Friday, January 8, 2010
రిలయన్స్ సంస్థలపై విరుచుకపడ్డ కాంగ్రెస్
నెల్లూరు, మేజర్‌న్యూస్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతిలో రిలయన్స్ యాజమాన్యం హస్తం ఉందంటూ రష్యన్ మేగజైన్‌లో ఒక కథనం వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో జిల్లా వ్యాప్తంగా రిలయన్స్ సంస్థకు చెందిన పలురకాల వ్యాపార సంస్థలపై కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం రాత్రి 9.30 గంటల నుంచి విరుచుకపడ్డారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో ఉన్న రిలయన్స్ వెబ్ వరల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఎల్‌సిడిలు, టివిలు, మానిటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేయడంతోపాటు కొంత సామాగ్రిని రోడ్డుపై వేసి తగలబెట్టారు. ఈ దాడుల వ ల్ల సుమారు రూ.5 లక్షల మేర విలువ చేసే పరికరాలు ధ్వంసం అయ్యాయని సంబంధిత ఉద్యోగులు పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రిలయన్స్ సంస్థలపై దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం తెలియగానే ముందుగా రిలయన్స్ వెబ్‌వ రల్డ్ వద్దకు ఒకటవ నగర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు చేరుకుని దుకాణాన్ని మూసివేయమంటూ చెబుతుండగానే సుమారు వంద మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా వచ్చి క్షణాల్లో అక్కడి వస్తువులను, పరికరాలను ధ్వంసం చేశారు. అనంతరం ట్రంకురోడ్డులో రోడ్డు డివైడర్లపై ఏర్పాటు చేసివున్న రిలయన్స్ సంస్థకు చెందిన అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులను ధ్వంసం చేశారు. వెంటనే కెవిఆర్ పెట్రోల్‌బంకు వద్ద గల రిలయన్స్ సూపర్‌మార్కెట్‌పై కార్యకర్తలు దాడికి పాల్పడేందుకు వస్తుండగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తుగా ఉండడంతో కార్యకర్తలు వెనుదిరిగారు. నెల్లూరు నగరంలో కాంగ్రెస్‌పార్టీ మైనారిటీ నేతలు ఈ దాడులకు పాల్పడడం గమనార్హం. కార్పొరేటర్ అబ్దుల్ మునాఫ్, మైనారిటీ నేత ఆసిఫ్‌పాషాల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మునాఫ్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రియతమ నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని రిలయన్స్ యాజమాన్యం పొట్టనపెట్టుకుందనే వార్తను తాము జీర్ణించు కోలేకున్నామన్నారు. ఈ క్షణం నుంచి తాము రిలయన్స్ సంస్థకు చెందిన ఉత్పత్తులను ఏమీ ఉపయోగించమని, తాము వినియోగిస్తున్న రిలయన్స్ సిమ్ కార్డులను కూడా వారు చించివేశారు. రాష్ట్రంలో ‘రిలయన్స్’ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని వారు హెచ్చరిక చేశారు. ఈ విషయంలో తాము ఎంతటి పనికైనా పూనుకుంటామని చెప్పారు. అదేవిధంగా కోవూరు సమీపంలోని జాతీయరహదారిపై ఉన్న రిలయన్స్ పెట్రోలు బంకును కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.సమాచారం అందిన వెంటనే కోవూరు సిఐ విఎస్.రాంబాబు ఈ దాడులకు పాల్పడిన కోవూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, విడవలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా రిలయన్స్ సంస్థలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు నిర్వహించారు. జిల్లాలో కొన్నిచోట్ల ఈ దాడులు సంభవించినప్పటికీ పోలీస్‌శాఖ అప్రమత్తమై ముందు జాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా రిలయన్స్ సంస్థకు చెందిన పెట్రోల్ బంకులు, సెల్‌ఫోన్ టవర్లు, రిలయన్స్ కార్యాలయాలు, సూపర్‌మార్కెట్‌లు తదితర వ్యాపార సంస్థలవద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డి నగరంలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రిలయన్స్ సంస్థలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడుల గురించి జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డితో మేజర్‌న్యూస్ ప్రస్తావించగా ఇలాంటి దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. శాంతి భద్రతలకు, రిలయన్స్ సంస్థ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. డిఎస్సీ రాధిక, నగర సిఐ పి.వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో రిలయన్స్ సూపర్‌మార్కెట్‌తోపాటు రిలయన్స్ సంస్థల వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. టివీలలో డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రె డ్డి మృతి వెనుక రిలయన్స్ సంస్థ ప్రమేయం ఉందన్న వార్తలు ప్రజల్లో తీవ్ర కలకలాన్ని రేకెత్తించాయి.
సంయమనం పాటించండి : కోటంరెడ్డి ఈ విషయంపై ప్రజలు సంయమనం పాటించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో సూచించినట్లు పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు. ఇందులో నిజానిజాలు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment