిగితే అది విశేషమే. అయితే తాము పనిచేసిన కాలంలో జిల్లాలో ఏదోఒక ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టి దానిని విజయవంతం చేసి తనదైన ముద్ర వేసుకునేందుకు అధికారులు కృషి చేయడం మామూలే. రాజకీయ నేతల జోక్యం కాని, స్వయంకృతాపరాధం, పదోన్నతులు రావడం, పనితీరు సక్రమంగా లేకపోవడం తదితర కారణాల వల్ల బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే వారు బదిలీలు అవుతుండడం జరుగుతూ వుంటుంది. అయితే పనితీరులో ఒక్కో అధికారిది ఒక్కో రకమైన స్టైల్‌. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రవిచంద్ర ‘ప్రజ్వలిక’ పేరుతో చదువులో అత్యంత ప్రతిభ కనబరచిన పేద విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించి వారికి కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించేవారు.

ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ తనదైన శైలిలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల విషయంతోపాటు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశా ల్లో 10వ తరగతి వరకు చ దువుతూ కంటిచూపుకు దూరమవుతున్న వారికి ‘దృష్టి’ కార్యక్రమం ద్వారా కంటి చూపును ప్రసాదించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నారాయన.

అయితే అక్టోబర్‌ నెల19,20వ తేదీల్లో నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో జరిగిన క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు వికటించి 23 మంది శాశ్వతంగా కంటిచూపు కోల్పోయిన సంఘటన ఈ ‘దృష్టి’ కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడేలా చేసింది. పెద్ద ఎత్తున ప్రజలు కంటిచూపును కోల్పోయిన ఈ సంఘటన రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరగకుండా ఉండివుంటే అక్టోబర్‌ 26 నుంచి డిసెంబర్‌ నెలాఖరులోపు కంటిలో శుక్లాలు, మెల్లకన్ను (స్కింట్‌), రెప్ప వాలిపోవడం (టోసిస్‌) ఆపరేషన్లు పూర్తయి ఉండేవి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడం... చలికాలం కావడం.... పండుగలు.... పరీక్షలు... ఇలా పరిస్థితులు అనుకూలించక పోతుండడంతో ఇక ఈ కార్యక్రమం వచ్చే ఏడాది వేసవి సెలవుల తర్వాతేనని పలువురు విద్య, వైద్యాధికారులు చెబుతున్నారు.

వైద్యం ఎంతో ఖరీదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్న విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యశాలల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు జిల్లాలో రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దృష్టి’ కార్యక్రమానికి ఈ ఏడాది ఆగస్టు 1న కలెక్టర్‌ రాంగోపాల్‌ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివే 2.37 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మరో 50 వేల మంది విద్యార్థులకు నిర్వహించాల్సివుంది.

ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా అంధత్వ నివారణ సంస్థ, గుంటూరులోని శంకర ఐ హాస్పిటల్‌, నగరానికి చెందిన మోడరన్‌, బొల్లినేని, నారాయణ, బాలాజీ ఐకేర్‌ వైద్య సంస్థలకు చెందిన కంటి వైద్య నిపుణులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి విద్యార్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. జిల్లాలోని పెళ్లకూరు, వింజమూరు మండలాలకు చెందిన ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులను సైతం పరీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 328 మెల్లకన్ను (స్కిన్ట్‌), 51 క్యాటరాక్ట్‌ (శుక్లాలు), 32 రెప్పవాలిపోవడం (టోసిస్‌) కేసులను గుర్తించి వారికి ఆపరేషన్లు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకుగాను ముందుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆపరేషన్లు అవసరమైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పించి తమ పిల్లలకు ఆపరేషన్లు చేయించేందుకు ఒప్పించారు.

అదేవిధంగా జిల్లాపరిషత్‌ సిఇఒ బి.రామిరెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ ఎం.మంజులమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు, జిల్లాలోని ఎంఇఒలకు అవగాహన సదస్సులను సైతం నిర్వహించారు. కంటి శుక్లాల ఆపరేషన్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో, స్కింట్‌, టోసిస్‌ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరులోని శంకర ఐ ఆసుపత్రిలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ రాంగోపాల్‌ అన్నివిధాలా ఏర్పాట్లు సిద్ధం చేయించారు.

సరిగ్గా ఈ ఆపరేషన్లు మొదలు పెట్టే వారం రోజుల ముందు బొల్లినేని సంఘటన జరగడంతో అందుకు సంబంధించిన విచారణ పనుల్లో జిల్లా కలెక్టర్‌, అంధత్వ నివారణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ మంజులమ్మ తీరికలేకుండా విధులు నిర్వహించే పనిలో ఉండగా అంతకు ముందుగానే ఈ ‘దృష్టి’ కార్యక్రమాన్ని చేపట్టిన రాజీవ్‌ విద్యామిషన్‌ పిడి డాక్టర్‌ యుగంధర్‌ కుమార్‌ గుంటూరు జిల్లాకు బదిలీ కావడంతో ఆపరేషన్లకు తాత్కాలికంగా బ్రేక్‌ పడ్డట్టు అయింది. సాధారణంగా ప్రస్తుత చలికాలంలో కంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు పెద్దలు సైతం ముందుకురాని పరిస్థితి. కారణం చలి, కన్ను మానదని, చీము పట్టడం, జలుబు, దగ్గు, తుమ్ములు వంటివి వస్తాయనే భీతి ప్రతి ఒక్కరిలో ఉండడం సహజం. ఇటీవల మెదడువాపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై వైద్యాధికారులతో తన చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ రాంగోపాల్‌ చర్చిస్తూ ‘దృష్టి’ కార్యక్రమానికి బొల్లినేని సంఘటన ఇబ్బంది కలిగించిందని నిరాశగా చెప్పడం గమనార్హం.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh