నెల్లూరు:దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, అనార్కలి-సలీం... ఇలాంటి అమర ప్రేమికులు, ప్రేమజంటలు నేటి రోజుల్లో కనుమరుగయ్యాయనడం నగ్న సత్యాలు. ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో ముక్కుపచ్చలారని, అభం శుభం తెలియని ఆడపిల్లలను వశపరచుకుని ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిలింగ్ చేయడం ఎక్కువైంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో లైంగిక కార్యకలాపాలు సాగించి రహస్యంగా ఫొటోలు, వీడియో తీయించడం, ఆ తర్వాత డబ్బు కోసం వారిని మానసికంగా క్షోభకు గురి చేయడం, అడుగడుగునా బ్లాక్‌మెయిల్ చేయడం. అయితే తెలిసో తెలియకో ఇలాంటి మేకవన్నె పులుల చేతికి చిక్కిన ఆ బాలికలు ఈ విషయాన్ని ఇతరులతో చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక, తమలో తామే కుంగిపోతూ నిత్యం చస్తూ బతుకుతున్నారు. కాస్త సున్నిత మనస్కులైన వారైతే ఈ హాలాహలం వంటి సత్యాన్ని తమలోనే దాచుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విషయం కాస్తా తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తూ తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్న నయవంచకులకు శాపనార్థాలు పెట్టడం మినహా మరో మార్గం లేని పరిస్థితి.
ఇటీవల కాలంలో నెల్లూరు నగర ంలో కొన్ని మానవ మృగాలు డబ్బు కోసం ఈ సరికొత్త పథకాన్ని రూపొందించుకుని అమలు జరుపుతున్నాయి. ముందుగా ఈ మానవ మృగాలు బాగా స్థితిమంతులైన స్కూల్, కళాశాలల్లో చదివే విద్యార్థినిలను ఎంపిక చేసుకుంటున్నాయి. ఆ తర్వాత మోటార్‌బైక్‌లు, కార్లలో నిత్యం వారి వెంట తిరుగుతూ ప్రేమ పేరుతో వారిని ఆకర్షించి ఆ తర్వాత చిన్నగా వారిని ముగ్గులోకి దింపడం మామూలైంది.
తాజాగా నగరానికి చెందిన ఒక మైనర్ బాలికను ఇదేవిధంగా ఒక మానవ మృగం ప్రేమ పేరుతో నమ్మించి వశపరచుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మపలికి ఆ బాలికతో లైంగిక కార్యక్రమాలకు పాల్పడి ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం సంబంధిత ఫోటోలు, వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత నుంచి ఆమెను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేయనారంభించాడు. లేకపోతే ఈ ఫొటోలు, వీడియోను బహిర్గతం చేస్తానంటూ నిత్యం ఆమెను వేధించసాగాడు. దీంతో తాను చేసిన తప్పును తమ పెద్దల ముందు ఒప్పుకున్న ఆ బాలిక జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తమకు తెలిసినవారి ద్వారా సంబంధిత యువకుడితో మధ్యస్తం నడిపారు.
ఎలాగోలా సమస్య పరిష్కారం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నయవంచకుడి నుంచి ఫొటోలు, వీడియోలను మధ్యవర్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను తమకు చూపించమని అడిగిన బాలిక తల్లిదండ్రులతో మధ్యవర్తులు ‘ఈ ఫొటోలు, వీడియో చూస్తే మీరు చనిపోతారు వద్దులే’ అనడం కొసమెరుపు. నగరంలో అనేకమంది మానవమృగాలు జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతుండడంతో అందుకు కావాల్సిన డబ్బు కోసం ఇలాంటి అవతారాలు ఎత్తుతూ తమ పనులను చాపకింద నీరులా సాగిస్తున్నారు. అయితే వెలుగు చూస్తున్న ఇలాంటి సంఘటనలు ఏ ఒకటో రెండో. నగర పోలీసులు ఇలాంటి సంఘటనలపై నిఘా ఉంచి మానవ మృగాల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment