నెల్లూరు రూరల్, మేజర్‌న్యూస్:జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన ములుముడి పంచాయతీ సర్పంచ్ పదవికి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గ్రామ పరిస్థితుల పట్ల అటు పోలీసు, ఇటు రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆది నుండి కమ్యూనిస్టులకు పట్టుగల ఈ గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో సైతం సిపిఎం పార్టీకి చెందిన అట్ల నరసయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే గ్రామ కక్షలు, వర్గ పోరాటాల్లో భాగంగా ఇటీవల కాలంలో అట్ల నరసయ్య హత్యకు గురి కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
అయితే ఉప ఎన్నికలో ఇతర పార్టీలు పోటీలో ఉండవని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రావడంతో ఇక్కడ వాతావరణం వేడెక్కుతుంది. తాము కోల్పోయిన సర్పంచ్ పదవిని తిరిగి చేజిక్కించుకునేందుకుగాను అట్ల నరసయ్య వర్గీయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు సైతం ఈ గ్రామంలో అత్యధిక ఓట్లు ఉండడంతో ఈ సారి సర్పంచ్ పదవి తమదే అనే ధీమాను కాంగ్రెస్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అభ్యర్థికి అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించలేకున్నా, తమ మనసుల్లోని అభిమానంతో ఓట్లు వేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. గ్రామంలో ప్రాబల్యం గల రెండు సామాజిక వర్గాలు, మైనారిటీ ఓట్లు సర్పంచ్ విజయాన్ని నిర్ణయించ గలుగుతున్నాయి. అయితే వీరిలో బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారికంటే ఎన్నికల రోజున తమ నిర్ణయాన్ని బ్యాలెట్ ద్వారా వ్యక్తపరిచేవారే అధికం. దీనిని బట్టి 23వ తేదీ మధ్యాహ్నం నుండి వెలువడనున్న ఫలితాల్లో మాత్రమే ఇక్కడి బలాబలాలు వ్యక్తం కావాల్సివుంది.
అయితే ఈ గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో బెల్టుషాపులు, మద్యం విక్రయాలను పూర్తిగా నిరోధించారు. అదేవిధంగా గతంలో నేర చరిత్ర గలవారిని సైతం ముందుగా బైండోవర్ చేసుకునే ప్రయత్నాలు ఇప్పటి నుండే చేస్తున్నారు. ఇక్కడి ఎన్నికలు జిల్లాస్థాయిలో సమస్యాత్మకం అయ్యే నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు సైతం ఈ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూరల్ సిఐ వై.జయరామసుబ్బారెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ ఎం.రోశయ్య ఈ గ్రామంలోని శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్టేషన్‌కు ఈ గ్రామం 13 కి.మీటర్ల దూరంలో ఉన్నా కూడా తరచూ తాను పర్యవేక్షిస్తూ, ప్రతినిత్యం కానిస్టేబుళ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించే దిశగా చర్యలు చేపట్టారు.
No comments:
Post a Comment