online marketing

Friday, January 8, 2010

ఛిద్రమైన మధ్య తరగతి బతుకులు


గూడూరు, (మేజర్‌న్యూస్‌) : రాను రాను మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా తయారవుతోంది. ఇటు ఆదాయంలో పెరుగుదల లేకపోయె, ఇటు ప్రభుత్వ సాయం కోసం చేయి చాపలేరు. ఒకవేళ అర్ధించినా అర్హులు కారనే నెపంతో మొండిచేయి చూపుతుండె. ఇక ఎలా జీవనం సాగించాలో అర్థం కాక నిత్యం మానసిక సంఘర్షణకు లోనవుతూ ఎలాగోలా గత్యంతరం లేని బతుకులీడుస్తున్నారు. స్వాంత్య్రం సిద్ధించిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. అదేవిధంగా పిల్లల చదువులు, వైద్యం ఇలాంటి తప్పనిసరి ఖర్చులు కూడా మోయలేని భారంగా తయారయ్యాయి. వీటికి తోడు తాజాగా రవాణా చార్జీలు పెంపు. ఇలా ఏ రంగంలో తీసుకున్నా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇక రాబోయే బడ్జెట్‌లో ఎన్ని రకాలుగా వడ్డనలు జరుగుతాయో తెలియని పరిస్థితి.సాధారణంగా సమాజంలో మూడు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి ధనికులు, తరువాత మధ్య తరగతి, పేదలు. ఇందులో మొదటి వర్గానికి చెందిన ధనికులు జనాభాలో తక్కువ శాతం మాత్రమే ఉంటారు. ఈ ధరల పెరుగుదల వారికి ఏవిధమైన భారమూ కాదు. ఇకపోతే పేదల విషయానికి వస్తే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది, అంతేగాక ఆదాయ వనరులు కూడా కొంతమేర మెరుగుపడ్డాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకండా మనుగడ సాగించగలరు. ఈ రెండు వర్గాలనూ మినహాయిస్తే సమాజంలో అత్యధిక శాతం మధ్య తరగతి ప్రజానీకానిదే. వీరి పరిస్థితే వర్ణనాతీతంగా తయారైంది. అటు ప్రభుత్వం నుండీ ఏదీ అందదు, పన్నులు చెల్లింపూ అనివార్యం. ఈ కోణంలో పాలక, అధికార యంత్రాంగాలు ఆలోచించిన దాఖలాలు లేవు. కులాల్నే అగ్రవర్ణాలు, దళితులు అని రెండుగా చీల్చుకుని నాయకులు ఆయా కులాల ప్రాపకం కోసం ఏవేవో చేసుకుంటూ పోతున్నారు. ప్రభుత్వోద్యోగులు కూడా మధ్య తరగతి కుటుంబీకుల్లో అత్యల్ప శాతం మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగుతూ వస్తే రాబోయే కాలంలో మూడు వర్గాలూ ఉన్నా స్థాయి మాత్రం మారుతుంది. ధనికులు, పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు అధిక శాతం నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి పొంచి ఉంది. అసలు ఈ ధరలు నియంత్రణ లేకుండా ఎందుకు పెరుగుతున్నాయనే విషయం ఎవరూ ఆలోచించడం లేదనే అభిప్రాయం మధ్య తరగతి ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉంది. ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసం అని ఉద్యమాలను భుజాన వేసుకుని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సుడిగుండంలోకి తీసుకెళ్తున్నారు. కానీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నేడు సామాన్య ప్రజల జీవన పరిస్థితులపై ఉంది. గత కొద్ది నెలల క్రితం వరకూ రవాణా శాఖ ఆదాయంలో ఉంది. కానీ నేడు నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాలను అధిగమించేందుకు చార్జీల పెంపే మార్గం అని ఇష్టారీతిన పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కారణం సంస్థలోని అధికారులా లేక ప్రభుత్వమా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివిధ దశల్లో పరిస్థితిని పరిశీలించి సమగ్రంగా సమీక్షించి లోపాన్ని గుర్తించి తగిన చర్యలు చేపట్టినట్లయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు జీతాలు పెంపు విషయం సహేతుకమే కావచ్చు. కానీ ఆ మేరకు ఫలితాలు, రాబడిని కూడా అందుకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్‌, తక్కువ పన్నులతో అభివృద్ధి పథంలో పయనిస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దేశంలో అతి పెద్ద మొత్తంతో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో సాధించిందేమిటో అంతుబట్టడం లేదు. ఇటీవల సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని కేంద్రం ముందు వాపోవడం చూస్తుంటే ఈ లక్ష కోట్ల బడ్జెట్‌ అనేది కేవలం అంకెల గారడీగానే భావించాల్సి వస్తోంది. ఒక వైపు బడ్జెట్‌లో అధిక శాతంలో ఎక్కువ మొత్తం కేటాయించిన ప్రాజెక్టులు అయితే ఏ మాత్రం పనిజరగడం లేదు, మరి ప్రాజెక్టులకు వెచ్చించాల్సిన మొత్తం ఏమైనట్లో. ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రాంతాల వారీగా నాయకులు నిత్యం వల్లె వేస్తున్న వీరికి ప్రజల కష్టాలు వీరికి పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా జె.ఎ.సి.లుగా రూపాంతరం చెంది అటు సమైక్యం, మరో వైపు విభజనకు పోటా పోటీలు పడుతున్నారు కానీ ఈ విషయంలో ఎందుకు ఈ విధమైన చర్యలు చేపట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం కొద్ది సంవత్సరాల కాలంలోనే వారి గౌరవ వేతనాలు కూడా నాలుగురెట్లు చేసుకున్నారు.కానీ మధ్య తరగతి కుటుంబీకుల పరిస్థితి మాత్రం వీరు ఆలోచించరు. నిత్యం కోర్టులు చొరవ చూపుతూ అనేక విషయాలను పరిరక్షిస్తున్నా ధరల విషయంపై మాత్రం దృష్టి సారించకపోవడంతో యంత్రాంగం ధరల నియంత్రణ గాలికి వదిలేసినట్లుంది. మానవ హక్కుల ఉల్లంఘన క్రింద పాలకులను దోషులుగా చేయడం కూడా సబబేనేమో అనిపిస్తోంది. మానవుని ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కునే పాలక, అధికార యంత్రాంగాలు హరించి వేస్తున్నాయి. ఆత్మహత్యల వరకూ తీసుకెళ్తున్నాయంటే ఇక ప్రజాస్వామ్యంలో పాలన, ప్రజల కోసం, ప్రజల చేత అనేది ప్రహసనంగానే తయారైంది. కనీసం ఇకనైనా వ్యవస్థలో సమూల మార్పుల కోసం నాంది పలికేందుకు పాలక, అధికార యంత్రాంగాలు దృష్టి సారిస్తే భవిష్యత్తులో పొంచిఉన్న విపత్తులు, అరాచకాలను నిరోధించే అవకాశం ఉంది. లేదంటే దుష్పరిణామాలు అనివార్యం అనిపిస్తోంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh